వన్డే ప్రపంచకప్ ఈవెంట్లలో తిరుగులేని జట్టుగా ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియాకు.. టీ20 ఫార్మాట్లో మాత్రం అవమానాలే మిగులుతున్నాయి. పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్కసారి (2021) విజేతగా నిలిచిన కంగారూలు.. తాజా ఎడిషన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు.
టీ20 వరల్డ్‌కప్-2026లో గ్రూప్-బిలో భాగంగా తొలుత ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. శ్రీలంక చేతిలోనూ ఓడి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్‌లో ఒమన్ (AUS vs OMA)తో శుక్రవారం ఆసీస్ తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.
అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (Jatinder Singh) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఒత్తిడిలో ఉందని.. ఇలాంటి సమయంలో వారిని చిత్తు చేసే సువర్ణావకాశం తమకు ఉందని పేర్కొన్నాడు.
ఆసీస్‌ను మేమూ చిత్తుగా ఓడిస్తాం
‘‘ఈ మ్యాచ్‌లో మేము గెలిచేందుకు వంద శాతం అవకాశం ఉంది. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సరైన సమయంలో సరైన విధంగా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా గొప్పగా ఏమీ ఆడటం లేదు. వాళ్లు మొమెంటమ్ కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఆసీస్‌ను చిత్తు చేయడం సులభం. మా జట్టు ఈ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తమదైన ముద్ర వేయాలని మా వాళ్లు ఆతురతగా ఎదురుచూస్తున్నారు’’ అని జతిందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఘోర అవమానం
కాగా ఇప్పటికే జింబాబ్వే వంటి పసికూన చేతిలో ఓడిన ఆసీస్‌కు.. మరో పసికూన జట్టు కెప్టెన్ కూడా ఓడిస్తామంటూ సవాలు విసరడం గమనార్హం. దీంతో ఆసీస్ ఫ్యాన్స్.. ‘‘ఇది ఘోర అవమానం.. ఇకనైనా సరిగ్గా ఆడండి’’ అంటూ మార్ష్ బృందానికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా గ్రూప్-బిలో జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఒమన్ ఓడిపోయింది. ఇక 2024 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఆసీస్ చేతిలోనూ చిత్తైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటామని ఒమన్ సానుకూల దృక్పథంతో ఉండటం విశేషం.
ఒమన్ జట్టు
అమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (కెప్టెన్), ఆశిష్ ఒడెదర, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), మహ్మద్ నదీమ్, జితేన్ రామనంది, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, షా ఫైసల్, షఫీక్ జాన్, కరణ్ సోనావాలే, జే ఒడెడ్రా, వసీం అలీ
ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, కూపర్ కొన్నోలీ, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షుయిస్, మాట్ రెన్షా, మాథ్యూ కుహ్నెమాన్, స్టీవెన్ స్మిత్.


