వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. అణు ఒప్పందం అంశంపై ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించారు. రాబోయే 10 రోజుల్లో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ తన అణు మొండితనాన్ని వీడకపోతే, తాము సైనిక చర్య వేయక తప్పదని ఆయన పరోక్షంగా యుద్ధ సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా.. ఇరాన్‌పై ముందస్తు దాడుల కోసం అమెరికా దాడుల కోసం యూకే ఎయిర్‌బేస్‌ను సాయం కోరింది. అయితే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం.. అమెరికా అభ్యర్థనను తిరస్కరించింది. RAF Fairford (స్విండన్ దగ్గర), డియాగో గార్షియా ఎయిర్‌బేస్‌ను ఉపయోగించి ఇరాన్‌పై ముందస్తు దాడులు చేయడానికి బ్రిటన్ అనుమతి ఇవ్వలేదు. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని కారణం చూపిస్తూ నిరాకరించింది. కాగా, డియాగో గార్షియా చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించే యూకే ప్రణాళికతో ఈ వివాదం ముడిపడింది. డియాగో గార్షియా బేస్‌ను 99 ఏళ్ల లీజ్‌పై తిరిగి పొందే ఒప్పందం (£35 బిలియన్ విలువ) చర్చలో ఉంది. ఈ బేస్ అమెరికాకు ఇండో–పసిఫిక్, మధ్యప్రాచ్య కార్యకలాపాలకు కీలకంగా ఉండటం గమనార్హం. డియేగో గార్షియా చాగోస్ దీవుల్లో అతి పెద్దది. ప్రస్తుతం యూఎస్-యూకే సంయుక్త సైనిక స్థావరం కావడం విశేషం.
చట్టపరమైన ఆందోళనలు..
ఇదిలా ఉండగా.. 2001 తర్వాత యూకే విధానంలో పలు మార్పులు జరిగాయి. ఒక మిత్రదేశం చేసే చట్టవిరుద్ధ దాడికి సహకరిస్తే బ్రిటన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే ముందస్తు దాడులకు మద్దతు ఇవ్వడంలో బ్రిటన్ జాగ్రత్తగా ఉంది. ఇంతకుముందు కూడా యూకే, అమెరికా ఇరాన్‌పై చేసిన దాడుల్లో నేరుగా పాల్గొనలేదు. కేవలం రక్షణ చర్యల్లో మాత్రమే సహకరించింది.
ట్రంప్ స్పందన..
మరోవైపు.. యూకే ప్రధాని స్టార్మర్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించి తీవ్ర విమర్శలు గుప్పించారు. చాగోస్ దీవులపై నియంత్రణను వదులుకోవద్దని హెచ్చరించారు. అలాగే, అత్యంత అస్థిరమైన, ప్రమాదకరమైన పాలన ద్వారా జరిగే దాడిని నిర్మూలించడానికి అమెరికాకు డియెగో గార్షియా, RAF ఎయిర్‌బేస్ అవసరం కావొచ్చు అంటూ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా హెచ్చరించారు. అయితే, డియాగో గార్షియా.. అమెరికా దీర్ఘదూర ఆపరేషన్లకు అత్యంత కీలకమైన బేస్‌గా ఉంది.
ఇరాన్‌తో అమెరికా ప్రతిపాదనలు ఇవే..
అణు ఒప్పందంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ ముందు ప్రధానంగా మూడు ప్రతిపాదలను పెట్టంది. ఇరాన్ తన యురేనియం శుద్ధిని పూర్తిగా ఆపివేయాలని, ఇరాన్ అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను వదులుకోవాలని, పశ్చిమ ఆసియాలో తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. మరోవైపు.. ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సైనిక మోహరింపును కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' యుద్ధ నౌకకు తోడుగా, అత్యాధునిక 'యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' యుద్ధ విమాన వాహక నౌక జిబ్రాల్టర్ జలసంధి మీదుగా పశ్చిమ ఆసియాకు చేరుకుంటోంది. అదనంగా 50కి పైగా అత్యాధునిక ఫైటర్ జెట్లు, డజన్ల కొద్దీ ఇంధన ట్యాంకర్లను అమెరికా సిద్ధం చేసింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై ఏ క్షణమైనా దాడులు చేసేలా ఇప్పటికే వైమానిక దళానికి ఆదేశాలు అందాయి.


