ట్రంప్ ఉద్దేశం అది కాదు
వాటిపై ఆయనకు అవగాహన లేదు
వైట్‌హౌస్ కీలక ప్రకటన
భారతీయులకు భారీ ఊరట
న్యూయార్క్: అమెరికాలో క్షణక్షణ గండంగా గడుపుతున్న భారత హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట. వారిని అమెరికన్లతో భర్తీ చేసి వారిని భారత్‌కు తిప్పి పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు వైట్‌హౌస్ ఫుల్‌స్టాప్ పెట్టింది. అలాంటి ఆలోచనకు అధ్యక్షుడు అస్సలు మద్దతివ్వడం లేదని స్పష్టం చేసింది. హెచ్–1బీ వీసాలను గురించి ఆయనకున్న అవగాహన అత్యంత పరిమితమని వెల్లడించింది! ఈ విషయమై ట్రంప్‌కు ఉన్నది కేవలం సాధారణ పరిజ్ఞానంతో కూడిన అవగాహన మాత్రమేనని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు.
హెచ్–1బీ వీసాదార్లను అమెరికన్లతో భర్తీ చేస్తారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా ఆమె ఈ మేరకు స్పష్టతనిచ్చారు. దీనిపై ట్రంప్ వైఖరిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అధ్యక్షుని కోరికల్లా ఒక్కటే. విదేశీ కంపెనీలు అమెరికాలో లక్షలాది కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాలి. విదేశీ వృత్తి నిపుణులతో తమతో పాటు వెంటబెట్టుకు రావాలి. కొత్త తరం వాణిజ్య పోరులో ఏ దేశాన్నైనా ముందు వరుసలో నిలిపే బ్యాటరీల వంటి కీలక ఉత్పత్తుల్లో అమెరికాను అగ్రగామిగా నిలపాలి.
అయితే, అంతిమంగా ఆయా ఉద్యోగాల్లో అమెరికన్లే ఉండేలా చూడాలన్నది ట్రంప్ లక్ష్యమని కూడా లెవిట్ చెప్పుకొచ్చారు! ‘మా దేశంలో వ్యాపారం చేయాలంటే మా దేశస్తులనే ఉద్యోగాల్లోకి తీసుకోవడం మంచిది’అని ఆయా కంపెనీలకు ట్రంప్ స్పష్టంగా చెప్పారన్నారు. ‘‘ప్రస్తుత గందరగోళం అంతటికీ ఆ స్టేట్‌మెంటే కారణం. కానీ అధ్యక్షుని ఉద్దేశం అంతా అనుకుంటున్నది మాత్రం కాదు’’అంటూ ముక్తాయించారు. అమెరికా ఉత్పత్తి రంగం మున్నెన్నడూ లేనంతగా కోలుకుని దూసుకుపోవాలన్నదే ట్రంప్ కల అన్నారు. నిజానికి ఆయా దేశాలపై టారిఫ్‌ల విధింపు వెనక అధ్యక్షుని ఏకైక ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు. విదేశీ కంపెనీలు తమతో పాటు సొంత వృత్తి నిపుణులను వేలాదిగా అమెరికాకు తీసుకు రావాలని, వారంతా కీలక వృత్తి నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పి స్వదేశాలకు వెళ్లిపోవాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే.


