మహాదేవ్ యాప్ ఇప్పటికీ పనిచేస్తోంది
పీఎంఎల్‌ఏ కోర్టుకు తెలిపిన ఈడీ
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడే మహాదేవ్ యాప్ ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. ప్రధాన యాప్‌తోపాటు దాని అనుబంధ యాప్‌లు కలిసి గత పదేళ్లలో రూ.94 వేల కోట్లకు పైగా అక్రమంగా బెట్టింగ్‌ల ద్వారా దండుకున్నాయని వివరించింది. ఈ మేరకు ఈడీ ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఇటీవల తన ఆరో చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
ఇందులో 42 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా పేర్కొంది. మహాదేవ్ యాప్ విదేశాల నుంచి చట్టవిరుద్ధంగా నిర్వహించే బెట్టింగ్ వెబ్‌సైట్‌ల సముదాయమని తెలిపింది. దీని ప్రధాన నిర్వాహకులు, ప్యానెల్ సభ్యులు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని పేర్కొంది. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్’గా కూడా పిలువబడే ఈ యాప్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్ పేజీల ద్వారా ప్రచారం చేస్తోందని, త్వరగా డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి వేలాది మంది యువకులను ఆకర్షిస్తోందని ఈడీ పేర్కొంది.


