AI Summit: ‘యూపీఐ’ నిరసనలు.. ఔత్సాహికులకు చేదు అనుభవాలు | India AI Impact Summit 2026 Guests Frustrated As Food Counters Accept Only Cash, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

AI Summit: ‘యూపీఐ’ నిరసనలు.. ఔత్సాహికులకు చేదు అనుభవాలు

Feb 18 2026 12:13 PM | Updated on Feb 18 2026 12:48 PM

AI Impact Summit guests frustrated as food counters accept only cash

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌-2026' సందర్శకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతికత, డిజిటల్ వృద్ధి మేళవింపుగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఈవెంట్‌లో ఫుడ్ కౌంటర్ల వద్ద యూపీఐ (UPI) చెల్లింపులను నిలిపివేయడం సందర్శకులను షాక్‌నకు గురిచేస్తోంది. క్యూఆర్ కోడ్‌లు పనిచేయకపోవడం, ఇంటర్నెట్ సిగ్నల్స్ బలహీనంగా ఉండటంతో అతిథులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విదేశీ భాగస్వామ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్‌లు, 13 దేశాల పెవిలియన్లు ఏర్పాటు చేశారు. అయితే కనీసం యూపీఐ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం లేకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘యూపీఐ’తో చెల్లించే వీలు లేనప్పుడు ఇది డిజిటల్ ఇండియా ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక ‘ఎక్స్’ యూజర్‌ ప్రశ్నించగా, మరొకరు ఈ సమిట్‌ను ‘అస్తవ్యస్త నిర్వహణకు నిదర్శనం’ అని అభివర్ణించారు. కనీసం వైఫై సదుపాయం కూడా లేకపోవడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నియోసేపియన్ సహ వ్యవస్థాపకునికి చేదు అనుభవం
నియోసేపియన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ధనంజయ్ యాదవ్, భారతదేశ సాంకేతిక రంగానికి తన వంతు సహకారం అందించాలనే  ఆశయంతో 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'కు వచ్చారు. తన స్టార్టప్ రూపొందించిన ‘వేరబుల్ స్మార్ట్ ఏఐ’ పరికరాన్ని ప్రదర్శించడానికి ఒక చిన్న స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రధాని మోదీ రాక సందర్భంగా.. భద్రతా కారణాలతో అతనిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించారు.
 

అతని ల్యాప్‌టాప్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను అక్కడే వదిలి వెళ్ళాలని, సెక్యూరిటీ సిబ్బంది వాటికి బాధ్యత వహిస్తుందని వారు చెప్పడంతో వారి మాటలను నమ్మి బయటకు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత ధనంజయ్ యాదవ్ తిరిగి వచ్చి చూసేసరికి అతని పరికరాలన్నీ మాయమయ్యాయి. దీంతో విమాన ప్రయాణం, హోటల్ వసతి, స్టాల్ ఏర్పాటు కోసం భారీగా ఖర్చు చేసిన ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో కష్టపడి రూపొందించిన తన ప్రోటోటైప్‌ను కూడా ఆయన కోల్పోయారు. ఈ సంఘటన అక్కడి భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపడమే కాకుండా, భారత్‌లో  ఆవిష్కర్తలకు ఎదురయ్యే సవాళ్లకు ఉదాహరణగా నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement