T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం | T20 WC 2026: Zimbabwe Registered yet another sensation, defeated Sri lanka in their last group stage match | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం

Feb 19 2026 6:56 PM | Updated on Feb 19 2026 7:07 PM

T20 WC 2026: Zimbabwe Registered yet another sensation, defeated Sri lanka in their last group stage match

టీ20 ప్రపంచకప్‌ 2026లో జింబాబ్వే సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో తొలుత టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వెన్లు.. తాజాగా తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించిన షాకిచ్చారు. కొలొంబో వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా గ్రూప్‌-బిలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.

ఈ గ్రూప్‌లో జింబాబ్వే.. ఒమన్‌, ఆస్ట్రేలియా, శ్రీలంకపై విజయాలు సాధించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈ గ్రూప్‌ నుంచి జింబాబ్వే, శ్రీలంక ఇదివరకే సూపర్‌-8లోకి ప్రవేశించాయి. ఈ గ్రూప్‌లో శ్రీలంక సైతం ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు శ్రీలంకను జింబాబ్వే వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించింది. పాయింట్ల పట్టికలోనూ జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (62), పవన్‌ రత్నాయకే (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ పెరీరా 22, కుసాల్‌ మెండిస్‌ 14, కమిందు మెండిస్‌ 7, దసున్‌ షనక 6, వెల్లాలగే 15 (నాటౌట్‌) పరుగులు చేశారు. దుషన్‌ హేమంత డకౌటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, బ్రాడ్‌ ఈవాన్స్‌, గ్రేమీ క్రీమర్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ర్యాన్‌ బర్ల్‌ ఓ వికెట్‌ తీశాడు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (63) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్‌ సికందర్‌ రజా (45) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్‌ మరుమణి (34), ర్యాన్‌ బర్ల్‌ (23) ఓ మోస్తరు స్కోర్లతో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. లంక బౌలర్లలో హేమంత 2, వెల్లలగే, షనక చెరో వికెట్‌ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement