breaking news
gold theft case
-
శబరిమల కేసులో నటుడు జయరామ్ విచారణ
శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్‌ని సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి జయరామ్ పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సంబంధం గురించి సిట్ ఆరా తీసినట్లు సమాచారం. శుక్రవారం చెన్నైలోని జయ్‌రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధం ఏంటి?. ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. మలయాళంలో సీనియర్ నటుడు అయిన జయరామ్.. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రేక్షకులకూ సుపరిచితుడే. శబరిమల ప్రధాన ఆలయం ద్వారపాలక (కాపలాదారు) విగ్రహాలు మరియు శ్రీకోవిల్ (గర్భగృహం) తలుపు ఫ్రేమ్‌ల నుండి బంగారం పోయినట్లు ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. పొట్టితో కలిసి నటుడు జయరామ్ పలు పూజల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పూజలు బంగారం పూత మాయం అయిన తర్వాతే జరిగాయని నిర్ధారించుకున్న సిట్.. ఇద్దరి మధ్య సంబంధాలపై ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఇక.. ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు మురారి బాబు, శ్రీకుమార్‌లు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. నిర్ణీత కాల వ్యవధిలో(90 రోజుల) సిట్ వీళ్లపై అభియోగాలకు చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు ప్రధాన నిందితుడు పొట్టికి కూడా బెయిల్ లభించినప్పటికీ.. మిగతా కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: శబరిమల గోల్డ్ కేసు.. ఏపీకి లింకు! నటుడ్ని ప్రశ్నించే చాన్స్ -
శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం
తిరువనంతపురం: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ, కర్ణాటక, తమిళాడులో ఈడీ అధికారులు దాడులు చేశారు. దేవస్యం బోర్డు మాజీ సభ్యుడి ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించారు. శబరిమల బంగారు దొంగతనం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలయంలోని గర్భగుడి వెలుపల ఉన్న బంగారు పూత పలకలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ అధికారుల దర్యాప్తులో నిందితులు బంగారు పలకలను తొలగించి, వాటిని అక్రమంగా విక్రయించినట్లు తేలింది. ఆర్థిక లావాదేవీలలో అనుమానాస్పద అంశాలు బయటపడటంతో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. నిందితుల నివాసాలు, వ్యాపార సంస్థలు, అలాగే సంబంధిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈడీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నిందితులు పలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆధారాలు బయటపడ్డాయి.శబరిమల బంగారం చోరీ కేసులో కొల్లం విజిలెన్స్ కోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బంగారం చోరీ కేసులో సిట్ దర్యాప్తు పత్రాలను ఈడీకి అందించాలని సూచించింది. దీంతో రెండు సంస్థలు కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. సిట్ ఇప్పటికే నిందితులను గుర్తించి కేసు నమోదు చేసింది. ఈడీ కూడా అదే నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. -
శబరిమల చోరీ కేసు.. ధ్వజస్తంభాన్నీ వదలలేదు
శబరిమల అయ్యప్ప బంగారు అభరణాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శబరిమల ప్రధాన ధ్వజస్తంభంతో పాటు ఇతర విగ్రహాలకు సంబంధించిన బంగారం అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పి.ఎస్ ప్రశాంత్ ను అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.శబరిమల బంగారు అభరణాల చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇదివరకే ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరుతో, ఉన్నిక్రిష్ణన్ పొట్టితో సహా ఇతరులను సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆలయ బంగారు అభరణాల పూత కేసులో మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు.సిట్ అధికారులు జరిపిన విచారణలో ఆలయ ధ్వజస్తంభం నుంచి కూడా బంగారం చోరీకి గురయిందని అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధ్వజస్తంభానికి ఉన్న లోహాన్ని తిరిగి వినియోగించాలి. అయితే జెండా స్తంభానికి ఉన్న బంగారం, వాజివాహనం(గుర్రం) వంటి ఇతర విగ్రహాలతో కూడిన రిజిస్టర్ ప్రస్తుతం కనిపించడం లేదని అధికారులు తెలిపారు.అయితే 2019లో శబరిమల గోల్డ్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే తిరిగి 2025లో బంగారు పలకాల పూత కాంట్రాక్టు అప్పగించడంపై దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడి తీరుపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు విచారించగా తిరిగి మరోసారి దర్యాప్తుకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. -
మంత్రిని తప్పించి తంత్రిని ఇరికించే కుట్ర!
శబరిమల ఆలయ బంగారు చోరీ కేసు మళ్లీ రాజకీయ వేడిని రాజేసింది. తంత్రి(ప్రధాన అర్చకుడు) కందరారు రాజీవరు అరెస్టును బీజేపీ ఖండిస్తోంది. అంతేకాదు.. ఈ కేసులో సిట్ దర్యాప్తు తీరుపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలకు దిగింది. కేసుతో సంబంధం ఉన్న మాజీ దేవాదాయ శాఖ(దేవస్వం) మంత్రి కడకంపల్లి సురేంద్రను వదిలేసి.. తంత్రిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకున్నారని అంటోంది. తంత్రిని అరెస్టు చేశారు, కానీ మంత్రిని విడుదల చేశారు. ఎందుకో చెప్పాలి? అంటూ కేరళ బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రధాన అర్చకుడి అరెస్ట్ త్వరగతిన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు కే సురేంద్రన్, బీడీజేఎస్ నేత తుషార్ వెల్లప్పల్లి తదితరులు రాజీవరు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ కేసులో నిజం నిగ్గుతేలాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్ చేస్తోంది. సిట్ తన రిమాండ్ రిపోర్టులో కుట్ర ఆరోపణలకు ఆధారం లేదని కే సురేంద్రన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ వ్యవహారంలో తంత్రికి ఆర్థిక లాభం ఏమీ లేదని.. అయినప్పటికీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్న దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, సభ్యుడు కేపీ శంకర్‌దాస్, మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది కేవలం మంత్రిని రక్షించే కుట్రేనని ఆరోపించారు. తంత్రి అరెస్టునకు నిరసనగా.. జనవరి 14న మకరవిళక్కు సందర్భంగా ఇళ్లలో ‘‘అయ్యప్ప జ్యోతి’’ వెలిగించి నిరసనలు తెలియజేస్తామన్నారు. శబరిమలలో (Sabarimala) గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని దాత అయిన బెంగళూరుకు చెందిన వ్యాపారి ఉన్ని కృష్ణన్ తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ తెలిపింది. ఉన్నట్టుండి తాపడాల బరువు దాదాపు 4.524 కేజీలు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఉన్ని కృష్ణన్ సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టింది. అయితే తదనంతర పరిణామాలతో హైకోర్టు సైతం ఈ దర్యాప్తున పర్యవేక్షిస్తోంది.చోరీ జరిగిన సమయంలో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవస్వం మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలంతో డిసెంబర్ చివర్లో ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. ఆయన పాత్ర లేదని నిర్ధారణ రావడంతో ప్రశ్నించి వదిలేసింది.సిట్ ప్రకారం నిందితుల వాంగ్మూలంలో ఇలా ఉంది.. ప్రధాన అర్చకుడు రాజీవరుకు బంగారు పూత పనులు జరిగిన విషయం తెలుసు. ఇది ఆచార నియమాలకు విరుద్ధం. ఇది కూడా ఆయనకు తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా రాజీవరేన. తాపడాల చోరీ కేసులో రాజీవరు పాత్ర కూడా ఉంది. శబరిమల గోల్డ్ చోరీ కేసులో రాజీవరుతో కలిపి 11 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఆయన నివాసాల్లో సిట్ సోదాలు జరిపింది. అయితే జైలులో అస్వస్థతతో బాధపడటంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ప్రస్తుత సీజన్లో శబరిమల ఆలయానికి రాజీవరు ప్రధాన పూజారి కాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ నాయర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. -
శబరిమల బంగారం కేసు.. ఐసీయూలో నిందితుడు
