మళ్లీ వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో ఇంటర్వ్యూలు
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తులదారులకు ఈ–మెయిల్ ద్వారా సమాచారం చేరవేశాయి. ఇంటర్వ్యూలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
హెచ్1బీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, సోషల్ మీడియాలో వారు చేసిన పోస్టులను క్షుణ్నంగా తనిఖీ చేయాలంటూ అమెరికా ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద, అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు తేలితే వీసా లభించదని డొనాల్డ్ ప్రభుత్వం పరోక్షంగా స్పష్టంచేసింది. ప్రొఫైల్స్ సైతం అనుమానాస్పదంగా ఉంటే వీసా ఇంటర్వ్యూకు పిలుపు రాకపోవచ్చు.
తాజా ఆదేశాల నేపథ్యంలోనే భారత్‌లో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అమెరికా నుంచి ఇండియాకు వచ్చినవారు ఇప్పటికిప్పుడు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హెచ్1బీ వీసా ఇంటర్వ్యూ వెంటనే జరగకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. వారు మరో నాలుగైదు నెలలపాటు వేచి చూడక తప్పదు.
హెచ్1బీ మాత్రమే కాకుండా ఇతర వీసాల ఇంటర్వ్యూలను సైతం వాయిదా వేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులను, ప్రొఫైళ్లను తనిఖీ చేసిన తర్వాత వారికి ఇంటర్వ్యూ పిలుపులు రావొచ్చు. వీసా దరఖాస్తుదారులెవరూ కాన్సులర్ కార్యాలయాలకు రావొద్దని అమెరికా ఎంబసీ సూచించింది. కొత్త అపాయింట్‌మెంట్ తేదీ కోసం వేచి చూడాలని స్పష్టంచేసింది.
ఇంటర్వ్యూలు వాయిదాపడిన దరఖాస్తుదారులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జరగాల్సిన ఇంటర్వ్యూ వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా పడిందని ఓ యువకుడు వాపోయాడు. ఇదిలా ఉండగా, ఇంటర్వ్యూలను వాయిదా వేయడాన్ని అమెరికా కంపెనీలు తప్పుపడుతున్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులు దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి.


