దేశాల మధ్య సహకారం పెంపొందించటం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత సాధించాలన్న సంకల్పంతో పదిహేడేళ్ల క్రితం ఏర్పడిన జీ20 తొలిసారి అమెరికాను ధిక్కరించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో వరసగా రెండు రోజులు కొనసాగి ఆదివారం ముగిసిన సంస్థ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ముఖం చాటేయగా, దాన్ని బతిమాలటా నికీ, నచ్చజెప్పి ఒప్పించటానికీ ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నించిన దాఖలా లేదు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన విపరీత పోకడలతో ఇంటా బయటా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.
శ్వేతజాతి అమెరికన్లకు ఏదో ఒరగబెడుతున్నట్టు కనబడటం కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణ క్షీణత పెద్ద బోగస్ అని వాదించటమేగాక, బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను వినియోగించే పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. వేరే దేశాలు కూడా తన బాటలోనే నడవాలంటూ ప్రోత్సహి స్తున్నారు. మానవ కార్యకలాపాల పర్యవసానంగా భూగోళం వేడెక్కుతున్నదని, ఇది ధరిత్రి మనుగడకే పెను ముప్పని శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు.
అంతర్జాతీయంగానూ అదే బాణీ అందుకున్నారు. జొహాన్నెస్‌బర్గ్ సదస్సు ప్రధాన ధ్యేయమే వాతావరణ మార్పులపై చర్చించి తగు చర్యల కోసం ప్రపంచ దేశాలకు పిలుపునివ్వటం గనుక ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సదస్సు ఎజెండాను మార్చమంటూ గత కొన్ని వారాలుగా ఒత్తిడి తెచ్చారు. అది సాధ్యపడక పోవడంతో శ్వేత జాతి మైనారిటీల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని, అందుకు నిరసనగానే సదస్సుకు గైర్హాజరు కాదల్చుకున్నట్టు ప్రచారం లంకించు కున్నారు. ట్రంప్‌కు వంతపాడే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కూడా సదస్సుకు రాలేదు.
కావడానికి జీ20 సంపన్న రాజ్యాల సంస్థే అయినా దక్షిణాఫ్రికా వంటి వెనకబడిన దేశంలో సదస్సు జరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై ఉమ్మడి అవగాహ నకు రావాలన్న ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందులో వర్ధమాన దేశాలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా గల దేశా లకూ, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 85 శాతం వాటా ఉన్న ఆర్థిక వ్యవస్థలకూ ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సు నుంచి దూరం జరిగితే ప్రపంచంలో ఏకాకిగా మిగులుతామన్న స్పృహ ట్రంప్‌కు లేకపోయింది.
‘నేను లేకుండా శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్‌ను విడుదల చేయొద్దని ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా సదస్సు బేఖాతరు చేసింది. అంతేగాక సంప్రదాయానికి భిన్నంగా తొలి రోజునే డిక్లరేషన్‌ను ఆమోదించింది. తన గైర్హాజర్ అయోమయాన్ని సృష్టించి, డిక్లరేషన్ ఆమోదానికి అధినేతలు తటపటా యిస్తారని ట్రంప్ అనుకున్నారు. కానీ ‘అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగద’ని జీ20 తేల్చిచెప్పింది. వాస్తవానికి సంస్థ అధ్యక్ష పదవి అమెరికాకు రావాలి. కానీ సదస్సుకు
ట్రంప్ గైర్హాజరు కావటం, కనీసం ఉన్నతాధికారులనైనా పంపక, జూనియర్ అధికారితో సరిపుచ్చటానికి నిరసనగా అధ్యక్ష పదవి బదిలీకి దక్షిణాఫ్రికా నిరాకరించింది.
అది ఎప్పుడుంటుందో, అసలు జీ20లో అమెరికా కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికాలోని మియామిలో వచ్చే ఏడాది జరగాల్సిన తదుపరి సదస్సుపైనా అనిశ్చితి అలుముకుంది. భారత, చైనా, రష్యాలేకాక అమెరికా శిబిరంలో ఉండాల్సిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, కెనడాలు సైతం ఈ సదస్సులో పాల్గొని వాతావరణ సమస్యలపైనా, ప్రపంచ అసమానతలపైనా దృష్టిపెట్టిన డిక్లరేషన్‌ను ముక్తకంఠంతో ఆమోదించాయి.
పునరుత్పాదక ఇంధన వనరులపై, నిరుపేద దేశాల రుణవిమోచనపై కూడా అవగాహన కుదిరింది. భారత్ సూచించిన విధంగా ఉగ్రవాదంపైనా, మాదకద్రవ్యాలపైనా సమష్టిగా తలపడటానికి ఆమోదం తెలిపాయి. వాతావరణ సమస్యలపై శిఖరాగ్ర సదస్సు అంగీ కారానికి రావటం ట్రంప్ జీర్ణించుకోలేనిది. సదస్సు ఆమోదించిన అంశాల్లో మెజా రిటీ పేద దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవే. తనది ఇక గత వైభవమేనని, ఇటువంటి సదస్సులకు దూరంగా ఉంటే అంతిమంగా తన ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని అమెరికా గ్రహించాలి.