తిరువనంతపురం: శబరిమల బంగారు అభరణాల కేసులో అరెస్టైన ఆలయ ప్రధాన పూజారి కందావారు రాజీవరు ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది మంది సభ్యులున్నా సిట్ బృందం ఈరోజు( శనివారం) మద్యాహ్నం ప్రాంతంలో పూజారి నివాసానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలు ఏమైనా లభిస్తాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు.. అనారోగ్యం కారణంగా అరెస్టయిన కందరరు రాజీవరు వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరారు. తిరువనంతపురం స్పెషల్ సబ్-జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తంత్రి ఆరోగ్య సమస్యలను నివేదించిన తర్వాత మొదట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల తరువాత, అతను ప్రత్యేక సంరక్షణ కోసం మెడికల్ కాలేజీకి బదిలీ చేయబడ్డారు. వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తీసుకురాగానే.. మెడిసిన్, కార్డియాలజీ విభాగాల అధిపతులు ఆయనను పరీక్షించారు. నిపుణుల సూచన మేరకు అతడిని ఐసీయూకి తరలించారు. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.అయితే, జైలులో అల్పాహారం తీసుకుంటుండగా తంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జైలు అధికారులను వైద్య సహాయం కోరారు. అనంతరం, అతన్ని పరీక్షించేందుకు ఒక వైద్యుడు జైలుకు వెళ్లాడు. సదరు వైద్యుడి సూచనలు మేరకు రాజీవరును ఆసుపత్రికి తరలించారు.కాగా శబరిమల బంగారు తాపడాల చోరి కేసులో శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు కందావారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో నిన్న ఉదయం ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా సిట్ విచారణ చేపడుతుంది. కాగా ఈ కేసులో ఆయన అరెస్టు 11వది.ఏమిటి ఈ కేసు?2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. -
శబరిమల బంగారం చోరీలో పురోగతి అర్చకుడు అరెస్ట్..
-
శబరిమల ప్రధాన అర్చకుడి(తంత్రి) అరెస్ట్
సంచలనం రేపిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు(తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. వరుస నోటీసులకు స్పందించని ఆయన్ని.. శుక్రవారం విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ప్రధాన అర్చకుడు రాజీవరు అరెస్టుతో ఆ సంఖ్య 11కి చేరింది. SIT arrests Sabarimala Chief Priest Kandararu Rajeevaru in gold loss case— Press Trust of India (@PTI_News) January 9, 2026ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పద్మకుమార్, ఉన్నికృష్ణన్ పొట్టి వాంగ్మూలాల మేరకు సిట్ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి తంత్రి రాజీవరును ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. వీలైనంత త్వరగా.. కొల్లంలోని కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన తంత్రిని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదు. గత ఏడాది నవంబరులో కూడా సిట్ ఆయన్ని విచారణ జరిపింది. అయితే..ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమల కాంట్రాక్టులకు తీసుకొచ్చింది కందరారు రాజీవర్ అని పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ వాంగ్మూలాల ఆధారంగా ఈ రోజు ఉదయం రాజీవర్‌ను సిట్ కార్యాలయానికి పిలిపించారు. రెండున్నర గంటల పాటు విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు సిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారు1. ఉన్నికృష్ణన్ పొట్టి (స్పాన్సర్)2. మురారిబాబు (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దేవస్వం బోర్డు)3. డి.సుధీష్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)4. కెఎస్ బైజు (తిరువాభరణం మాజీ కమిషనర్)5. ఎన్.వాసు (మాజీ దేవస్వం కమిషనర్, అధ్యక్షుడు)6. ఎ.పద్మకుమార్ (మాజీ దేవస్వం బోర్డు అధ్యక్షుడు)7. ఎస్.శ్రీకుమార్ (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)8. పంకజ్ భండారి (సీఈవో, స్మార్ట్ క్రియేషన్స్)9. బళ్లారి గోవర్ధన్ (ఆభరణాల వ్యాపారి)10. ఎన్.విజయకుమార్ (మాజీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు)11. కందరారు రాజీవరార్ (శబరిమల తంత్రి)ఎప్పుడు ఏం జరిగిందంటే.. బంగారం తాడపం పనులు పూర్తయ్యాక బరువులో వ్యత్యాసం బయటపడడంతో ఈ కేసు మొదలైంది. 2019లో.. ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేశారు. ఆ సమయంలో తిరిగి ఇచ్చిన బంగారం బరువులో వ్యత్యాసం బయటపడింది.ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు మొదలైంది. అయితే ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో కేరళ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఆ దర్యాప్తు వేగవంతం చేయాలని అక్టోబర్‌లో కేరళ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది కూడా. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ప్రదాన సూత్రధారిగా సిట్ పేర్కొంది. అతనితో పాటు మాజీ అధికారిగా ఉన్న బి. మురారి బాబు అరెస్టు అయ్యారు. బెంగళూరులోని ఓ దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ కూడా చేశారు. ఆపై మరికొందరిని విచారించి.. అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ప్రధాన అర్చకుడి అరెస్టుతో కేసు మరో మలుపు తిరిగింది. అయితే.. మరిన్ని బంగారు తాపడం ప్లేట్లు తొలగించి బంగారం దోచుకోవాలని పెద్ద కుట్ర జరిగిందని కోర్టుకు సిట్ ఇప్పటికే నివేదించింది. శబరిమల బంగారం చోరీ కేసులో సిట్‌తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్(Prevention of Money Laundering Act) అభియోగాల కింద దర్యాప్తు జరుపుతోంది. -
శబరిమల బంగారం మాయం కేసు: మాజీ మంత్రి పాత్రపై విచారణ
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆరేళ్ల క్రితం వెలుగుచూసిన బంగారం అపహరణ కేసులో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది. ఈ కేసులో దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు పలువురు అరెస్ట్ కాగా, తాజాగా ఇది దేవస్థానం శాఖ మంత్రిగా పని చేసిన కడకంపల్లి సురేంద్రన్ వద్దకు చేరింది. గత శనివారం కడకంపల్లి సురేంద్రన్ను సిట్ బృందం విచారించింది. శబరిమల ఆలయానికి సంబంధించి తలుపులకు పూసి ఉన్న బంగారం మాయం కావడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన నేరుగా పాలు పంచుకున్నారనేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట విచారణ చేపట్టింది. అయితే దేవస్థానం(దేవస్వం శాఖ) పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుందని, బంగారం పూత తొలగించడం, చెన్నైలోని ప్రైవేట సంస్థకు పంపడం వంటి నిర్ణయాలు టీడీబీ(ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు) స్వతంత్రంగా తీసుకుంటుందన్నారు. కేసు వివరాలుశబరిమల ఆలయంలోని విగ్రహాలు, తలుపులపై ఉన్న బంగారు పూతలో కొంత భాగం కనిపించకుండా పోయింది.మాజీ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ టీడీబీ అధ్యక్షులు ప్రశాంత్, పద్మకుమార్ తదితరులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు SIT 10 మందిని అరెస్టు చేసింది, వీరిలో ఇద్దరు మాజీ టీడీబీ అధ్యక్షులు కూడా ఉన్నారు.ఈ కేసును విచారించేందుకు సిట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కొత్త సాక్ష్యాలు, సంబంధాలు వెలుగులోకి వస్తే మరిన్ని అరెస్టులు జరగవచ్చు.బంగారం కనిపించకుండా పోయిన ఈ ఘటన 2019లో జరిగింది. -
శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్‌కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్‌తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు) -
శబరిమల గోల్డ్ చోరీ కేసు.. మాజీ మంత్రికి ఉచ్చు?
శబరిమల ఆలయం బంగారం దొంగతనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా సీపీఎం నేత, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ డైరెక్టర్ పద్మకుమార్ ఈ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో దేవస్వం(దేవాదాయ శాఖ)మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రను విచారించే యోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేరళనాట తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.శబరిమల గర్భగుడి శిల్పాలకు బంగారు పూత వేయడానికి వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి స్పాన్సర్‌గా ముందుకు వచ్చారని.. ఈ ప్రతిపాదన ఆనాటి దేవస్వం మంత్రికి కూడా తెలిసిందని.. సురేంద్రన్ కూడా లేఖ ద్వారా ఆసక్తి వ్యక్తం చేశారని పద్మకుమార్ వాంగ్మూలంలో ఉంది. ఈ వాంగ్మూలం ఆధారంగా సురేంద్రన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే.. పద్మకుమార్ విచారణ పూర్తైన తర్వాతే ఏదనే నిర్ణయం తీసుకుంటామని సిట్ వర్గాలు చెబుతున్నాయి. పూజారి నుంచి వ్యాపారవేత్తగా మారిన ఉన్నికృష్ణన్ పొట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 1998లో బంగారు పూత వేసిన ద్వారపాలక శిల్పాలపై తిరిగి పనులు చేయడానికి పొట్టికి అనుమతి ఇచ్చిన సమయంలోనే బంగారం చోరీ జరిగినట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో పొట్టి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని.. ఆ చొరవ వల్లే ఆయనకు ప్రత్యేక అనుకూలత లభించిందని, చోరీ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో ఇప్పటిదాకా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నికృష్ణన్ పొట్టి తోపాటు మురారి బాబు (మాజీ దేవస్థానం బోర్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), డీ సుధీశ్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), ఎన్. వాసు (మాజీ దేవస్థానం కమిషనర్, అధ్యక్షుడు) అరెస్ట్ అయ్యారు. వాసు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గురువారం నాలుగు గంటలపాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ను విచారించి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. Watch: In the Sabarimala gold theft case, former Travancore Devaswom Board president A. Padmakumar has been arrested by the SIT. The arrest was recorded after he was questioned at the State Police Headquarters. Padmakumar was the Devaswom Board president in 2019, when the gold… pic.twitter.com/4wVDWqrANy— Jist (@jist_news) November 20, 2025అయితే.. విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ అధికార పక్షం నేతల పేర్లు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. సీపీఎం నేతలైన దేవస్వం కమిషనర్ ఎన్. వాసు, తరువాత ఎ. పద్మకుమార్ అరెస్టు కావడం.. ఇప్పుడు మాజీ మంత్రి పేరు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేతల పాత్రలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం పినరయి విజయన్ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కోరుతున్నారు.పొట్టి వెనుక భారీ శక్తులుండొచ్చు: హైకోర్టుశబరిమల బంగారం దోపిడీ కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయనే అనుమానం వ్యక్తంచేసింది. దర్యాప్తును వేగవంతం చేయాలని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదు చేయాలని హైకోర్టు నిర్ణయించింది. -
ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేస్తూ దోపిడీ.. 5కోట్ల సొత్తు స్వాధీనం
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన భారీ దొంగతనం కేసును తెలంగాణ పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారి నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లో జవహర్‌నగర్ కాలనీలోని పీజీ టవర్స్ వ్యాపారవేత్త రాహుల్ గోయల్ నివాసం ఉంటున్నారు. అయితే, 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్‌కు వెళ్లారు. అనంతరం.. 10వ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటికి వచ్చే సరికి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. లాకర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, వజ్రాలు, రూ. 49 లక్షల నగదు కనిపించలేదు. రూ.5కోట్ల విలువ.. దీంతో, రాహుల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్బంగా చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు ఐదు కోట్ల వరకు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. రాహుల్ ఇంటికి కాపాలాగా ఉన్న కమల్, అతడి కుటుంబ సభ్యులపై ఫోకస్ పెట్టారు. దర్యాప్తు సమయానికి వారు కనిపించకపోవడంతో ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. నేపాలీ గ్యాంగ్.. కాగా, వారంతా నేపాల్‌కు చెందిన వారు కావడంతో పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడే అవకాశం ఉన్నదని, ఆ దిశగా పోలీసలు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ముంబైలో తొమ్మిది మంది నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరిని ముంబైకి చెందిన ఒక ఏజెన్సీ వారిని పనిలో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
కొట్టేసినా.. కొనేవారు కరువు!
సాక్షి, సిటీబ్యూరో: ఓ టార్గెట్‌ను ఎంచుకుంటున్నారు... కొన్ని రోజుల పాటు పక్కాగా రెక్కీ నిర్వహిస్తున్నారు... ఆనక ఓ ‘మంచిరోజు’ పంజా విసురుతున్నారు... అత్యంత విలువైన వస్తువులే పట్టుకుపోతున్నారు... ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇలా కొట్టేసిన వాటిని ఎలా క్యాష్ చేసుకోవాలో తెలియక బుక్కైపోతున్నారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులకు చిక్కేస్తున్నారు. ఇది ఆయా దొంగలకు ‘నిరాశ’ కలిగించే అంశమైనా... పోలీసులు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ చోరీ సొత్తును సేల్ చేయడంలో చోరులు సఫలీకృతులై ఉంటే వారిని పట్టుకున్నా నష్టం తీర్చలేనిదయ్యేదని చెబుతున్నారు. గడిచిన రెండు నెలల్లోనే ఈ తరహాకు చెందిన ఉదంతాలు మూడు వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్ (హెచ్‌ఈహెచ్) నిజాం మ్యూజియంలో ఈ ఏడాది సెప్టెంబర్ 4 తెల్లవారుజామున భారీ చోరీ చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముబిన్, మహ్మద్ గౌస్ పాషా దాదాపు 35 రోజుల పాటు రెక్కీలు, మార్కింగ్స్ తదితరాలు పూర్తి చేసుకున్నారు. చివరకు సెప్టెంబర్ 4 తెల్లవారుజామున స్క్రూడ్రైవర్లు, కటింగ్ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్ల ‘సాయం’తో లోపలికి ప్రవేశించారు. అల్మారా పగులకొట్టి టిఫిన్ బాక్స్, కప్పుసాసర్, స్ఫూన్ తస్కరించి ఉడాయించారు. రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్‌హౌస్ సమీపంలో ఆ వస్తువులను పాతిపెట్టారు. అంతకు ముందే వాటి ఫొటోలతో పాటు స్ఫూన్ తమ వద్ద ఉంచుకున్నారు. వీటితో విక్రేతల కోసం ముంబై వెల్లి ప్రత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు ఆ యత్నాల్లో ఉండగానే సెప్టెంబర్ 11న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు వస్తువులతో సహా చిక్కారు. ఆ టిఫిన్ బాక్స్‌లో నిజాం తిన్నారో తెలియదు కానీ...గౌస్మాత్రం బిర్యానీ భోంచేశాడు. అలాగేటీకప్పులో మొబిన్ మంచినీళ్లు తాగిసంతృప్తి చెందాడు. -
బంగారం చోరీ కేసులో టీఆర్ఎస్ నేతలు
-
యజమానికే టోకరా
చిక్కడపల్లి (హైదరాబాద్): పనిచేసే సంస్థకే కన్నం వేసి 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య, సీఐ మంత్రి సుదర్శన్, డీఐ బాబ్జీ కేసు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన చేతన్ మాలిక్ మహారాష్ట్ర థానే ప్రాంతంలో వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటుపడిన అతను మోసాలు చేయడంతో మహారాష్ట్ర రాంనగర్ పోలీస్ స్టేషన్ చీటింగ్ కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో అతను మూడు నెలల దోమలగూడ గగన్ మహల్లో వ్యాపారం చేస్తున్న తన గ్రామానికి రాజేష్ పాటిల్ వద్ద సహాయకుడిగా పనిలో చేరాడు. రాజేష్ కమీషన్ పద్దతిన వివిధ ప్రాంతాలకు బంగారం సరఫరా చేస్తుంటాడు. జనవరి 23న 3.5 కిలోల ఆభరణాలను తీసుకుని చిత్తూరు జిల్లా మదనపల్లిలో కస్టమర్‌కు అందజేసేందుకు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లిరు. యాజమాని బాత్రూమ్కు వెళ్లగా చేతన్ మాలిక్ ఆభరణాల బ్యాగ్‌తో పరారయ్యాడు. దీంతో రాజేష్ గత నెల 18న చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ మంత్రి సుదర్శన్ పర్యవేక్షణలో డీఎస్ఐ నరేందర్, హెడ్‌కానిస్టేబుల్ ఎం.డి.ఇషామొద్దీన్, కానిస్టేబుల్ సంతోష్ కుమార్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఉంగరాలు, చెవి దిద్దులు, లాకెట్లు, ముక్కు పుడకలను తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరిగించిన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మంత్రి సుదర్శన్‌తో పాటు ప్రత్యేక బృందాన్ని ఏసీపీ అభినందించారు.


