శబరిమల ఆలయ బంగారు చోరీ కేసు మళ్లీ రాజకీయ వేడిని రాజేసింది. తంత్రి(ప్రధాన అర్చకుడు) కందరారు రాజీవరు అరెస్టును బీజేపీ ఖండిస్తోంది. అంతేకాదు.. ఈ కేసులో సిట్ దర్యాప్తు తీరుపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలకు దిగింది. కేసుతో సంబంధం ఉన్న మాజీ దేవాదాయ శాఖ(దేవస్వం) మంత్రి కడకంపల్లి సురేంద్రను వదిలేసి.. తంత్రిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకున్నారని అంటోంది.
తంత్రిని అరెస్టు చేశారు, కానీ మంత్రిని విడుదల చేశారు. ఎందుకో చెప్పాలి? అంటూ కేరళ బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రధాన అర్చకుడి అరెస్ట్ త్వరగతిన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు కే సురేంద్రన్, బీడీజేఎస్ నేత తుషార్ వెల్లప్పల్లి తదితరులు రాజీవరు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ కేసులో నిజం నిగ్గుతేలాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్ చేస్తోంది.
సిట్ తన రిమాండ్ రిపోర్టులో కుట్ర ఆరోపణలకు ఆధారం లేదని కే సురేంద్రన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ వ్యవహారంలో తంత్రికి ఆర్థిక లాభం ఏమీ లేదని.. అయినప్పటికీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్న దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, సభ్యుడు కేపీ శంకర్‌దాస్, మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది కేవలం మంత్రిని రక్షించే కుట్రేనని ఆరోపించారు. తంత్రి అరెస్టునకు నిరసనగా.. జనవరి 14న మకరవిళక్కు సందర్భంగా ఇళ్లలో ‘‘అయ్యప్ప జ్యోతి’’ వెలిగించి నిరసనలు తెలియజేస్తామన్నారు.
శబరిమలలో (Sabarimala) గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని దాత అయిన బెంగళూరుకు చెందిన వ్యాపారి ఉన్ని కృష్ణన్ తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ తెలిపింది. ఉన్నట్టుండి తాపడాల బరువు దాదాపు 4.524 కేజీలు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఉన్ని కృష్ణన్ సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టింది. అయితే తదనంతర పరిణామాలతో హైకోర్టు సైతం ఈ దర్యాప్తున పర్యవేక్షిస్తోంది.
చోరీ జరిగిన సమయంలో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవస్వం మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలంతో డిసెంబర్ చివర్లో ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. ఆయన పాత్ర లేదని నిర్ధారణ రావడంతో ప్రశ్నించి వదిలేసింది.
సిట్ ప్రకారం నిందితుల వాంగ్మూలంలో ఇలా ఉంది.. ప్రధాన అర్చకుడు రాజీవరుకు బంగారు పూత పనులు జరిగిన విషయం తెలుసు. ఇది ఆచార నియమాలకు విరుద్ధం. ఇది కూడా ఆయనకు తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా రాజీవరేన. తాపడాల చోరీ కేసులో రాజీవరు పాత్ర కూడా ఉంది.
శబరిమల గోల్డ్ చోరీ కేసులో రాజీవరుతో కలిపి 11 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఆయన నివాసాల్లో సిట్ సోదాలు జరిపింది. అయితే జైలులో అస్వస్థతతో బాధపడటంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ప్రస్తుత సీజన్‌లో శబరిమల ఆలయానికి రాజీవరు ప్రధాన పూజారి కాదని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్ నాయర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.


