శ్రీలంకకు జింబాబ్వే షాక్‌ | Zimbabwe beat Sri Lanka by 6 wickets in the T20 World Cup | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు జింబాబ్వే షాక్‌

Feb 20 2026 3:57 AM | Updated on Feb 20 2026 3:57 AM

Zimbabwe beat Sri Lanka by 6 wickets in the T20 World Cup

6 వికెట్లతో ఘన విజయం 

గ్రూప్‌ ’బి’లో ఓటమి లేకుండా ముగింపు  

కొలంబో: టి20 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాను సంచలన రీతిలో ఓడించిన జింబాబ్వే ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆసీస్‌పై గెలవడం గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ జట్టు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ్రస్టేలియాని చిత్తు చేసి సత్తా చాటిన ఆతిథ్య జట్టు శ్రీలంకను వారి సొంతగడ్డపైనే ఓడించి జింబాబ్వే షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి రద్దు కాగా, మిగిలిన మూడూ నెగ్గి అజేయంగా, అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించింది. 

‘సూపర్‌ ఎయిట్స్‌’లో తమను తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరికను జారీ చేసింది. గురువారం జరిగిన పోరులో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేయగా...జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది.  

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక ఇన్నింగ్స్‌లో నిసాంక (41 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, పవన్‌ రత్నాయకే (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. నిసాంక, కుశాల్‌ పెరీరా (22; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యరి్థని నిలువరించింది. చివర్లో రత్నాయకే, వెలలాగె (15 నాటౌట్‌) కలిసి ధాటిగా ఆడారు. 19వ ఓవర్లో రత్నాయకే వరుసగా 4, 6, 4 బాదగా...ఆఖరి ఓవర్లలో వెలలాగె మూడు ఫోర్లు కొట్టాడు. 

ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (48 బంతుల్లో 63 నాటౌట్‌; 8 ఫోర్లు), మరుమని (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెన్నెట్‌ జాగ్రత్తగా ఆడగా ఇతర సహచరులు దూకుడు ప్రదర్శించడంతో జింబాబ్వే లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సికందర్‌ రజా (26 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మరుమని, ర్యాన్‌ బర్ల్‌ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 64 బంతుల్లో 102 పరుగులు సాధించడం విశేషం. 

10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉండటంతో జింబాబ్వే విజయంపై సందేహాలు ఉన్నా...చివరకు జింబాబ్వే బ్యాటర్లు దానిని చేసి చూపించారు. ముఖ్యంగా హేమంత ఓవర్లో రజా వరుసగా 6, 6, 4 బాదడంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ...తొలి బంతికి మున్‌యోంగా సిక్స్, మూడో బంతికి బెన్నెట్‌ ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించారు. 

ఇక్కడితో ఆగిపోము. మా దృష్టి రాబోయే మ్యాచ్‌లపై ఉంది. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్‌లో ప్రదర్శనను విశ్లేíÙంచుకుంటూ ముందుకు పోతున్నాం. అన్ని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధమయ్యాం. తమ బాధ్యతలపై జట్టులో అందరికీ స్పష్టత ఉంది. తాజా ప్రదర్శనతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉత్సాహం పెరిగింది. లీగ్‌ దశలో మా ప్రదర్శనను బట్టి చూస్తే మున్ముందు ఏదైనా సాధ్యమే. అంచనాలకు భిన్నంగా సాగే సంచలన కథనాలు అందరినీ ఆకర్షిస్తాయి కదా.  –సికందర్‌ రజా, జింబాబ్వే కెప్టెన్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement