‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం! | Love lost in Valentines commercial spectacle | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం!

Feb 13 2026 8:46 AM | Updated on Feb 13 2026 9:46 AM

Love lost in Valentines commercial spectacle

ప్రేమ అంటే రెండు మనసుల కలయిక అనే నిజమైన అర్థం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో ప్రేమ అంటే ‘వ్యాపార ధోరణి’ అనే కొత్త అర్థాన్ని కొన్ని కంపెనీలు సృష్టించాయి. రాబోయే ఫిబ్రవరి 14న ప్రేమికులు జరుపుకోబోయే ‘వాలంటైన్స్‌ డే’కి వ్యాపార సరంజామాను అంటగడుతూ కొన్ని సంస్థలు మార్కెట్‌లో తమ హవాను చాటుకుంటున్నాయి.

ప్రేమకు మార్కెటింగ్‌ వ్యూహం
నిజానికి ప్రేమలోని మాధుర్యం ఒక అందమైన భావోద్వేగం. దీనికి సాహిత్య సృజనతోడయితే ప్రేమ మరింత పరిమళిస్తుంది.  అయితే ఇప్పుడది మార్కెటింగ్ వ్యూహాల మధ్య చిక్కుకు పోయింది. ఒకప్పుడు పరస్పర అనురాగాన్ని వ్యక్తపరిచే ప్రశాంతమైన సందర్భంగా ఉన్న ప్రేమికుల రోజు ఇప్పుడు భారీ వాణిజ్య ఈవెంట్‌గా రూపాంతరం చెందింది. నేటి కాలంలో ప్రేమను ఖర్చు చేసే సామర్థ్యం, సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఆడంబరం, ట్రెండ్స్‌ను అనుసరించడం ద్వారా  కొలుస్తున్నారు. ఈ మార్పు ప్రేమకున్న అర్థాన్ని తగ్గించిందని, ఖరీదైన వస్తువులను గిఫ్ట్‌లుగా ఇస్తేనే ప్రేమ బంధం బలపడుతుందనే అపోహలో యువత ఉన్నారని పలువురు అంటున్నారు.

అంతర్జాతీయ వాణిజ్య వేడుక
ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల రోజుతో ముడిపెట్టడం అనేది మధ్యయుగంలో ఐరోపా కవిత్వంగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా జెఫ్రీ చోసర్ రచనల ద్వారా ఇది ప్రారంభమైంది. శతాబ్దాలు గడిచేకొద్దీ ఈ సాహిత్య భావన ఒక సాంస్కృతిక ఆచారంగా, తరువాత అంతర్జాతీయ వాణిజ్య వేడుకగా పరిణమించింది. నేడు మనం చూస్తున్న చాక్లెట్లు, గులాబీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్రాచీన సంప్రదాయాలు కావు. ఇవి వివిధ కంపెనీలు తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు సృష్టించిన ఆధునిక కల్పనలు మాత్రమేనని చాలామంది చెబుతుంటారు.

సోషల్ మీడియా ప్రభావం
ఇప్పుడున్న రోజుల్లో ప్రేమ అనేది ఒక వ్యక్తిగత ఇష్టం నుండి సామాజిక బాధ్యతగా మారిపోయింది. సాధారణ వస్తువులను భావోద్వేగ అవసరాలుగా పలు కంపెనీలు తమ ప్రకటనల్లో చిత్రీకరిస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ‘వాలెంటైన్స్ వీక్’, ‘లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్స్’ వంటి పేర్లతో కృత్రిమ గడువులను సృష్టిస్తూ, బహుమతి కొనకపోవడం అనేది ఒక  వైఫల్యంగా భావించేలా చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ అనేది ప్రదర్శన వస్తువుగా మారిపోయింది. మరోవైపు ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారాలు కూడా బ్రాండెడ్ వస్తువులతో ప్రేమను ముడిపెట్టేలా సాగుతున్నాయి. ఫలితంగా ప్రేమికులు ఆర్థిక పరిమితులకు మించి ఖర్చు చేస్తూ, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

ఒక బాధ్యత- దీర్ఘకాలిక నిబద్ధత
ఈ వాణిజ్య ధోరణి భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందని పలువురు అంటుంటారు. భారతదేశంలో ప్రేమ, అనురాగం, భక్తిని  చాటేందుకు పలు మార్గాలు ఉన్నాయి. మన పండుగలు, సంప్రదాయాలు ప్రేమను ఒక బాధ్యతగా దీర్ఘకాలిక నిబద్ధతగా తెలియజేశాయి. ప్రేమ అనేది ఒక రోజు ప్రదర్శించే ఆడంబరం కాదని, అది నిరంతరం పాటించే ధర్మం అని పేర్కొన్నాయి. ప్రస్తుత వాలెంటైన్స్ డే సంస్కృతి కృత్రిమ భావోద్వేగాలను కలగుజేస్తున్నయని పలువురు అంటున్నారు.

వస్తువుల కంటే విలువలకు..
నిజమైన ప్రేమకు, వాణిజ్య ప్రేమకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నిజమైన ప్రేమ అనేది ఎదుటివ్యక్తి నిరంతర సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. అది జీవితాంతం ఉండే ఒక మధురమైన భావన. ప్రేమ అనేది మార్కెట్‌లో అమ్మే వస్తువు కాదని, అది చిత్తశుద్ధితో నిర్మించుకోవాల్సిన ఒక నిరంతర సాధన అని  పెద్దలు చెబుతుంటారు.  వస్తువుల కంటే విలువలకు, ఆడంబరం కంటే అనురాగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ప్రేమకు సార్థకత చేకూరుతుందని అంటారు. 

ఇది కూడా చదవండి: లక్షణాలు లేకుండా కాలేయాన్ని కరిగించి..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement