టార్గెట్‌ 90 | CM Revanth Reddy Review With Ministers Over Municipal Election Results | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 90

Feb 15 2026 4:28 AM | Updated on Feb 15 2026 4:28 AM

CM Revanth Reddy Review With Ministers Over Municipal Election Results

90 మున్సిపాలిటీల్లో పాగా వేయడంపై దృష్టిపెట్టాలన్న సీఎం 

పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రులకే బాధ్యత అప్పగించిన రేవంత్‌ 

స్వతంత్రులు, కలిసి వచ్చే పార్టీల సహకారం తీసుకోవాలని దిశానిర్దేశం 

మంత్రులు, పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ.. మున్సిపల్‌ ఫలితాలపై సంతృప్తి

సాక్షి హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 16న జరిగే మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో కనీసం 90కి తగ్గకుండా పురపాలి కల్లో కాంగ్రెస్‌ కొలువు తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు లక్ష్యం నిర్దేశించారు. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళి, హంగ్‌ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సభ్యులతో శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ప్రత్యే కంగా భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ కూడా పాల్గొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించిన మంత్రులు.. ప్రజాతీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితమే ఈ విజయమని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన పార్లమెంట్‌ ఇన్‌చార్జి మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. అలాగే పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు నడిపిన మహేశ్‌కుమార్‌గౌడ్, రేవంత్‌రెడ్డిని మంత్రులు అభినందించారు. 

ఫలితాలు మనకు బూస్టప్‌ 
మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అందరం కలసికట్టుగా పనిచేయడం వల్లే సత్ఫలితాలు సాధించామన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీకి బూస్టప్‌ ఇచ్చాయని చెప్పారు. మొత్తం 70కిపైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన విజయం సాధించిందని.. హంగ్‌ ఏర్పాటైన చోట్ల కూడా స్వతంత్రులు, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగరేసేలా మంత్రులు పనిచేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రులకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలపై పార్టీ అగ్ర నాయకత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్న సీఎం.. త్వరలోనే పరిషత్‌ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. 

బీఆర్‌ఎస్‌ను నమ్మలేదు.. బీజేపీ బలపడలేదు 
ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో లేరని.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందన్న వాదనలో నిజం లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే చేసి చూపిందని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తిని చాటాలని మంత్రులకు సూచించారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ ముఖ్య నేతలు వేం నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి హాజరవగా ఆన్‌లైన్‌ ద్వారా మంత్రులు ఉత్తమ్, దామోదర, తుమ్మల, మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.  

మంత్రులకు పని విభజన 
పార్టీపరంగా సమస్యలున్న మున్సిపాలిటీల్లో అందరితో మాట్లాడే బాధ్యతను మంత్రులకు సీఎం రేవంత్‌ రెడ్డి అప్పగించారు.జగిత్యాల పంచాయతీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు అప్పగించిన సీఎం.. కొత్తగూడెం బాధ్యతను పొంగులేటికి, కరీంనగర్‌ కార్పొరేషన్‌ బాధ్యతను శ్రీధర్‌బాబు, పొన్నం, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ బాధ్యత మహేశ్‌గౌడ్, ఉత్తమ్‌కు అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement