బీజేపీ కుట్రలను సాగనీయం | Mallu Bhatti Vikramarka Shocking Comments On BJP, Calls For Continued Efforts For Rahul Gandhi’s Leadership | Sakshi
Sakshi News home page

బీజేపీ కుట్రలను సాగనీయం

Feb 24 2026 1:33 AM | Updated on Feb 24 2026 12:00 PM

Mallu Bhatti Vikramarka Shocking Comments on BJP

దేశాన్ని అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి

రాహుల్‌ ప్రధాని అయితేనే వీటికి పరిష్కారం లభిస్తుంది: డిప్యూటీ సీఎం భట్టి

వికారాబాద్‌: రాజ్యాంగ మార్పు, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటూ బీజేపీ చేస్తున్న కుట్రలను సాగనీయబోమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే వరకూ ఇరు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. కులవివక్షను సమర్థవంతంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. తాను సైతం వివక్షను ఎదుర్కొన్నానని తెలిపారు.

దేశాన్ని అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం దీనికి ఆజ్యం పోస్తోందని తెలిపారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల కులవివక్ష కారణంగా బలవన్మరణానికి పాల్పడితే రాహుల్‌గాంధీ యూనివర్సిటీకి చేరుకొని, బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రోహిత్‌ వేముల చట్టం తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమానంగా దూసుకుపోతోందన్నారు. కేవలం 50 రోజుల్లో కులగణన పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి, సచిన్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement