ఏయూ క్యాంపస్: కఠోర శిక్షణకు ధైర్యం జతకలిసి, సమన్వయం తోడై సాహస గాథగా మారిన రోజు అది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026 నేపథ్యంలో బీచ్‌రోడ్డులో బుధవారం నిర్వహించిన సిటీ పరేడ్ ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ విశాఖ వాసుల గుండెల్లో దేశభక్తి జ్వాలలను రగిలించాయి.
వందేమాతరంతో ప్రారంభమైన వేడుకలో చేతక్ హెలికాప్టర్లు త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో ఎగురవేయగా, కమోవ్–28 హెలికాప్టర్లు, డార్నియర్ విమానాలు గగనతలాన్ని చీల్చాయి.
ర్యాపిడ్ రెస్పాన్స్ బోట్లు సముద్రంపై వేగాన్ని చాటగా, ఫైటర్ జెట్‌లు గర్జనలు వినిపించాయి. తీరాన్ని తాకిన బిఎంపి యుద్ధ ట్యాంకులు, మెరైన్ కమాండోల తాడుసాహసం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఇండియన్ నేవీ సత్తాను ప్రతి విన్యాసం ప్రతిధ్వనింపజేసింది. తరువాత జరిగిన కవాతులో ఎన్‌సీసీ విద్యార్థులు దేశాల పతాకాలతో ముందంజ వేయగా, నేవీ బ్యాండ్, కోస్ట్ గార్డ్, మాజీ సైనికులు క్రమశిక్షణకు అద్దం పట్టారు.
విదేశీ నౌకాదళ సిబ్బంది పాల్గొనడంతో కార్యక్రమం అంతర్జాతీయ వాతావరణాన్ని సంతరించుకుంది. జానపద నృత్యాలు, కోలాటం, గరగలతో సాగరతీరంలో సాంస్కృతిక శోభ పరచుకుంది. శిక్షణ, ధైర్యం, దేశభక్తి కలిసిన ఈ రిహార్సల్ విశాఖకు మరపురాని క్షణాల్ని అందించింది.


