రెండో రోజూ లాభాలు
సెన్సెక్స్ 174 పాయింట్లు అప్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 83,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 25,725 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 611 పాయింట్ల పరిధిలో 82,987 – 83,598 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 25,570 వద్ద కనిష్టాన్ని, 25,764 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.52 లక్షల కోట్లు పెరిగి రూ.470.11 లక్షల కోట్లకు చేరింది. లూనార్ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ ఇండెక్సు 0.50% నష్టపోయింది. ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈ రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ 2.36% పెరిగింది. ఐటీ 1.15%, ఇండ్రస్టియల్స్ 1.13%, సర్వీసెస్ 0.98% ఐటీ 0.94%, ఎఫ్‌ఎంసీజీ 0.87%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.85%, క్యాపిటల్ గూడ్స్ 0.76% పెరిగాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్సులు 0.49%, 0.26% లాభపడ్డాయి. మరోవైపు మెటల్, కమోడిటీస్, ఇంధన, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
⇒ హెచ్‌సీఎల్ టెక్ 1.50 శాతం, విప్రో 1.21శాతం, ఎల్‌అండ్‌టీఎం 1 శాతం లాభపడ్డాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ షేర్లు 0.50 శాతం పెరిగాయి.
⇒ భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్... ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో మరిన్ని రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్ల ఒప్పందం కుదరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా డిఫెన్స్ షేర్లకు డిమాండ్ లభించింది. కొచి్చన్ షిప్‌యార్డ్ 4%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, యూనిమెక్ ఏరోస్పేస్ 4%, భారత్ ఫోర్జ్ 1.38%, పరాస్ డిఫెన్స్, జెన్ టెక్నాలజీస్ 1%, హెచ్‌ఏఎల్ 0.50% లాభపడ్డాయి.


