మార్కెట్లో పెరుగుతున్న నోట్ల కట్టలు
జనవరి చివరికి నగదు చలామణీ రూ.40 లక్షల కోట్లు
ఏడాదిలో 11 శాతం పెరుగుదల
డిజిటల్ చెల్లింపులూ అధికమే
ఏటీఎంల నుంచి పెరుగుతున్న ఉపసంహరణలు
దేశంలో ఒకవైపు యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు వ్యవస్థలో నగదు చలామణి సైతం ఆసక్తికరంగా విస్తరిస్తోంది. జనవరి చివరికి చలామణిలో ఉన్న నగదు రూ.40లక్షల కోట్లకు చేరినట్టు ఎస్‌బీఐ పరిశోధన విభాగం నివేదిక వెల్లడించింది. 2025 జనవరి నుంచి చూస్తే ఏడాదిలో 11.1 శాతం పెరిగింది. ఏడాది కాలంలో నికరంగా రూ.2.76 లక్షల కోట్ల నగదు వినియోగం అధికమైంది. ప్రజల వద్దనున్న నగదు కూడా ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 97.6 శాతంగా ఉంది. విలువ పరంగా రూ.39 లక్షల కోట్లు.
2020–21 (కరోనా అనంతరం) నాటి నుంచి ప్రజల వద్ద నగదు నికరంగా రూ.4.6 లక్షల కోట్లు పెరిగినట్టు ఎస్‌బీఐ పరిశోధన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో (కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, జార్ఖండ్) పెరుగుతుండడం గమనార్హం. నగదు వినియోగం పెరుగుతున్నప్పటికీ.. జీడీపీలో నగదు నిష్పత్తి మాత్రం 2021 మార్చి నాటికి ఉన్న 14.4 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది.
నగదు ఉపసంహరణలు..
ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణలు దీర్ఘకాల సగటు రూ.2.5 లక్షల కోట్లను అధిగమించినట్టు తాజా డేటా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు పెరిగాయి. కర్ణాటకలో జీఎస్‌టీ విభాగం గతేడాది జూలైలో ఏకంగా 18,000 మంది చిన్న వర్తకులకు పన్ను నోటీసులు జారీ చేసింది. వీరి యూపీఐ లావాదేవీలు ఏడాదిలో రూ.40 లక్షలు దాటడమే ఇందుకు కారణం. ఈ పరిమితి దాటితే వారు జీఎస్‌టీ కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చర్య యూపీఐ చెల్లింపులను నిరుత్సాహపరిచి ఉండొచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. జీఎస్‌టీ విభాగం నోటీసులు జారీ తర్వాత కర్ణాటక రాష్టంలోని ఆయా జిల్లాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ రూ.37 కోట్ల మేర అదనంగా పెరిగినట్టు తెలిసింది. పశి్చమబెంగాల్, కేరళలలోనూ ఇదే ధోరణి కనిపించింది.
నగదు పెరగడం వెనుక..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్ద నగదు కలిగి ఉండడం కూడా పెరిగింది. జీడీపీ వృద్ధికి అనుగుణంగా కరెన్సీకి సైతం డిమాండ్ పెరగడం సహజమేనని... వడ్డీ రేట్లు తక్కువలో ఉండడం కూడా ప్రజల వద్ద నగదు పెరగడానికి ఒక కారణమని ఈ నివేదిక పేర్కొంది. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగిపోవడం కూడా మార్కెట్లో నగదు లభ్యత అధికం కావడానికి దారితీసినట్టు విశ్లేషించింది. ధరలు పెరగడంతో ఇళ్లల్లోని పాత బంగారం, వెండిని విక్రయించడం ద్వారా ప్రజల వద్ద సొమ్ము పెరిగినట్టు తెలిపింది. 2025 మార్చి నాటికి వినియోగంలోని రూ.500 నోట్ల విలువ 8.9 శాతం పెరిగి మొత్తం నగదులో 89 శాతానికి చేరింది. పరిమాణం పరంగా 3 శాతం పెరిగి మొత్తం వినియోగ నోట్లలో 40.9 శాతానికి చేరింది. విలువ పరంగా రూ.100 నోట్ల వినియోగం ఒక శాతం పెరిగి 4.7 శాతానికి చేరగా, రూ.200 నోట్ల వినియోగం మొత్తం కరెన్సీలో 0.8 శాతానికి చేరింది.
ముఖ్యంగా రూ.500 నోట్ల వినియోగం అధికంగా ఉండడం వెనుక.. రూ.500 లోపు చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తుండడం కారణం. వినియోగంలో నగదు చలామణి రూ.40 లక్షల కోట్లకు చేరినప్పటికీ.. ఒక్క నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.28 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం గమనార్హం. 2025 అక్టోబర్‌లో నెలవారీ రూ.2.1 లక్షల కోట్ల విలువ మేర యూపీఐ లావాదేవీలు నికరంగా పెరిగి రూ.27.3 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. నవంబర్‌లో రూ.26.3 లక్షల కోట్లకు తగ్గినప్పటికీ.. తిరిగి డిసెంబర్‌లో రూ.28 లక్షల కోట్లు, 2026 జనవరిలో రూ.28.3 లక్షల కోట్ల చొప్పున నమోదయ్యాయి.


