బీజేపీ పాలనకు, విలువలకు మూలస్తంభం సేవ
దేశ నిర్మాణం, దేశాభివృద్ధిపైనే బీజేపీ దృష్టి
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
‘సేవా సంకల్ప యాత్ర’లో పాల్గొన్నవారితో సంభాషణ
‘వికసిత్ భారత్’ సంకల్పంతో యువత మమేకం కావాలని పిలుపు
దేవాస్: సేవ అనేది బీజేపీ పాలనకు, విలువలకు మూలస్తంభమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తాము ఎంత రాజకీయ అధికారాన్ని పొందినప్పటికీ సేవా మార్గం నుంచి ఎన్నటికీ వైదొలగబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికల కంటే దేశ నిర్మాణం, దేశాభివృద్ధిపైనే తమ పార్టీ అధికంగా దృష్టి సారిస్తోందని పునరుద్ఘాటించారు.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని వాద్‌నగర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు జరుగుతున్న ‘సేవా సంకల్ప యాత్ర’లో పాల్గొన్నవారితో ప్రధాని మోదీ గురువారం వర్చువల్‌గా సంభాషించారు. రాజకీయాలు, ఎన్నికలు, పరిపాలనకు వాటి స్థానం వాటికి ఉందన్నారు. కానీ, దేశాన్ని అభివృద్ధి చేయాలన్న బలమైన సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నామని తెలిపారు. ‘సేవా సంకల్ప యాత్ర’ లో పాల్గొంటున్నవారు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చేరుకున్నారు.
సేవే అత్యున్నత ధర్మం
ప్రజలకు సేవ చేయడమే యువత ప్రాథమిక లక్ష్యం కావాలని మోదీ అన్నారు. సేవ చేస్తూనే సేవా సందేశాన్ని ఇవ్వాలన్నారు. సేవ గురించి ప్రత్యేకంగా ఉపదేశించాల్సిన అవసరం లేదని వివరించారు. మనం సేవా సందేశాన్ని మాటలతో కాకుండా సేవ ద్వారానే అందిస్తామని పేర్కొన్నారు. సేవే అత్యున్నత ధర్మం అనే స్ఫూర్తితో ముందడుగు వేయాలన్నారు. గ్రామస్థుల వద్ద ఉన్న అపారమైన సాంప్రదాయ జ్ఞానాన్ని వారి నుంచి నేర్చుకోవాలని యువతకు మోదీ సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సందేశా న్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని కోరారు.
యాత్ర సమయంలో ‘శక్తి కీ సప్త ధార’(ఏడు శక్తి ప్రవాహాలు) గురించి ప్రజలతో మాట్లాడాలని చెప్పారు. ఆగస్టు 15న ప్రధాని సప్త ధార అనే ఏడు సూత్రాల సంస్కరణల చట్రాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సేవా సంకల్ప యాత్రలో పాల్గొన్నవారు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. ఓ యువ కుడు మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఒక గ్రామానికి మోదీ ఫాలియా అని పేరు పెట్టారు’’అని చెప్పారు. జెన్–జెడ్ తరం మోదీకి మద్దతు ఇస్తోందని చెప్పారు.
జీవితమంతా ప్రజల ఆశీర్వాదాలతోనే నడిచింది
వారణాసి, వాద్‌నగర్ ప్రాచీన నగరాలని, అవి ఇప్పటికీ చైతన్యవంతంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. వాటిలో ఒకటి తన జన్మస్థలమని, మరొకటి తన ‘కర్మభూమి’అని వ్యాఖ్యానించారు. పరిపాలనకు ప్రజాసేవే కేంద్రంగా ఉన్నప్పుడు, ప్రతి విధానానికి నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అనే సంకల్పం మూలంగా ఉంటుందని వివరించారు. ఎంతటి అధికారం దక్కినా మనది సేవా మార్గమేనన్న సంగతిని మన ప్రవర్తన ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా సేవామార్గం వీడకూడదని పిలుపునిచ్చారు. సేవా స్ఫూర్తితో చేసిన పనులను ప్రజలు గుర్తుంచుకుంటారని, సేవ చేసే వారిని ఆశీర్వదిస్తారని వెల్లడించారు. తన జీవితమంతా ప్రజల ఆశీర్వాదాలతోనే నడిచిందని, అవే తన జీవితానికి గొప్ప శక్తిగా నిలిచాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేస్తే దేశానికి చేసినట్లేనని ఉద్బోధించారు. అదే జీవితపు గొప్ప మంత్రమని అన్నారు. పేదలు, మహిళలు, బాలికలు, రోగులు, గిరిజనులతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రయోజనం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సేవా స్ఫూర్తియే పునాది అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
సేవా స్ఫూర్తిని దేశ విధానాలకు అన్వయించినప్పుడు, సేవయే దేశ ప్రగతికి అతిపెద్ద చోదక శక్తిగా మారుతుందన్నారు. ‘వికసిత్ భారత్’సంకల్పంతో యువత మమేకం కావాలన్నారు. నేటి యువతరం అభివృద్ధి చెందిన భారతదేశానికి సృష్టికర్తలే కాకుండా, ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత ప్రధాన లబి్ధదారులు కూడా అవుతారని స్పష్టంచేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో యాత్రలకు నాయకత్వం వహించానని చెప్పారు. యాత్ర అంటే కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం మాత్రమే కాదని, ప్రజలను కలవడం, సమాజాలను అర్థం చేసుకోవడం, సేవా స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావడం కూడా అని వివరించారు.


