కొత్తగూడ మండల కేంద్రంలో ఉచితంగా టమాటాలు పంపిణీ చేస్తున్న రైతు
కిలో రూ. 5కు పడిపోయిన టమాటా ధర
అనుకూలించిన వాతావరణం, పెరిగిన దిగుబడి
నిల్వచేసే అవకాశం లేకపోవడంతో తక్కువ ధరకు అమ్మకాలు
రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటున్న రైతులు
సాక్షి, మహబూబాబాద్: సాధారణ పంటలు వేస్తే అప్పుల పాలవుతున్నామని భావించిన రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. టమాటా వేస్తే మంచి లాభాలు వస్తాయని భావించి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, దిగుబడి పెరగడంతో అమాంతం ధర పతనమైది. దీంతో టమాటా పండించినా.. అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో వేసిన టమాటా తోటలకు వాతావరణం అనుకూలించింది. పెద్దగా చీడపీడలు ఆశించలేదు. రాష్ట్రంలోని వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 30 వేల ఎకరాల మేరకు టమాటా పంట సాగుచేశారు. ఇందుకుగాను గతం కన్నా ఎక్కువగా 2 లక్షల టన్నుల మేరకు దిగుబడి వచ్చినట్లు అంచనా.. దీనికి తోడు పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా దిగుబడి ఎక్కువగా రావడంతో మార్కెట్ మందగించి ధర పతనమైంది.

ధరలు పడిపోవడంతో తలపట్టుకున్న రైతులు
వానాకాలం పంటకు హోల్‌సేల్‌లో కేజీ రూ.25కు కొనేవారు. రిటైల్ ధర రూ.40 నుంచి రూ.50కి అమ్మేవారు. యాసంగి పంట రాగానే ధర పతనమైంది. 25 కిలోల పెట్టెను రూ. 100 నుంచి రూ.150కి అడుగుతున్నారు. వారాంతపు సంతల్లోకి ఆటోలు, ఇతర వాహనాల ద్వారా తీసుకొని వెళ్లే రైతులకు సాయంత్రం వరకు ఉండి అమ్ముకునేవారు. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో టమాటా మార్కెట్లకు రావడంతో, అమ్ముడు పోనివాటిని సాయంత్రం వరకు చూసి ఉచితంగా పంపిణీ చేయడం, లేదా కోతులకు పోసి రావాల్సి వస్తోంది. ఇంటికి తీసుకొని వెళ్తే మళ్లీ రవాణా ఖర్చులు అవుతాయని, అందుకోసమే ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కొందరు రైతులు చెబుతున్నారు.
నిల్వ చేయకపోవడంతోనే..
ధాన్యం, ఇతర పంటలను విక్రయించే సందర్భంలో రైతులకు అనుకూల ధర లేకపోతే.. నిల్వ చేసుకొని ధర వచ్చిన తర్వాత అమ్ముతారు. కానీ టమాటా విషయంలో మాత్రం నిల్వ చేసే పరిస్థితి లేదు. ఇందుకు కావాల్సిన కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో చెట్టుమీద పండిన టమాటా కోస్తే రెండు, మూడు రోజులకు మించి నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. అందుకోసమే ధర ఎక్కువ..తక్కువ ఉన్నా..అమ్మడం తప్ప మరో మార్గం లేదు.

ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు మహబూబాబాద్ మండలం గుండ్లబోడు తండాకు చెందిన ధరావత్ చంద్రు. తనకున్న ఎకరంలో టమాటా సాగుచేశాడు. నారు తెచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.50 వేల ఖర్చు వచ్చింది. ‘దిగుబడి బాగా ఉంది రూ.లక్ష మేరకు ఆదాయం వస్తుందని అనుకున్నా.. కానీ కిలో రూ.5కే అమ్మాల్సి వస్తోంది, దీంతో లాభమేమో కానీ పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి కూడా రావడం లేదు
నాకున్న చెలకలో ఎకరం మేర కూరగాయలు వేస్తా. కూరగాయల మీద ప్రతీ సంవత్సరం రూ.లక్ష మేరకు లాభం వచ్చేది. ఈ ఏడాది రూ. 30 గుంటల్లో టమాటా వేశా. ఖర్చు రూ.50 వేలు దాటింది. కానీ ఇప్పుడు లాభం కాదు.. కదా పెట్టుబడి కూడా రావడం లేదు. నిల్వ చేసేటట్లు ఉంటే బాగుండేది. – బానోత్ బాలు, రేగడి తండా, మహబూబాబాద్
పెట్టె రూ. 100కే అడుగుతున్నారు
20 గుంటల భూమిలో టమాటా సాగుచేశా. ఎక్కువమంది రైతులు ఈ ప్రాంతంలో టమాట పంటను సాగు చేయడం.. దిగుబడి ఎక్కువ రావడంతో ధర గణనీయంగా తగ్గింది. మార్కెట్‌లో కేజీ రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు కొనుగోలు చేస్తుండడంతో పెట్టుబడి మాట దేవుడెరుగు.. పంటను మార్కెట్‌కు తరలించినా రవాణా చార్జీలతోపాటు కోత కూలి కూడా రావడం లేదు. పెట్టె (25 కిలోలు) రూ.100కే అడుగుతున్నారు. – ధరావత్ నంద, చాప్లాతండా, డోర్నకల్


