తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారంలో చోరీ కేసులో ఆలయ సీనియర్ తంత్రి (మాజీ ప్రధాన పూజారి) కందరారు రాజీవరుకు బెయిల్ మంజూరైంది. రాజీవరుకు నేడు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బంగారం చోరీకి సంబంధించిన రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించడంతో ఆయన రిమాండ్ నుంచి బయటకు రానున్నారు.
కాగా శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో ఆలయ అర్చకులు కందారారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజీవరను సిట్ అధికారులు జనవరి తొమ్మిదో తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, ఆయన 41 రోజులుగా పోలీసులు రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. కోర్టు ఆయనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా తేల్చలేదు.. కేవలం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజీవరు ఏ6గా ఉన్నారు. ఇక, ఈ కేసులో ఆయన అరెస్టు 11వది కావడం విశేషం.
ఏమిటి ఈ కేసు?
2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్‌మాల్ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.


