మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే! | Medigadda Barrage Restoration: Telangana Govt Gives L and T Another Ultimatum | Sakshi
Sakshi News home page

మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే!

Feb 15 2026 4:37 AM | Updated on Feb 15 2026 4:37 AM

Medigadda Barrage Restoration: Telangana Govt Gives L and T Another Ultimatum

మీ నిర్లక్ష్యంతోనే బరాజ్‌ కుంగిపోయింది 

పరస్పర అంగీకారంతో మరమ్మతుల ప్రశ్నే ఉత్పన్నం కాదు 

సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవు 

‘ఎల్‌ అండ్‌ టీ’కి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ పునరుద్ధరణకు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టడంతోపాటు పునరుద్ధరణ చర్యల విషయంలో నీటిపారుదల శాఖ, సెంట్రల్‌ పవర్‌ అండ్‌ వాటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), డిజైన్‌ కన్సల్టెంట్‌కు పూర్తి సహకారం అందించాలని బరాజ్‌ నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ–పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌’ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. సిబ్బంది, సామగ్రి, యంత్రాలను బరాజ్‌ వద్దకు తరలించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేసింది. 

పరస్పర అంగీకారంతో రూపొందించే నిబంధనల ప్రకారమే బరాజ్‌ పునరుద్ధరణ పనులు చేపట్టాలంటూ ‘ఎల్‌ అండ్‌ టీ’ప్రత్యుత్తరం రాయడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. పరస్పర అంగీకారమనే ప్రశ్న ఉత్పన్నం కాదని.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని తేలి్చచెప్పింది. కేవలం నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఒప్పంద కాలంలోనే బరాజ్‌కు నష్టం జరిగిందని.. బరాజ్‌ పునరుద్ధరణను పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టాలని ‘ఎల్‌ అండ్‌ టీ’కి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ రామగుండం సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఈ నెల 3న ‘ఎల్‌ అండ్‌ టీ’కి మరో లేఖ రాశారు. 

మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణంలో నిర్మాణ సంస్థ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ), జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు తమ నివేదికల్లో తేల్చడాన్ని గుర్తుచేశారు. పునరుద్ధరణ చర్యల్లో ఈ సంస్థల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం లేఖలో ఆదేశించింది. నీటిపారుదల శాఖ నియమించే డిజైన్‌ కన్సల్టెంట్‌ నుంచి అవసరమైన ఇన్‌పుట్స్‌ అందిన వెంటనే బరాజ్‌ పునరుద్ధరణకు సహకరిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. పునరుద్ధరణ పనుల డిజైన్ల తయారీ కోసం ఆఫ్రీ ఇండియా లిమిటెడ్‌ సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశామని.. త్వరలో ఒప్పందం చేసుకోనున్నామని తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement