సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన యాప్ కో-ఫౌండర్ రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అరెస్ట్ చేసినట్లు భారత అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే మరో కీలక నిందితుడు సౌరభ్ చంద్రకర్‌ను ఒమన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే రవి ఉప్పల్ అరెస్ట్‌పై యూఏఈ నుంచి భారత ప్రభుత్వానికి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. అతడిని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన రవి ఉప్పల్‌పై 2023 అక్టోబర్‌లో ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ అయింది.
మహదేవ్ బెట్టింగ్ వ్యవహారంలో ఉప్పల్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. వందల కోట్ల రూపాయల హవాలా లావాదేవీలను నిర్వహించడంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు పలువురు అధికారులతో కూడా రవి సంబంధాలు కొనసాగించినట్లు పేర్కొంది. మరోవైపు సౌరభ్ చంద్రకర్ ప్రధానంగా యాప్ ప్రచారం, కార్యకలాపాలను పర్యవేక్షించగా.. రవి బెట్టింగ్ వ్యవహారంలోని ఆర్థిక వ్యవహారాలు, హవాలా నెట్‌వర్క్‌ను నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈడీ అంచనా ప్రకారం మహదేవ్ బెట్టింగ్ యాప్, దానికి అనుబంధంగా ఉన్న ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సుమారు రూ.94 వేల కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ప్రమోటర్లకు చేరినట్లు ఏజెన్సీ పేర్కొంది. రవిని విచారిస్తే అక్రమ నగదు లావాదేవీలు, ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన రాజకీయ నాయకులు, అధికారుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.
ఇదీ చదవండి: మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు


