ఛేజింగ్‌లో తడబాటు... | India lost to Australia in the second T20 | Sakshi
Sakshi News home page

ఛేజింగ్‌లో తడబాటు...

Feb 20 2026 4:04 AM | Updated on Feb 20 2026 4:04 AM

India lost to Australia in the second T20

రెండో టి20లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు పరాజయం

అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్‌ రికార్డు 

కాన్‌బెర్రా: తొలి టి20లో ఎదురైన ఓటమి నుంచి రెండో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా మహిళల జట్టు తేరుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి రెండో టి20లో విజయాన్ని అందుకుంది. ఆసీస్‌ నిర్దేశించిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత మహిళల జట్టు చివరకు 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

టీమిండియా కెప్టెన్  హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన సోఫీ మోలినెక్స్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 144 పరుగులు సాధించింది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 అడిలైడ్‌లో శనివారం జరుగుతుంది.  

సెంచరీ భాగస్వామ్యం 
ఆసీస్‌ జట్టుకు ఓపెనర్లు జార్జియా వోల్‌ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, 1 సిక్స్‌), బెత్‌ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. 15వ ఓవర్లో బెత్‌ మూనీని హైదరాబాద్‌ బౌలర్‌ అరుంధతి అవుట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఆసీస్‌ 35 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. 

భారత బౌలర్లలో అరుంధతి రెండు వికెట్లు, రేణుక ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన (24 బంతుల్లో 31; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (23 బంతుల్లో 29; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. అయితే మూడు ఓవర్ల వ్యవధిలో షఫాలీ, జెమీమా, స్మృతి అవుటవ్వడంతో భారత్‌ ఛేజింగ్‌లో వెనుకబడింది. 

హర్మన్‌ప్రీత్‌ (30 బంతుల్లో 36; 5 ఫోర్లు) దూకుడు కనబరిచినా 17వ ఓవర్లో ఆమె అవుటవ్వడంతో భారత్‌ విజయంపై ఆశలు వదులుకుంది. ఆసీస్‌ బౌలర్లలో యాష్లీ గార్డ్‌నర్‌ (3/22), కిమ్‌ గార్త్‌ (2/16), అనాబెల్‌ సదర్లాండ్‌ (2/18), సోఫీ మోలినెక్స్‌ (2/37) రాణించారు.

356 అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు కలిపి) అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గుర్తింపు పొందింది. హర్మన్‌ ఇప్పటివరకు 189 టి20లు, 161 వన్డేలు, 6 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సుజీ బేట్స్‌ (355 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును హర్మన్‌ బద్దలు కొట్టింది.  

Advertisement
 
Advertisement
Advertisement