ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. తన మొదటి భార్య అనిత మరణం తర్వాత దిల్‌రాజు 2020లో తేజస్వినితో కలిసి ఏడడుగులు వేశారు. అయితే, వారి పెళ్లి తర్వాత సోషల్‌మీడియాలో కొన్ని విమర్శలు వచ్చాయి. కేవలం ఆస్తి కోసమే దిల్‌రాజును ఆమె పెళ్లి చేసుకుందని కామెంట్లు చేశారు. ఆపై వారిద్దరి వయసు గురించి కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయం గురించి ఈ దంపతులు ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేదు. అయితే, తాజాగా తేజస్విని తమ్ముడు డాక్టర్ తరుణ్ ఉండవల్లి పలు విషయాలు పంచుకున్నారు.

మేము బ్రాహ్మిణ్
'మా బావగారు రెడ్డి సామాజిక వర్గం అని అందరికీ తెలిసిందే.. కానీ, మేము బ్రాహ్మిణ్. మా అక్క ఒక ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్ధలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేది.. అందరూ అనుకున్నట్లు ఆమె ఎయిర్‌హోస్ట్ కాదు. ఆమె చదువుకున్నది అంతా మెడికల్ విభాగం. కానీ, అనుకోకుండా కొద్దిరోజులు ఎయిర్‌లైన్స్‌లో పనిచేసింది. బావ (దిల్‌రాజు)తో అక్కడే పరిచయం ఏర్పడింది. తను తరుచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అలా పెళ్లి వరకు వెళ్లారు. అయితే, మొదట మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా మా అమ్మమ్మను ఒప్పించడం చాలా కష్టమైంది. ఆమె పాతకాలం మనిషి కాబట్టి ఒప్పించేందుకు కొంచెం టైమ్ పట్టింది. మా అక్క కోసమే ముందుకు అడుగువేశాం. అయితే, మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.

అక్కను ఒక మహారాణిలా మా బావగారు చూసుకుంటారు. ఆయన నోటి నుంచి ఒక తప్పడు మాట రాదు. చివరకు తన దగ్గర పనిచేసే వాళ్లను కూడా తిట్టరు. మా బావ బంగారమని చెబుతాం. అయితే, కొందరు తన ఆస్తి కోసమే మా అక్క పెళ్లి చేసుకుంది అంటారు. అందులో నిజం లేదు. మా కుటుంబంలో అందరం బాగా చదువుకున్నవాళ్లమే.. నేను డాక్టర్, మా అమ్మ, తమ్ముడు ఇద్దరూ హైకోర్టులో వర్క్ చేస్తారు. మా నాన్నకు వ్యాపారాలు ఉన్నాయి. డబ్బు పరంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఇలాంటి మాటలు మేము పట్టించుకోము. వారిద్దరినీ ఒక డెస్టినీనే కలిపింది అనుకుంటాను. మా అక్కతో నాకు చాలా అనుబంధం ఎక్కువ. ఆమె సంతోషంగా ఉండటమే మాకు కావాలి. మేము అనుకున్నదానికంటే తనను మా బావాగారు చాలా ఎక్కువగానే చూసుకుంటున్నారు.' అంటూ తరుణ్ చెప్పుకొచ్చారు.


