T20 WC 2026: విండీస్‌ ప్లేయర్‌ ప్రపంచ రికార్డు | T20 WC 2026, WI VS ITA: Shamar Joseph becomes the first cricketer to bag four wickets and four catches in a T20I | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను నమోదు చేసిన విండీస్‌ ప్లేయర్‌

Feb 19 2026 3:16 PM | Updated on Feb 19 2026 3:34 PM

T20 WC 2026, WI VS ITA: Shamar Joseph becomes the first cricketer to bag four wickets and four catches in a T20I

వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌ అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని, ఓ అత్యంత అరుదైన ఫీట్‌ను సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇటలీతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, 4 క్యాచ్‌లు కూడా పట్టిన షమార్‌.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఈ ఫీట్‌ను నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

పురుషుల క్రికెట్‌లోనే కాకుండా మహిళల క్రికెట్‌లోనూ ఇలాంటి ఫీట్‌ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ ప్రదర్శనతో షమార్‌ మరో రికార్డు కూడా సమం చేశాడు. ఓ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు (4) పట్టిన నాన్‌ వికెట్‌కీపర్‌గా డారెన్‌ సామీ, మార్క్రమ్‌, మ్యాక్స్‌వెల్‌, జార్జ్‌ మున్సే సరసన చేరాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి పసికూన ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా గ్రూప్‌ దశలో (సి) ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసి, అజేయ జట్టుగా సూపర్‌-8 దశకు చేరింది. 

సూపర్‌-8లో విండీస్‌.. భారత్‌, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి. ఈ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

రాణించిన హోప్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. షాయ్‌ హోప్‌ (46 బంతుల్లో 75; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌ (24 నాటౌట్‌), మాథ్యూ ఫోర్డ్‌ (16 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇటలీ బౌలర్లలో బెన్‌ మనెంటి, కలుగమగే తలో 2 వికెట్లు తీయగా.. అలీ హసన్‌, డ్రాకా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఇటలీ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. షమార్‌ జోసఫ్‌ (4-0-30-4), మాథ్యూ ఫోర్డ్‌ (4-0-19-3), గుడకేశ్‌ మోటీ (4-0-24-2), అకీల్‌ హొసేన్‌ (3-0-25-1) ధాటికి ఆ జట్టు 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. 

ఇటలీ ఇన్నింగ్స్‌లో బెన్‌ మనెంటి (26) టాప్‌ స్కోరర్‌ కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో ఇటలీ ప్రయాణం ముగిసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ బరిలోకి దిగిన ఈ ఐరోపా జట్టు తమ కంటే చాలా రెట్లు మెరుగైన నేపాల్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement