నభా పవర్‌ కొత్త ఓనర్‌.. టొరెంట్‌పవర్‌ | Torrent Power to acquire Nabha Power from L and T for Rs 6889 crore | Sakshi
Sakshi News home page

నభా పవర్‌ కొత్త ఓనర్‌.. టొరెంట్‌పవర్‌

Feb 18 2026 1:08 AM | Updated on Feb 18 2026 7:51 AM

Torrent Power to acquire Nabha Power from L and T for Rs 6889 crore

ఎల్‌ అండ్‌ టీతో ఒప్పందం

100 శాతం వాటా కొనుగోలు 

డీల్‌ విలువ రూ. 6,889 కోట్లు

ముంబై: ప్రైవేట్‌ రంగ కంపెనీ టొరెంట్‌ పవర్‌ తాజాగా డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ నుంచి నభా పవర్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఎల్‌ అండ్‌ టీ సొంత అనుబంధ సంస్థ ఎల్‌ అండ్‌ టీ పవర్‌ డెవలప్‌మెంట్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా నభా పవర్‌లో 100 శాతం వాటాసహా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీలను రూ. 6,889 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో సొంతం చేసుకోనుంది. పూర్తిగా కాంట్రాక్టు కలిగిన థర్మల్‌ పవర్‌ ప్లాంటును నభా కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 4,866 కోట్ల ఆదాయం, రూ. 1,153 కోట్ల నిర్వహణ లాభం సాధించింది.

జపనీస్‌ సాంకేతికతతో ఏర్పాటు చేసిన సూపర్‌ క్రిటికల్‌ బొగ్గు ఆధారిత(థర్మల్‌) విద్యుత్‌ ప్లాంటును నిర్వహిస్తోంది. పంజాబ్‌లోని రాజ్‌పురాలో 700 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లతో కలిపి ఈ ప్లాంటు 1,400 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2014లో కార్యకలాపాలు ప్రారంభమైన ప్లాంటు 25 ఏళ్ల కాలానికి ప్రభుత్వంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) కుదుర్చుకుంది. బొగ్గు సరఫరాలకు ఎస్‌ఈసీఎల్, ఎన్‌సీఎల్‌తో ఇంధన సరఫరా ఒప్పందాలను(ఎఫ్‌ఎస్‌ఏలు) కలిగి ఉంది. ఈ కొనుగోలు తదుపరి టొరెంట్‌ పవర్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం ప్రస్తుత 5 గిగావాట్ల నుంచి 6.4 గిగావాట్లకు బలపడనుంది. అంతేకాకుండా అత్యధిక వృద్ధికి వీలున్న ఉత్తరాది మార్కెట్లలో ప్రవేశించేందుకు వీలు చిక్కనుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement