breaking news
Viksit Bharat
-
మాది ఎప్పటికీ సేవా మార్గమే
దేవాస్: సేవ అనేది బీజేపీ పాలనకు, విలువలకు మూలస్తంభమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తాము ఎంత రాజకీయ అధికారాన్ని పొందినప్పటికీ సేవా మార్గం నుంచి ఎన్నటికీ వైదొలగబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికల కంటే దేశ నిర్మాణం, దేశాభివృద్ధిపైనే తమ పార్టీ అధికంగా దృష్టి సారిస్తోందని పునరుద్ఘాటించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు జరుగుతున్న ‘సేవా సంకల్ప యాత్ర’లో పాల్గొన్నవారితో ప్రధాని మోదీ గురువారం వర్చువల్‌గా సంభాషించారు. రాజకీయాలు, ఎన్నికలు, పరిపాలనకు వాటి స్థానం వాటికి ఉందన్నారు. కానీ, దేశాన్ని అభివృద్ధి చేయాలన్న బలమైన సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నామని తెలిపారు. ‘సేవా సంకల్ప యాత్ర’ లో పాల్గొంటున్నవారు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చేరుకున్నారు. సేవే అత్యున్నత ధర్మం ప్రజలకు సేవ చేయడమే యువత ప్రాథమిక లక్ష్యం కావాలని మోదీ అన్నారు. సేవ చేస్తూనే సేవా సందేశాన్ని ఇవ్వాలన్నారు. సేవ గురించి ప్రత్యేకంగా ఉపదేశించాల్సిన అవసరం లేదని వివరించారు. మనం సేవా సందేశాన్ని మాటలతో కాకుండా సేవ ద్వారానే అందిస్తామని పేర్కొన్నారు. సేవే అత్యున్నత ధర్మం అనే స్ఫూర్తితో ముందడుగు వేయాలన్నారు. గ్రామస్థుల వద్ద ఉన్న అపారమైన సాంప్రదాయ జ్ఞానాన్ని వారి నుంచి నేర్చుకోవాలని యువతకు మోదీ సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సందేశా న్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని కోరారు. యాత్ర సమయంలో ‘శక్తి కీ సప్త ధార’(ఏడు శక్తి ప్రవాహాలు) గురించి ప్రజలతో మాట్లాడాలని చెప్పారు. ఆగస్టు 15న ప్రధాని సప్త ధార అనే ఏడు సూత్రాల సంస్కరణల చట్రాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సేవా సంకల్ప యాత్రలో పాల్గొన్నవారు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. ఓ యువ కుడు మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఒక గ్రామానికి మోదీ ఫాలియా అని పేరు పెట్టారు’’అని చెప్పారు. జెన్–జెడ్ తరం మోదీకి మద్దతు ఇస్తోందని చెప్పారు. జీవితమంతా ప్రజల ఆశీర్వాదాలతోనే నడిచింది వారణాసి, వాద్నగర్ ప్రాచీన నగరాలని, అవి ఇప్పటికీ చైతన్యవంతంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. వాటిలో ఒకటి తన జన్మస్థలమని, మరొకటి తన ‘కర్మభూమి’అని వ్యాఖ్యానించారు. పరిపాలనకు ప్రజాసేవే కేంద్రంగా ఉన్నప్పుడు, ప్రతి విధానానికి నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అనే సంకల్పం మూలంగా ఉంటుందని వివరించారు. ఎంతటి అధికారం దక్కినా మనది సేవా మార్గమేనన్న సంగతిని మన ప్రవర్తన ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా సేవామార్గం వీడకూడదని పిలుపునిచ్చారు. సేవా స్ఫూర్తితో చేసిన పనులను ప్రజలు గుర్తుంచుకుంటారని, సేవ చేసే వారిని ఆశీర్వదిస్తారని వెల్లడించారు. తన జీవితమంతా ప్రజల ఆశీర్వాదాలతోనే నడిచిందని, అవే తన జీవితానికి గొప్ప శక్తిగా నిలిచాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేస్తే దేశానికి చేసినట్లేనని ఉద్బోధించారు. అదే జీవితపు గొప్ప మంత్రమని అన్నారు. పేదలు, మహిళలు, బాలికలు, రోగులు, గిరిజనులతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రయోజనం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సేవా స్ఫూర్తియే పునాది అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. సేవా స్ఫూర్తిని దేశ విధానాలకు అన్వయించినప్పుడు, సేవయే దేశ ప్రగతికి అతిపెద్ద చోదక శక్తిగా మారుతుందన్నారు. ‘వికసిత్ భారత్’సంకల్పంతో యువత మమేకం కావాలన్నారు. నేటి యువతరం అభివృద్ధి చెందిన భారతదేశానికి సృష్టికర్తలే కాకుండా, ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత ప్రధాన లబి్ధదారులు కూడా అవుతారని స్పష్టంచేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో యాత్రలకు నాయకత్వం వహించానని చెప్పారు. యాత్ర అంటే కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం మాత్రమే కాదని, ప్రజలను కలవడం, సమాజాలను అర్థం చేసుకోవడం, సేవా స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావడం కూడా అని వివరించారు. -
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్
పణజి: డ్రగ్స్ రహిత యువశక్తితోనే 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్య సాధన సాధ్యమని ప్రధాని విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రధాని సంకల్పం మేరకు 2029 నాటికి భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్ సిద్ధం చేసిందని తెలిపారు. నక్సలిజం, ఉగ్రవాద ముప్పును అంతం చేయడానికి మోదీ సర్కార్ ఎంతగానో కృషి చేసిందని, అదే తరహాలో ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని వివరించారు. ఇందులో భాగంగానే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో కూడిన వ్యూహాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలియజేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఆదివారం గోవాలోని పణజిలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014కు ముందు డ్రగ్స్‌పై పోరాటం చాలావరకు ఒంటరిగానే సాగిందన్నారు. దర్యాప్తు ఏజెన్సీలు తరచుగా చిన్నపాటి నిందితులను పట్టుకోవడంతోనే సంతృప్తి చెందేవని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఈ పోరాటాన్ని జాతీయ ప్రాధాన్యత గల అంశంగా పరిగణిస్తోందని స్పష్టంచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమన్వయంతో కూడిన చర్యలను చేపట్టేందుకు 2019లో కార్యనిర్వాహక, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక జాతీయ సమన్వయ కమిటీ’ అనే నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
వికసిత భారత్‌కు వాహన రంగం దన్ను!
న్యూఢిల్లీ: నిరంతర ఆవిష్కరణలు, అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తూ 2047 నాటికి వికసిత (అభివృద్ధి చెందిన) భారత్ సాకారం దిశగా సాహసోపేతమైన మార్గాన్ని రూపొందించుకోవాలని భారత వాహన పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గురువారమిక్కడ జరిగిన భారతీయ వాహన తయారీదారుల సంఘం (సియామ్) 2026 వార్షిక సదస్సుకు అందించిన సందేశంలో, ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో అంతర్జాతీయ మార్కెట్లలో మన వాహన రంగం దూసుకెళ్లేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన పరిశ్రమ మరింతగా విస్తరించేందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని చెప్పారు. సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు. ‘వికసిత భారత్ జర్నీలో వాహన రంగానికి కొంగొత్త అవకాశాలు లభిస్తాయి. భారీగా వృద్ధి చెందుతుంది. దేశాభివృద్ధిలో కీలక మూల స్తంభంగా రవాణా రంగం పాత్ర బలోపేతమవుతుంది. గడిచిన దశాబ్దకాలంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఎకానమీ ప్రగతితో పాటు వాహనాలకు డిమాండ్ కూడా పుంజుకుంటుంది. హైవేలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణ జోరుతో మన ఆటోమొబైల్ పరిశ్రమకు మరిన్ని కొత్త అవకాశాలు దక్కుతున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈవీలు రయ్... దేశంలో చార్జింగ్ సదుపాయాల విస్తరణ జోరందుకోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయని.. ఇది ఆవిష్కరణల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. నవతరం మొబిలిటీ దిశగా భారత్ దూసుకెళ్తున్న నేపథ్యంలో భారతీయ వాహన తయారీ సామర్థ్యాలను సరికొత్త శిఖరాలను తీసుకెళ్లడంలో సియామ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌ల వంటి చర్యలతో వాహన పరిశ్రమ తయారీ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయని వివరించారు. ఆర్థిక వృద్ధికి కీలక చోదకం: సియామ్ ప్రెసిడెంట్ భారత్ ఆర్థిక ప్రగతికి ఆటోమొబైల్ పరిశ్రమ కీలక చోదకంగా నిలుస్తుందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. పర్యావరణహితమైన, కాలుష్యరహిత, సురక్షిత రవాణా విషయంలో ప్రపంచవ్యాప్త, జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం చేయడంలో గణనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ ఎకానమీలో వాహన పరిశ్రమ వాటా రూ.22.75 లక్షల కోట్లను అధిగమించిందని, జీఎస్టీ వసూళ్లలో ఈ రంగం నుంచి దాదాపు 15% లభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఆటో పరిశ్రమ ఉపాధి కల్పిందని చెప్పారు. 2025–26లో 46 లక్షల విక్రయాలు.. 7.6% వృద్ధితో ప్యాసింజర్ వాహన విభాగం రికార్డు సృష్టించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25 లక్షల ఈవీలు (24.7% వృద్ధి) అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు. పెట్రోలు, డీజిల్ కార్లపై మరిన్ని నియంత్రణలు... దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత పెంచేందుకు వాహన రంగం చర్యలు తీసుకోవాలని ప్రధాని సలహాదారు తరుణ్ కపూర్ పరిశ్రమను కోరారు. దేశీయంగా బ్యాటరీ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను సంబంధిత మార్పులను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించిందని కూడా ఆయన పేర్కొన్నారు. మరోపక్క, రానున్న కాలంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు.. ముఖ్యంగా కార్ల విషయంలో ప్రభుత్వం మరిన్ని నియంత్రణలను అమలు చేసే అవకాశం ఉందని.. పరిశ్రమ దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. సీఎన్జీ వాహనాలపై దృష్టి సారించినట్లే... రానున్న కాలంలో ఈవీలపై ఫోకస్ మరింత పెంచాలని ఆటోమొబైల్ కంపెనీలకు సూచించారు. మరోపక్క, మరికొన్నేళ్లలో ఈవీలపై ప్రభుత్వం సబ్సిడీలను ఆపేయవచ్చని, పరిశ్రమ ఈ సవాలుకు రెడీగా ఉండాని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వీ పేర్కొన్నారు.2027 అక్టోబర్ నుంచి భారత్ ఎన్సీఏపీ 2.0: గడ్కరీ దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే చర్యల్లో భాగంగా వాహనాల్లో పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థను అంచనా వేసే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) 2.0ను వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే, రేర్ ఎమిషన్ కంట్రోల్ పరికరం వల్ల కాలుష్యం భారీగా తగ్గుతుందని, దీనిపై పరీక్షలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు. ఒక్కో డివైజ్‌కు రూ.4,000–5,000 ఖర్చవుతుందన్నారు. బీఎస్4 వాహనాల్లో దీన్ని అమర్చిన తర్వాత వెలువడే ఉద్గారాలు బీఎస్6 వాహనాల మాదిరిగానే ఉంటాయన్నారు. త్వరలో దీనికి సంబంధించి కొత్త స్కీమ్‌ను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. అందుబాటు ధర కీలకం: మారుతీ సీఈఓ నియంత్రణలు, అందుబాటు ధరల మధ్య సరైన సమతుల్యత కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టకేచి పేర్కొన్నారు. దీనివల్ల భారతీయ కొనుగోలుదారులకుసురక్షితమైన, పర్యావరణహిత రవాణా అందుబాటులో ఉంటుందన్నారు. దేశంలో పశువుల పేడ, బయోమాస్, వ్యవసాయ వ్యర్థాలు పుష్కలంగా లభ్యమవుతున్నందున, కంప్రె‹స్డ్ బయోగ్యాస్‌కు భారీ అవకాశాలున్నాయని, దీన్ని స్వచ్ఛమైన వాహన ఇంధనంగా మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నియంత్రణపరమైన వ్యయాలు పెరిగిపోవడంతో తొలిసారి కారు కొనుగోలు చేసేవారికి భారంగా మారింది. దీంతో గత కొన్నేళ్లుగా చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు పడిపోయాయి. లక్షలాది భారతీయ కుటుంబాలకు కారు కొనుగోలు ఇప్పటికీ పెద్ద కల. మరింత రక్షణతో పాటు సౌలభ్యం, సౌకర్యాన్ని కల్పిస్తుంది. అందుకే అందుబాటు ధర చాలా ముఖ్యం’ అని టకేచి పేర్కొన్నారు. ఇటీవలి జీఎస్టీ సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెల్లలోనే చిన్న కార్ల (18 శాతం లోపు జీఎస్టీ శ్లాబ్‌లో ఉన్నవి) అమ్మకాలు ఏకంగా 30 శాతం మేర ఎగబాకడాన్ని ఆయన ఉదహరించారు. మరీ ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ కార్లలో ఏకంగా 100 శాతం వృద్ధి నమోదైందని, అందుబాటు ధరకున్న మహిమకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. -
8.25% మందికే చదువుకు తగ్గ ఉద్యోగం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతకు, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు మధ్య తీవ్ర అంతరం ఉందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. డిగ్రీలు పూర్తి చేసినవారిలో తమ విద్యార్హతలకు అనుగుణమైన ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో కేవలం 8.25 శాతం మంది పట్టభద్రులకే వారి అర్హతలకు సరిపోయే ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొంది. ఉన్నత విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలు, పరిశ్రమ అవసరాలు, ప్రాక్టికల్ నైపుణ్యాల మధ్య అనుసంధానమే లేదని తేల్చిచెప్పింది. ఇంకా పాతకాలపు పాఠ్యాంశాలే ‘వికసిత్ భారత్–2047కు నైపుణ్యాభివృద్ధిలో సమూల మార్పులు’పేరిట నీతి ఆయోగ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. చదువు పూర్తిచేసిన తర్వాత యువత తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు పొందలేకపోవడానికి అనేక కారణాలున్నాయని వెల్లడించింది. అనేక ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పటికీ పాతకాలపు, సాధారణ పాఠ్యాంశాలే కొనసాగుతున్నాయని తెలిపింది. బీఏ, బీఎస్సీ, బీకాం వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో నేటి పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలకు తగిన అవకాశాలు పరిమితంగా ఉన్నాయని, ఫలితంగా డిగ్రీ ఉన్నప్పటికీ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం సమస్యగా మారుతోందని పేర్కొంది. విద్యార్థులకు తరగతి గది బోధనతోపాటు వాస్తవ పని వాతావరణంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. చాలాచోట్ల ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు నామమాత్రంగానే కొనసాగుతున్నాయని గుర్తుచేసింది. పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం, ప్రాజెక్టులు చేయడం, నైపుణ్యాన్ని నిరూపించుకునే ‘ప్రూఫ్ ఆఫ్ వర్క్’వంటి అంశాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని అభిప్రాయపడింది. ఈ కారణంగానే దేశంలో ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో కేవలం 8.25 శాతం మందికే వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయని నీతి ఆయోగ్ నివేదిక కుండబద్ధలు కొట్టింది. నైపుణ్యమే కొలమానం కావాలి అభ్యర్థులకు డిగ్రీ ఉన్నదా లేదా అన్నదానికంటే.. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యం ఉందా లేదా అన్నదానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. డిగ్రీ తప్పనిసరి కాని ఉద్యోగాల్లో నైపుణ్య ఆధారిత నియామకాలను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ఉన్నత విద్యా కార్యక్రమాలకు నిధులు కేటాయించే విధానంలోనూ మార్పులు అవసరమని సూచించింది. కేవలం విద్యార్థుల సంఖ్య లేదా కోర్సుల సంఖ్య ఆధారంగా కాకుండా.. ఉద్యోగ నియామకాలు, వేతనాల పెరుగుదల, నైపుణ్యాల అభివృద్ధి ఫలితాల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని వెల్లడించింది. పరిశ్రమలతో అనుసంధానం బలహీనం విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం మరింత బలపడాల్సి ఉందని సూచించింది. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాలను రూపొందించడం, పరిశ్రమల్లో అనుభవం ఉన్న నిపుణులను బోధనలో భాగస్వాములను చేయడం, ఆధునిక ల్యాబ్‌లు నెలకొల్పడం వంటి చర్యలు పరిమితంగానే ఉన్నాయని తెలిపింది. దీనివల్ల విద్యార్థులు ఉద్యోగంలో అడుగుపెట్టే సమయానికి వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల కంటే.. కేవలం డిగ్రీ ఉండటం వల్ల పోటీ పరీక్షలు, ఇతర నియామకాలకు అర్హత సాధించవచ్చన్న భావన యువతలో ఉందని, ఫలితంగా ఉద్యోగ అవకాశాలున్న ప్రత్యేక కోర్సుల కంటే సాధారణ డిగ్రీలకు వారే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియజేసింది. దీనికి తోడు పట్టభద్రుల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉందని, దేశంలో మొత్తం గ్రాడ్యుయేట్లలో 13 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని నీతి ఆయోగ్ స్పష్టంచేసింది. గ్రాడ్యుయేట్ మహిళల్లో నిరుద్యోగం 20.4 శాతంగా ఉందని వెల్లడించింది. అప్రెంటీస్‌షిప్ విస్తరణ.. పరిశ్రమ ఆధారిత డిగ్రీలు ఇప్పుడున్న పరిస్థితిని మార్చేందుకు ‘అప్రెంటిస్‌షిప్ ఫర్ ఆల్’విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలన్న ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయని నివేదిక పేర్కొంది. రాష్ట్రస్థాయిలో ఏకీకృత అప్రెంటీస్‌షిప్ వేదికలను ఏర్పాటు చేయడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పరిశ్రమల భవిష్యత్ ఉద్యోగ అవసరాలను ముందుగానే గుర్తించి విద్యార్థులను వాటితో అనుసంధానం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. ఉన్నత విద్యలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచి వర్క్ ఇంటిగ్రేటెడ్, అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను విస్తరించాలని ప్రతిపాదించింది. సంప్రదాయ కోర్సులతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, ఉదాహరణకు బీఏ రిటైల్, బీకాం అనలిటిక్స్ వంటి కోర్సుల ద్వారా విద్యార్థులకు డిగ్రీతోపాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు అందించవచ్చని తేల్చిచెప్పింది. -
వికసిత్ భారత్ సాధ్యమేనా!
మన చదువులు వర్తమాన అవసరాలకు తగినట్టు ఉండటం లేదని చాన్నాళ్లుగా నిపుణులు ఘోషిస్తున్నారు. చివరకు చదువయ్యాక అందించే నైపుణ్యాలు కూడా ఎందుకూ కొరగావటంలేదని తాజాగా నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం ఆందోళన కలిగించే అంశం. దాని ప్రకారం ఉన్నత విద్యావంతుల్లో కేవలం 8.25 శాతం మందికి మాత్రమే విద్యార్హతకు తగిన ఉద్యోగం లభిస్తోంది. 2014–15 నుంచి ఇంతవరకూ రూ. 34,000 కోట్లు వెచ్చించి 7.67 కోట్లమందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చినా ఫలితం అంతంతమాత్రమేనని నివేదిక చెబుతోంది. 15–29 యేళ్ల మధ్యవయస్కులైన 8.7 కోట్లమందైతే చదువు, పని, శిక్షణల్లో అన్నింటికీ దూరంగా ఉండిపోయారంటున్నది.వీరు నిరుపేద వర్గాలవారు. మొన్న మార్చిలో విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్ఎఫ్) సర్వే ప్రకారం యువతలో వీరు 25 శాతం. నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడటం మొదలై రెండు దశాబ్దాలు దాటుతున్నా, ఆ కోర్సులపై తమకు స్పష్టత లేదని 40 శాతంపైగా యువత చెప్పారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఇంత సమాచార లోపం ఉన్నప్పుడు ఎన్ని పథకాలు పెట్టి ఏం ప్రయోజనం?ప్రపంచ దేశాల్లో యువజనం అధికంగా గల దేశాల్లో భారత్ ఒకటి. మన జనాభాలో 65 శాతంమంది 35 యేళ్ల లోపువారు. సక్రమంగా వినియోగించుకోగలిగితే వీరు దేశానికి అపురూపమైన సంపద. ప్రపంచంలో చాలా దేశాలు వృద్ధ జనాభా ఎక్కువై దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కానీ మనకు దండిగా యువత ఉన్నా వారికి ఉపాధి కల్పనలో విఫల మవుతున్నాం. ఏటా సమర్పించే వార్షిక బడ్జెట్లో గణాంకాలు ఘనంగా కనబడతాయి. కేటాయింపులు కళ్లు చెదిరేలా ఉంటాయి. కానీ ఫలితాలు చూస్తే ఇలా బావురుమంటాయి. ఉండాల్సినంత లేకున్నా ఉన్నత విద్యాసంస్థల విస్తరణ గతంతో పోలిస్తే పెరిగింది. ఈ సంస్థలు యేటా లక్షలాదిమంది పట్టభద్రుల్ని తయారుచేస్తున్నాయి. కానీ అభ్యసన ఫలితాలు గమనిస్తే అవి అంతంతమాత్రమనీ, ఉపాధి సామర్థ్య లోపాలు అపారమనీ నీతి ఆయోగ్ నివేదిక ఒకటి లోగడే చెప్పింది. చదువులో సమాన అవకాశాలు లేకపోవడం ఒక సమస్య అయితే... ఉత్పాదక ఉద్యోగాల కొరత ఏర్పడటం మరో సమస్య. ఈ సమస్యలపై లోతైన అధ్యయనం చేసి, సకాలంలో తగిన పరిష్కారాలు వెదకనట్టయితే అపురూప సంపదగా ఉండాల్సిన మన యువశక్తి కాస్తా ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లకు మూలకారణమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇన్ని లక్షలమంది ఉన్నత విద్యకెదిగారని అనుకోవటంవల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. వారికుండాల్సిన మౌలిక అభ్యసనాలు, నైపుణ్యాలు, ఉత్పాదకతకు తోడ్పడే ఉపాధి, నిరంతర నైపుణ్యాభివృద్ధి ఉంటేనే మానవ వనరుల్ని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నట్టు లెక్క. మన నిరుద్యోగిత 2017–18లో 18 శాతం ఉంటే 2022–23 నాటికి అది 10 శాతానికి తగ్గిందని, నిలకడగా అక్కడే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా 15–29 యేళ్ల మధ్యవయస్కులు. కానీ పట్టభద్రులు, అంతకు మించి చదివిన 25 యేళ్ల లోపువారిలో నిరుద్యోగిత 1983 నాటికి 35 శాతమైతే, 2023 కల్లా అది 39 శాతమైంది. అసలు నిరుద్యోగిత రేటు లెక్కగట్టే తీరే లోపభూయిష్టమైనది. ఉపాధి కోరుతున్నవారిలో లభించనివారి శాతమెంతో అది వెల్లడిస్తుంది. అధికారిక సర్వేల్లో నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకుంటారనుకోవటానికి లేదు. ఇక మహిళల్ని సర్వేలు సరిగా పరిగణనలోకి తీసుకోవటంలో విఫలమవుతున్నాయని తరచు ఆరోపణలొస్తుంటాయి. వారిని కూడా లెక్కేస్తే ఈ నిరుద్యోగ పటాలం అనూహ్యంగా ఉంటుంది. ఏ ఉద్యమాలు గాల్లోంచి పుట్టుకురావు. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన జెన్ జీ ఉద్యమం కేవలం నీట్ ప్రశ్నపత్రాల లీకువల్లే వచ్చిందనుకోవటానికి వీల్లేదు. అది తక్షణ ప్రేరణ అయితే కావొచ్చుగానీ... చదువుకు తగిన ఉపాధి లభించకపోవటం, అసలు చదువులే ప్రామాణికంగా లేకపోవటం మన యువతను నిరాశానిస్పృహల్లో ముంచెత్తు తున్నది. వర్తమాన అవసరాలకు తగిన పాఠ్యాంశాలుండటం, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అలవర్చటం అవసరం. అలాగే డబ్బుకొద్దీ ప్రామాణిక విద్య అనే ధోరణి మారాలి. నీతి ఆయోగ్ నివేదికైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. విధానాలు సరిచేసుకోవాలి. -
55 ట్రిలియన్ డాలర్ల దిశగా భారత్!
న్యూఢిల్లీ: అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), వృద్ధిలోకి వస్తున్న కీలక రంగాల అధిపత్యం, వివిధ రంగాలలో రాణిస్తున్న యువత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ 2047కల్లా 55 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నట్లు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి.సుబ్రమణ్యన్ తాజాగా అంచనా వేశారు. 8 శాతం వాస్తవిక(రియల్) జీడీపీ వృద్ధి కొనసాగనున్నట్లు ‘ఇండియా 2047 లీడర్స్ టాక్’ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో అభిప్రాయపడ్డారు. ఇందుకు దేశ కీలక ఆర్థిక మూలాల రంగాలలో వ్యూహాత్మక పెట్టుబడుల వినియోగం వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.2047కల్లా 55 ట్రిలియన్ డాలర్ల వికసిత్ భారత్‌ను నిర్మించడం వాస్తవికంగా సాధించదగినదేనని అభిప్రాయపడ్డారు. వార్షికంగా పురోగతి పథంలో ఉన్న ఎకానమీ, బాధ్యతాయుత సంపద సృష్టి, వివిధ రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చే నిర్మాణాత్మక విధానాలతో ఇది సాధ్యపడుతుందని వివరించారు.పటిష్ట, దీర్ఘకాలిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంతోపాటు గ్లోబల్ వేల్యూ చైన్‌తో సమీకృతమయ్యేలా ప్రపంచస్థాయి ఎల్రక్టానిక్స్ అభివృద్ధి, పారిశ్రామిక తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేశారు. అత్యున్నత నైపుణ్యతకలిగిన యువతను ప్రోత్సహించడం, ఏఐలో సామర్థ్యాలు వీటికి జత కలవనున్నట్లు వివరించారు. 2026 ఏప్రిల్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 2025–26లో దేశ నామినల్ జీడీపీ 3.92 లక్షల కోట్ల డాలర్లుగా పేర్కొనడంతోపాటు.. ప్రపంచంలోనే ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినట్లు ప్రస్తావించారు. -
వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్‌పై ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంపై బ్యాంకింగ్ రంగానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో, ప్రతిపాదిత కమిటీ పరిశీలించతగిన అంశాల గురించి సమాలోచనలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు అత్యంత కనిష్ట స్థాయికి దిగివచ్చాయని, సంస్కరణలను చేపట్టేందుకు ఇదే సరైన తరుణం కాగలదని ఆమె చెప్పారు. ఆర్థిక స్థిరత్వం, సమ్మిళితత్వం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ భారతదేశపు తదుపరి దశ వృద్ధికి ఊతమిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని సమగ్రంగా సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. 'సప్తధార' సూత్రం!
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎర్రకోట నుంచి జాతి ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి ఏడు ప్రధాన శక్తులు అవసరమని పేర్కొన్నారు. వీటినే 'సప్తధార'గా అభివర్ణించారు.ఉత్పాదక శక్తి (Manufacturing power)మోదీ 'సప్తధార'లో మొదటి స్థానాన్ని తయారీ రంగానికి ఇచ్చారు. చిన్న వస్తువుల నుంచి భారీ పరిశ్రమల వరకు సాధ్యమైనంత ఎక్కువగా భారత్‌లోనే తయారు చేయాలి అనేది ప్రధాని ఆలోచన. కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా.. డిజైన్, తయారీ, నాణ్యత, సరఫరా వంటి మొత్తం విలువ గొలుసును దేశంలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు ధరతో పాటు నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture and food production)రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రధాని ప్రస్తావించారు. మన రైతులు కేవలం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార పదార్థాలు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే.. పొలంలో పంట పండించడం దగ్గరే ప్రక్రియ ఆగిపోకూడదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలి చెప్పారు.టెక్నాలజీ, ఆవిష్కరణ (Technology and innovation)మూడో శక్తిగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను ప్రధాని ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా దేశం నాయకత్వం వహించాలని చెప్పారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా 6జీను ప్రపంచానికి అందించే స్థాయికి భారత్ ఎదగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.గతి శక్తి (Gati Shakti)నాలుగో శక్తిగా గతిశక్తిని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రవాణా, కనెక్టివిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించడంతో పాటు.. దేశంలోని నగరాలు, పరిశ్రమలు, పోర్టులు పరస్పరం మెరుగ్గా అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు. పోర్టులను కేవలం సరుకులు ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాలుగా కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.రక్షణ శక్తి (Raksha Shakti)ఐదో శక్తిగా రక్షణ రంగం గురించి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ మరింత ఆత్మనిర్భర్‌గా మారాలని ప్రధాని చెప్పారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్ కేవలం ప్రపంచ దేశాలకు మార్కెట్‌గా ఉండకుండా.. అత్యాధునిక రక్షణ సాంకేతికతను తయారు చేసి ఇతర దేశాలకు అందించే స్థాయికి ఎదగాలన్నది లక్ష్యం.గ్రీన్, బ్లూ ఎకానమీ (Green economy and blue economy)ఆరవ శక్తిగా గ్రీన్, బ్లూ ఎకానమీలను ప్రధాని ప్రస్తావించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ వంటి రంగాల్లో భారత్ భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.అదే సమయంలో.. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని కూడా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. మత్స్య పరిశ్రమ, సముద్ర సాంకేతికత, తీర ప్రాంత పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీకి మరింత ఊతమివ్వాలని అన్నారు.యువశక్తి, సాఫ్ట్ పవర్ (India’s soft power)'సప్తధార'లో చివరి శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్‌ను ప్రధాని వివరించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, హస్తకళలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు సినిమాలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక సృజనాత్మక రంగాల్లో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు.అంతే కాకుండా.. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రకృతి అందాలు, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం ద్వారా దేశ సాఫ్ట్ పవర్‌ను పెంచుకోవాలని సూచించారు.'సప్తధార'లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడు రంగాలను వేర్వేరుగా చూడకూడదని ప్రధాని స్పష్టం చేయడం. ఉదాహరణకు తయారీ రంగానికి టెక్నాలజీ అవసరం. వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం. ఎగుమతులకు మెరుగైన లాజిస్టిక్స్ అవసరం. రక్షణ రంగానికి ఆవిష్కరణలు అవసరం. గ్రీన్ ఎకానమీకి యువత, టెక్నాలజీ అవసరం. అంటే.. ఒక రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావం మరో రంగంపైనా పడుతుంది. ఈ రంగాలన్నింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే 'సప్తధార' ఆలోచనలోని అసలు ఉద్దేశం.వికసిత్ భారత్ లక్ష్యానికి.. సప్తధార!మన దేశం స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఒకటి రెండు రంగాలు అభివృద్ధి చెందితే సరిపోదు. తయారీ నుంచి వ్యవసాయం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ వరకు, గ్రీన్ ఎకానమీ నుంచి యువశక్తి వరకు అన్ని రంగాలు కలిసి ముందుకు సాగాలి.ఇదీ చదవండి: 80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం! -
వికసిత్ భారత్ సాధ్యం కాదా? భారత అభివృద్ధిపై బిగ్ రివీల్
‘‘వికసిత్ భారత్ 2047’’ లక్ష్యాన్ని పెట్టుకుంది ఇండియా. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఊహిస్తున్న లేదా ఇప్పటివరకు నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు సరిపోదని ఆర్థికవేత్త, రచయిత, కాలమిస్టు సుర్జిత్ భల్లా చెప్పారు. అంటే, మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న వేగంతో ఎదిగితే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని, ఇంకా ఎక్కువ వృద్ధి అవసరమని అన్నారు. సుర్జిత్ భల్లా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైమ్ సభ్యుడిగా పనిచేశారు. అలాగే, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు కార్యనిర్వాహక డైరెక్టర్‌గా సేవలు అందించారు.తాజాగా, సుర్జిత్ భల్లా ఓ ఇంటర్వ్యూలో.. భారత ఆర్థిక వ్యవస్థ, రూపాయి, చైనా, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, స్థూల దేశీయోత్పత్తి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి భారత్ చేపట్టాల్సిన సంస్కరణలపై మాట్లాడారు. ‘‘భారత్‌లో 1991 నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి గత 30 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 6% వృద్ధి సాధించింది. కానీ తలసరి వృద్ధి (ఒక్కో వ్యక్తికి సగటు ఆదాయం పెరిగిన వేగం) మాత్రం దాదాపు 4.8% మాత్రమే. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం 6% పెరిగినా, జనాభా కూడా పెరగడం వల్ల ఒక్కో వ్యక్తికి చేరే ఆదాయం అంత వేగంగా పెరగలేదు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరాలంటే దేశ జీడీపీ వృద్ధి మాత్రమే కాదు, ఒక్కో వ్యక్తి ఆదాయం పెరిగే వేగం కూడా చాలా ఎక్కువగా ఉండాలి’’ అని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అంటే అధిక ఆదాయ దేశం లేదా ధనిక దేశంగా మారడం. దీనికి ప్రపంచ బ్యాంకు అధికారిక నిర్వచనం ఇచ్చింది. అంటే 2025 నుంచి 2047 వరకూ డాలర్ విలువలో తలసరి వృద్ధి 9% కంటే ఎక్కువ ఉండాలి.చైనా ఇలా ఎదిగింది.. ‘‘దీనిపై నేను ఒక పరిశోధనా పత్రం కూడా రాశాను. ప్రపంచంలో జరిగిన పరిణామాలను పోల్చాను. 2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. 2011 నుంచి లేదా ఆ సంక్షోభం తర్వాత ప్రపంచ తలసరి వృద్ధి అన్ని దేశాల్లో గణనీయంగా తగ్గింది. అందుకే ఇప్పుడు లక్ష్యాన్ని చేరడం, 2011కు ముందు కంటే చాలా కష్టమైంది. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతుంటాను. మనది ప్రపంచంతో అనుసంధానమైన దేశం. అందువల్ల ప్రపంచంలో జరిగే పరిణామాల ప్రభావం మనపై ఉంటుంది.ప్రతి దేశంపైనా అదే ప్రభావం ఉంటుంది. అందుకే ప్రపంచ పరిస్థితులను చూడాలి. మనం బాగా ఎదిగాం. చైనా అసాధారణంగా ఎదిగింది. మిగతా దేశాలు ఎదగని సమయంలో అది అలా చేసింది. మారకపు విలువ విధానం, ఇతర వ్యవస్థల ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మలిచింది. ఆ విజయానికి వారికి అభినందనలు. కానీ, ఇప్పుడు పారదర్శకత తప్ప మరో మార్గం లేదు. అందుకే వికసిత్ భారత్ లక్ష్యాన్ని తీసుకుంటే, గత 30 ఏళ్లుగా మన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 6% ఉంది. ఇది గొప్ప విజయమే. కానీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరాలంటే ఇంకా మెరుగైన వృద్ధి అవసరం. 6% లేదా 6% కంటే కొద్దిగా ఎక్కువ సరిపోదు. 9% కంటే ఎక్కువ వృద్ధి ఉంటేనే ఆ లక్ష్యాన్ని చేరగలం’’ అని సుర్జిత్ భల్లా వివరించారు. -
‘వికసిత్ భారత్’లో భాగస్వాములు కావాలి
భారతదేశాన్ని ‘వికసిత్ భారత్ 2047’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చే ప్రయాణంలో భాగస్వాములు కావాల్సిందిగా ఫ్రాన్స్ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా పరస్పర ఆర్థిక పురోగతిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. పారిస్‌లో జరిగిన ‘భారత్–ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్’ సమావేశంలో ఆమె ప్రసంగించారు.లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్లు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), క్లినికల్ రీసెర్చ్, ప్రిసిషన్ మెడిసిన్, డిజిటల్ హెల్త్ రంగాలలో ఇరు దేశాలకు విభిన్న నైపుణ్యాలు ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ‘హెల్త్‌కేర్ విలువ ఆధారిత సప్లై చైన్’ను బలోపేతం చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని ఆమె కోరారు. శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తోందన్నారు. భారత్‌లో అమలవుతున్న ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’, ‘పీఎల్ఐ’ (ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక) పథకాలు పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్ రంగాలలో భారీ పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు.గిఫ్ట్ సిటీ వృద్ధిఅంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్‌గా వేగంగా ఎదుగుతోందని మంత్రి తెలిపారు. జూన్ 2026 నాటికి ఇందులో 1,200 కంటే అధిక సంస్థలు రిజిస్టర్ అయ్యాయని, 111 బిలియన్ డాలర్ల బ్యాంకింగ్ ఆస్తులతో పాటు, ఇప్పటివరకు మొత్తం 176 బిలియన్ డాలర్ల బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయని వివరించారు. బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్మెంట్, లీజింగ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), రీఇన్సూరెన్స్ వంటి విభాగాలలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికతగత పదేళ్లలో భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యిందని ఆర్థిక మంత్రి తెలిపారు. సప్లై చైన్ వైవిధ్యీకరణ, సాంకేతిక పరిణామాలు కొత్త పెట్టుబడి అవకాశాలను ఇస్తున్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీస్ రంగాలలో ఇరు దేశాలు నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. భారత్‌లోని డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన పరివర్తన రంగాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో అనువైనవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.డిజిటల్ ఎకానమీ జోరుభారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిధిలో ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఒఎన్‌డీసీ వంటి విప్లవాత్మక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో దాదాపు సగం వాటా భారత్‌దేనని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1,000 ఫ్రాన్స్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. కాగా, గత దశాబ్ద కాలంగా భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చర్యలను ఈ సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ అగ్రశ్రేణి ఆర్థిక సంస్థల ప్రతినిధులు అభినందించారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
పీఎం–వీబీఆర్‌వై కింద 70 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం–వీబీఆర్‌వై) కింద దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం 15 లక్షల మంది ఉద్యోగులు, యాజమాన్యాలకు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను బదిలీ చేశారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగాల కల్పన అనేక రెట్లు పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. పీఎం–వీబీఆర్‌వై పథకం కింద లబి్ధదారులకు సామాజిక భద్రత లభించిందని అన్నారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలను లేదా యజమానులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం తొలిసారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తుందని వెల్లడించారు. దేశమంతటా ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తున్నామని, యువతకు సాధికారత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం మరింత బలమైన శ్రామిక శక్తిని నిర్మిస్తున్నామని ఉద్ఘాటించారు. మన యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలే ‘వికసిత్ భారత్’కు బాటలు వేస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణలను ముందుకు నడిపించడంలో భారత యువతదే కీలక పాత్ర అని అన్నారు. 21వ శతాబ్దంలో నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పే దేశాలకే అవకాశాలు దక్కుతాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఈ మూడు రంగాల్లో భారతదేశానికి తిరుగులేదన్నారు. పీఎం–వీబీఆర్‌వై పథకానికి ప్రభుత్వం రూ.99,446 కోట్లు కేటాయించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద తొలిసారిగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు రూ.15,000 వరకు అందిస్తారు. ప్రతి కొత్త ఉద్యోగికి గాను యాజమాన్యానికి నెలకు రూ.3,000 వరకు అందజేస్తారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేలా యాజమాన్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. -
వికసిత్ భారత్‌కు బ్యాంకింగ్ దన్ను
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాకారంలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. మూలధన సమీకరణ, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బ్యాంకింగ్ ప్రధానంగా ఉంటోందన్నారు. వార్షిక నివేదికలో షేర్హోల్డర్లకు ఇచ్చిన సందేశంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘దేశంలోనే అతి పెద్ద బ్యాంకు కావడం వల్ల మాకు అవకాశాలూ, బాధ్యత.. రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తెరిగి, భారత్ వృద్ధి ఆకాంక్షలు సాకారం కావడానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు. డిజిటల్ మాధ్యమం, కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చేలా ‘డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్’ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవలను బలోపేతం చేసేలా టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ, సైబర్‌సెక్యూరిటీ, డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను కొనసాగిస్తామని శెట్టి చెప్పారు.కొత్త ఆవిష్కరణలపై ఫోకస్.. కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ, మరింత నాణ్యమైన సేవలు అందించేలా వివిధ ప్రక్రియలను సరళతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు శెట్టి తెలిపారు. ఇందుకు ప్రాజెక్ట్ సరళ్ కింద ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ)ని మరింత వినియోగించుకోనున్నట్లు వివరించారు. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపదని హామీ ఇచ్చారు. తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుందనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. హెచ్ఐసీసీ వేదికగా రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణను దేశ ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించిన ఆయన ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు అని పేర్కొన్నారు. అంతకు ముందు నిధుల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఛలోక్తులు విసిరారు.‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?‘ అంటూ తెలంగాణకు కేంద్రం ఇస్తున్న భరోసాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను మోదీ గుర్తు చేశారు. ‘పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్‌తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఐక్యంగా ముందుకు తీసుకెళ్తోంది.తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది’అని మోదీ అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ముఖ్యమంత్రికి సూచించారు. మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం నుంచి సహకారం లభించింది. ఇప్పుడు అదే భావనతో తెలంగాణకు కూడా సహకరిస్తున్నాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదు’అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్‌ను వికసిత్ భారత్‌లో భాగం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండా ‘ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ భేదభావం చూపలేదు. గత పదేళ్లలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనం’అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలు ముగిశాయని.. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల అభ్యున్నతిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో భుజం భుజం కలిపి నడిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని ప్రశంసించారు.వరంగల్‌లో ఏర్పాటవుతున్న పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) తెలంగాణ పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లకు చేరతాయి’అని చెప్పారు. దీంతో తెలంగాణ టెక్స్టైల్ రంగంలో ప్రధాన హబ్‌గా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పాత్ర అత్యంత కీలకం హైదరాబాద్–పనాజీ కారిడార్, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి వంటి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రధాని.. ‘ఇవి కేవలం రోడ్లు కాదు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే ఇంజిన్లు’అని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పెట్టుబడులు పెరుగుతాయని.. తద్వారా యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని మోదీ అన్నారు.మాటకు మాట... సీఎం రేవంత్‌రెడ్డి: మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా..’ప్రధాని మోదీ: పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్‌తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లు కూడా దాటేది కాదు, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. మీరు కంటున్న కలలు చేరుకోవాలంటే మాతో కలసి రండి.. లేకపోతే ఎప్పటికీ అది సాధ్యం కాదు. -
జోరు మీదున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 1 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి ఇది 4 శాతానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. చరిత్రాత్మక మార్పు మలుపు దశలో భారత్ ఉన్నట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ వ్యవస్థలు సామాజిక, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని తెలిపింది.ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. రాష్ట్రాల నాయకత్వంలో సాగే వినూత్న కార్యక్రమాల ద్వారానే డీపీఐ 2.0 విజయవంతమవుతుందంటూ.. దీనికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మార్గదర్శకులుగా వ్యవహరిస్తాయని పేర్కొంది. రంగాల వారీ మార్పులు తీసుకురావడానికి రెండేళ్ల కార్యాచరణను అనుసరించాలని సూచించింది. తొలి ఏడాది ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టి, వాటి ఫలితాలను విశ్లేషించాలని పేర్కొంది. మొదటి ఏడాది సాధించిన విజయాలను రెండో ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. ఉపాధి కల్పన కీలకం.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించే అభివృద్ధి మార్గాలు అవసరమని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలంలో సేవలను ప్రజలకు చేరవేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో డిజిటల్ వ్యవస్థలు అద్భుతమైన పనితీరు చూపించాయి. రాబోయే దశలో డిజిటల్ అనుసంధానానికే పరిమితం కాకుండా, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, సామర్థ్యాలను పెంచడంతోపాటు.. రంగాలు, ప్రాంతాల వారీ కొత్త చోదక కేంద్రాలను సృష్టించడంపై దృష్టి సారించాలి’’అని సూచించారు. -
మహిళా రిజర్వేషన్లతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేస్తే భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమై, చైతన్యవంతంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 2029లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు కోటా అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మహిళలకు మంగళవారం లేఖ రాశారు. లేఖను ‘ఎక్స్’లో పోస్టుచేశారు. విధానాల రూపకల్పన, కీలక నిర్ణయాల్లో మహిళామణులు క్రియాశీలక పాత్ర పోషిస్తే ‘వికసిత్ భారత్’దిశగా మన ప్రయాణం మరింత బలం పుంజుకుంటుందని వెల్లడించారు.అందువల్ల మన అభివృద్ధి పథానికి మరింత ఊపునిచ్చేందుకు చేయగలిగినదంతా చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. 2023లో ’నారీశక్తి వందన్ అధినియం’ఆమోదానికి దారితీసిన పరిణామం ఇదేనని వివరించారు. వచ్చే ఎన్నికల్లో చట్టం అమలుకు వీలుగా రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్లు తెలిపారు. మహిళల ఇప్పటికే బహుళ రంగాల్లో రాణిస్తున్నారని, చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి తేలి్చచెప్పారు. బిల్లు ఆమోదం కోసం మహిళల ఎదురు చూపులు ‘నారీశక్తి వందన్ అధినియం’సవరణను ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా ఆమోదించాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా మహిళలకు అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం కోసం దేశంలోని మహిళలంతా ఎదురు చూస్తున్నారని తాను కచ్చితంగా నమ్ముతున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పెంచడం చాలా ముఖ్యమని, అందుకోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కుల కోసం ఆడబిడ్డలను ఇంకా వేచి ఉండేలా చేయలేమని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలో మహిళల గళం బలపడినప్పుడు ప్రజాస్వామ్య గళం కూడా బలపడుతుందన్నారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం కోట్లాది మంది మహిళల ఆశీస్సులు కోరుకుంటున్నామని మోదీ స్పష్టంచేశారు. స్థానిక ఎంపీలకు లేఖలు రాసి, చరిత్రాత్మక ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనేలా ప్రోత్సహించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు.శతాబ్దాల పాటు పెపుప్రభావం చూపే గొప్ప పని చేయబోతున్నారంటూ ఎంపీలకు గుర్తు చేయాలని కోరారు. ఇది కచ్చితంగా వారిలో స్ఫూర్తిని నింపుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఆశించిన ఫలితం ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం నారీశక్తి వందన్ అధినియం పట్ల మహిళల్లో అపారమైన ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. -
అమల్లోకి కొత్త ఐటీ చట్టం
ఆదాయపన్ను చట్టం, 2025 బుధవారం నుంచి అమల్లోకి వచి్చంది. దేశ పన్ను చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని.. వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలం నాటి ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో మరింత సరళతర చట్టంగా కేంద్రం దీన్ని రూపొందించడం తెలిసిందే. మరింత స్పష్టత, నిబంధనల అమలు సులభతరం, సరళమైన భాష, చదివే వారు అర్థం చేసుకునేందుకు అనుకూలత ఇందులోని ప్రత్యేకతలుగా సీబీడీటీ పేర్కొంది.కొత్త చట్టానికి మారే క్రమంలో పాత, కొత్త పన్ను చట్టాల పరిధిలో నిబంధనల అమలుకు ఇ–ఫైలింగ్ పోర్టల్ వీలు కలి్పంచనుందని సీబీడీటీ తెలిపింది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయని, అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
భారత్‌లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్, ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్‌లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.ప్రకటనలోని అంశాలు..భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్‌ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.వికసిత్ భారత్ దిశగా అడుగులుప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.ఉపాధి, ఆర్థిక వృద్ధిఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్‌లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
విలేజ్.. విన్నర్
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలాంటి గ్రామీణ భారతావనిపై మరింత దృష్టి సారించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం కీలక ఫ్లాగ్షిప్ పథకాలకు తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించింది. గత ఉపాధి హామీ పథకం స్థానంలో మరింత పటిష్టమైన వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రాష్ట్రాలను భాగస్వామ్యం చేసే ఈ కొత్త పథకానికి మునుపెన్నడూ లేని రీతిలో కేటాయింపులు చేయడం విశేషం. మొత్తంమీద గ్రామీణాభివృద్ధికి 2026–27 బడ్జెట్లో రూ.1,94,369 కోట్లు దక్కాయి. పాత ఉపాధి హామీ పథకానికి రూ.30,000 కోట్లు, వ్యవసాయ మౌలికసదుపాయాలు, అభివృద్ధి ఫండ్‌కు రూ.4,400 కోట్లను కలుపుకుంటే 21 శాతం మేర నిధులు ఎగబాకినట్లు లెక్క!గ్రామీణ ప్రజలకు పక్కాగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచి్చంది. దీనికి వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ).. సంక్షిప్తంగా వీబీ–జీ రామ్ జీ అని పేరు పెట్టారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఇకపై ఏటా 125 రోజుల పాటు (పాత చట్టంలో 100 రోజులు) ఉపాధి హామీ దక్కుతుంది. కీలక వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను నివారించేందుకు 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. దీని కింద ప్రధానంగా జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధిని కల్పించే పనులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులను చేపడతారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, మెరుగైన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ గవర్నెన్స్ పెంపొందించడం, పల్లెవాసుల్లో ఆర్థిక సాధికారతను పెంచడం కొత్త చట్టం ప్రధానోద్దేశమని మోదీ ప్రభుత్వం చెబుతోంది. పాత ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు 100 శాతం, మెటీరియల్ ఖర్చులో 75 శాతం కేంద్రమే భరించేది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న జీ–రామ్–జీ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు ఉపాధి వ్యయాన్ని 60:40 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది. తాజా బడ్జెట్ కేటాయింపులకు రాష్ట్రాల వాటా తోడైతే జీ–రామ్–జీ కోసం ఏకంగా రూ.1.51 లక్షల కోట్లు దక్కుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ‘చరిత్రాత్మకం, అపూర్వమైనది’గా ఆయన అభివర్ణించారు. కాగా, ముగిసిపోతున్న పాత పథకం కింద చేపట్టిన పనుల కోసం అదనంగా ఈ బడ్జెట్లో మరో రూ.30,000 కోట్లను కేటాయించడం ద్వారా ఉపాధి కల్పనకు గట్టిగానే నిధుల హామీ లభించింది.‘వికసిత్ భారత్ జీ–రామ్–జీ’తో ఉపాధికి మరింత గ్యారంటీ... 2026–27 కేటాయింపులు:రూ.95,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.86,000 కోట్లు (సవరించిన అంచనా రూ.88,000 కోట్లు)జోరుగా ఇళ్ల నిర్మాణం (పీఎంఏవై)గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లోనూ కేంద్రం నిధులను భారీగా కేటాయించింది. పీఎంఏవై 2.0 స్కీమ్ కింద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.18,625 కోట్లు దక్కాయి. గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబి్ధదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 2026–27లో రూ.3,000 కోట్లు జమ చేయనున్నారు. కాగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు 2026–27లో 6.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 30.75 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,917 కోట్ల నిధులు అందనున్నాయి. గ్రామాల్లో 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026–27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలనేది బడ్జెట్ అంచనా.2026–27 కేటాయింపులు: రూ.73,542 కోట్లు2025–26 కేటాయింపులు:రూ.74,626 కోట్లు(సవరించిన అంచనా రూ.40,000 కోట్లు)మ్యాచ్ సమ్మరీఈ బడ్జెట్ మ్యాచ్‌లో గ్రామీణ భారతం క్రీజ్‌లో నిలబడి గెలిచింది. ఉపాధి, ఇళ్లు, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీతో పల్లెల ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఫ్లాగ్షిప్ పథకాలకు దండిగా నిధులు రావడంతో గ్రామీణ అభివృద్ధి స్ట్రైట్ బ్యాట్‌తో ఆడిన క్లియర్ విన్నర్‌గా మారింది. ఉపాధి హామీకి కొత్త రూపు, ఇళ్ల నిర్మాణానికి వేగం, గ్రామ రహదారులకు దిశ, ఇంటింటికీ నీరు, నెట్‌కి హైస్పీడ్‌తో గ్రామాలు ఈ బడ్జెట్లో చేతులెత్తి విజయాన్ని ప్రకటించాయి. ఇది వికసిత్ భారత్ లక్ష్యం దిశగా గ్రామీణ భారతం సమయం చూసుకుని కొట్టిన మ్యాచ్– విన్నింగ్ షాట్.రహదారులు.. రయ్ రయ్ (పీఎంజీఎస్‌వై) 2026–27 కేటాయింపులు:రూ.19,000 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.19,000 కోట్లు(సవరించిన అంచనా రూ.11,000 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణం, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అమలవుతున్న ఫ్లాగ్ షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన – పీఎంజీఎస్‌వై) ఇది. తాజా బడ్జెట్లోనూ మోదీ సర్కారు ఈ పథకంపై మరింత ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ స్కీమ్ నాలుగో దశ అమలవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 26,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్ల నిర్మాణం లక్ష్యం. పర్యావరణ అనుకూల సాంకేతికతతో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 4,200 గ్రామీణ ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానించాలని కేంద్రం సంకల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్ నాటికి 7,87,809 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు అంచనా.స్వచ్ఛ భారత్.. రెండో దశ 2014లో ఆరంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) స్టేటస్ సాకారమైంది. దీన్ని కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ కోసం ఇప్పుడు రెండో దశ అమలవుతోంది. 2026–27లో 48,096 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణ పరిధిలోకి తీసుకురానున్నారు. 36,119 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. 1,352 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. 1,50,000 గ్రామాల్లో సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2026–27లో 50,000 వ్యక్తిగత టాయిలెట్లు, 5,000 కమ్యూనిటీ టాయిలెట్లు, 10,000 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నారు. 2026–27 కేటాయింపులు:రూ.9,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.12,192 కోట్లు (సవరించిన అంచనా రూ.8,000 కోట్లు)ఇంటింటికీ తాగునీరు (జల్‌జీవన్ మిషన్) జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం ద్వారా దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది లక్ష్యం. దీన్ని సాకారం చేసేందుకు పథకాన్ని 2028 వరకు పొడిగించారు. తదనుగుణంగానే తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2026–27లో 1,70,000 గ్రామ పంచాయితీల్లో హర్‌ఘర్ జల్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. 80 శాతం గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనేది తాజా బడ్జెట్ లక్ష్యం.2026–27 కేటాయింపులు:రూ.67,670 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.67,000 కోట్లు (సవరించిన అంచనా రూ.17,000 కోట్లు)భారత్ నెట్.. హైస్పీడ్దేశంలో గ్రామ పంచాయతీలన్నింటినీ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. ఇప్పటిదాకా 2,24,323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 7,72,676 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) వేశారు. 2025–26లో 10,000 జీపీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించారు. 80,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ నెట్వర్క్ వేశారు. 2026–27లో 42,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం లభించనుంది. 1,60,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ వేయనున్నారు. 20,50,00 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.2026–27 కేటాయింపులు: రూ.24,000 కోట్లు2025–26 కేటాయింపులు: రూ.22,000 కోట్లు (సవరించిన అంచనా రూ.5,500 కోట్లు)ఇక చాంపియన్లుగా ఎంఎస్ఎంఈలుబడ్జెట్లో రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) చాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్‌ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చు కోవడానికి సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూడు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు చాంపియన్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్‌కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి 2021లో ఏర్పాటుచేసిన ‘స్వయం సమృద్ధ భారత్ నిధి’కి రూ.2,000 కోట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రూ.7 లక్షల కోట్లకుపైగా విలువైన టీఆర్ఈడీఎస్లను ఎంఎస్ఎంఈలు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఆయా కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టీడీఎస్‌ను సులభతరం చేయడంతో ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందన్నారు. -
బడ్జెట్ 2026: వికసిత్ భారత్ దిశగా అడుగులు!
భారత జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతున్న వేళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోని వివరాల ప్రకారం.. ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు మాత్రమే కాదు, సామాన్యుడి ఆశల ప్రతిరూపంగా ఉండనుందనే అంచనాలున్నాయి.వేతన జీవులకు..కేంద్ర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు అనేది వేతన జీవులకు అత్యంత కీలకమైన అంశంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే తగ్గింపు. అంటే, మొత్తం వార్షిక ఆదాయం నుంచి ఎటువంటి ఖర్చులు చూపించాల్సిన అవసరం లేకుండానే ఈ మొత్తాన్ని నేరుగా మినహాయించుకోవచ్చు.పెంపు ఎందుకు అవసరం?గత కొన్ని ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రూ.75,000 (గత సవరణల ప్రకారం) స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుత జీవన వ్యయానికి సరిపోవడం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగుల చేతిలో ఖర్చు చేయడానికి మరింత నగదు మిగులుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే మార్కెట్లో వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచి జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది.మౌలిక సదుపాయాలకు బూస్ట్దేశాభివృద్ధికి మౌలిక వసతులే కీలకమని నమ్ముతున్న కేంద్రం ఈసారి మూలధన వ్యయం (Capital Expenditure) కేటాయింపుల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గడువును పెంచడం ద్వారా స్థానికంగా రోడ్లు, బ్రిడ్జిల వంటివాటి నిర్మాణం వేగవంతం అవుతుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) మరింత విస్తరించనున్నారు.యువత - ఉపాధిరాబోయే రోజుల్లో లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగ వేటలో పడనున్నారు. దీన్ని ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రధానంగా జౌళి (Textiles), పర్యాటకం, ఈ-కామర్స్ రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీలు ఉండొచ్చు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఎంఎస్ఎంఈచిన్న తరహా పరిశ్రమల ఆర్థిక ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని మరింత సరళతరం చేస్తూ కొలేటరల్(పూచీకత్తు) లేకుండా రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి ఎగుమతి సుంకాల్లో సడలింపులు ఉండవచ్చు.వ్యవసాయం, గ్రామీణ వికాసంవాతావరణ మార్పుల ధాటికి తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రస్తుత తక్షణ అవసరం.రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని(ప్రస్తుతం ఏటా రూ.6000) పెంచాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది.భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల వినియోగం, ఆధునిక గోదాముల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘అందరికీ ఇల్లు’ లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహ నిర్మాణ రంగానికి అదనపు కేటాయింపులు చేయనున్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే -
రిస్క్ తీసుకుంటేనే ఉన్నత స్థానం: మోదీ
స్వామి వివేకానంద జీవితం ఎంతో మందికి ఆదర్శ ప్రాయమని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ యుంగ్ లీడర్స్ 2026 ముగింపు కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. యువత రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకూడదని మీ విజయం దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. 2047 వికసిత్ భారత్ ప్రయాణం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. 2014లో తాను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో అక్కడున్న వారిలో చాలామంది చిన్నపిల్లలని అక్కడి యువతనుద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో అనేక మార్పులు తెచ్చామని ఐఐటీలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. యవత చాలా యాక్టివ్‌గా ఉండాలని ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ యువతకు సూచించారు. నేడు స్వామివివేకానంద జయంతి ఈ రోజును భారత్ జాతీయ యువజన దినంగా జరపుకుంటుంది. -
వికసిత భారత నిర్మాణంలో ‘జెన్–జీ’
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం ‘జెన్–జీ’. 1995 నుంచి 2010 మధ్యలో జన్మించిన ఈ ‘జెన్–జీ’ గురించి 2025లో ప్రపంచమంతా మాట్లాడుకుంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటా చర్చ జరిగింది. వీరి ఉద్యమాన్ని కొందరు సానుకూలమైన అంశంగా గమనించారు. స్వాతంత్య్రం, స్పష్టత, మార్పు తదితర అంశాలపై యువత ఆలోచిస్తున్న తీరునూ, ఏకతాటిపైకి వచ్చి పోరాడిన తీరునూ అభినందించారు. మరికొందరు... యువతలో హఠాత్తుగా పెరుగు తున్న నిరాశ, నిస్పృహలకు కారణంగా నేపాల్, మడగాస్కర్ దేశాల ఘటనలను ఉదాహరణలుగా చెబుతున్నారు.ఇలాంటి భిన్నమైన వాదనలను పక్కనపెడితే... ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి ఆశలు, ఆకాంక్షలతో పాటుగా వారి సామర్థ్యం పెరుగుతోంది. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్న పట్టుదల, అంకితభావం పెరుగుతోందనేది నిర్వివాదాంశం. భారత దేశంలోనూ విపక్ష పార్టీ సభ్యులు కొందరు... ఇక్కడి ‘జెన్–జీ’ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా తమ శక్తిసామర్థ్యాలను సమాజ పురోగతి కోసం, దేశాభివృద్ధి కోసం వినియోగిస్తూ... స్పష్టమైన ఆలోచనలతో ‘వికసిత భారత నిర్మాణం’లో భాగస్వాములవుతున్నారు.భారత యువత ‘వివేకం’నేటి ప్రపంచం ‘జెన్–జీ’ గురించి మాట్లాడుతోంది. కానీ,వందేళ్ల క్రితమే స్వామి వివేకానంద యువత సామర్థ్యం, వారికి సరైన మార్గదర్శనం చేయడం ద్వారా దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం ఎలా ఉండాలనేదానిపై ఆలోచించారు. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యువత గురించి మాట్లాడినా... వివేకానందుడి బోధనల గురించి ప్రస్తావించకుండా ఆ సమావేశం సంపూర్ణం కాదు. అంతటి గొప్ప దీర్ఘదర్శి స్వామి వివేకానంద. ఇవాళ (జనవరి 12) వారి 164వ జయంతి. ‘జెన్–జీ’ సామర్థ్యానికి మరింత పదునుపెట్టి... వికసిత భారత నిర్మాణంలో వారిని భాగ స్వాములను చేసే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సంద ర్భమిది. వ్యక్తిత్వం, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చు కోవడం, స్వీయ అవగాహన, సంస్కృతి–సంప్రదాయాలపై గౌరవం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ నిర్మాణంలో మనం ఏం చేయాలనే అనేక అంశాలపై వివేకానందుని బోధనల ప్రభావం ఉంటుంది.వివేకానందుడు వందేళ్ల క్రితం ఉద్బోధించిన ఆధునిక దృక్పథం, నాగరికత విలువల పునాదులు మొదలైన విషయాలన్నీ... నేటి భారత యువతలో కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాల్లోని యువత ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ, వీరంతా భావిభారత నిర్మాణంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. స్వచ్ఛ భారత్, మేరీ మాటీ మేరా దేశ్ (మొక్కల పెంపకం), నషా ముక్త్ భారత్ (మాదక ద్రవ్యాల విని యోగ రహిత భారతం) వంటి ఎన్నో ప్రజాచైతన్య కార్యక్రమాలకు యువతే నేతృత్వం వహించి వాటిని విజయవంతం చేస్తోంది. నవీన సాంస్కృతిక సారథులుఆధునిక సాంకేతికత వినియోగంలోనూ, స్టార్టప్‌ల రూపకల్పన లోనూ మన యువత సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ‘ఇండియా స్టాక్’ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పరిజ్ఞానాన్ని కూడా యువత స్వీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వినూత్న మార్కెట్ పరిష్కారాలకు బాటలు వేయడం, యూనికార్న్ (రూ.వందకోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టే స్టార్టప్)ల ఏర్పాటు వంటి వాటి ద్వారా ఉద్యోగాల సృష్టికర్తలుగా వారి పాత్రను మరింత బలోపేతం చేసుకుంటున్నారు.యువత సంస్కృతికి దూరంగా వెళ్తోందనే దుష్ప్రచారం జరుగు తోంది. కానీ ఆధ్యాత్మిక మూలాలను తెలుసుకోవడంపై, మన వైభవోపేతమైన చరిత్రను అధ్యయనం చేయడంపై యువత మక్కువ చూపుతోంది. 2022 ఆగస్టు 15 నాడు... దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పంచ్ ప్రాణ్ (5 తీర్మాణాల) గురించి వివరించారు. ప్రతి భారతీయుడూ తన లోని బానిస మనస్తత్వపు ఆలోచనలను తొలగించుకుని... మన సంస్కృతీ సంప్రదాయాలు, ఘనమైన చరిత్ర పట్ల గర్వపడాలని సూచించారు. అందుకే యువత... ఓవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే... మరోవైపు భారతీయ నాగరి కత మూలాలను, మన విలువలతో కూడిన సంప్రదాయాల సారాన్ని గ్రహించి ఆచరణలో పెట్టే దిశగా కృషి చేస్తోంది.ఇవాళ యువత ఆధ్యాత్మిక పర్యాటకం, భారతీయ తాత్వికతపై ఆసక్తిని కనబరుస్తోంది. యోగా, శాస్త్రీయ సంగీతం, ఇతర సాంస్కృతిక పద్ధతులను అలవర్చుకుంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగిన ‘కుంభమేళా’లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఈ ఏడాది కొత్త సంవత్సరాన్ని జరుపుకొనేందుకు వేలాదిమంది ‘కాశీ విశ్వనాథ మందిరాన్ని’ ఎంచుకోవడం... యువతలో వస్తున్న పరివర్తనకు ఉదాహరణలు.రాజకీయాల్లో యువశక్తిదీని కారణంగా యువత ఆలోచనల్లోనూ సానుకూలమైన మార్పు కనబడుతోంది. దేశ రాజకీయ, సంస్థాగత అంశాలపై దీని ప్రభావం స్పష్టంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా... యువత ఆకాంక్షలకు పెద్దపీట వేస్తున్నాయి. నాయకత్వంలోనూ యువ భారతానికి ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. 2024లో దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత... రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. దీన్ని ఆచరణలో పెడుతూ, ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం ప్రారంభమైంది. దేశ యువత ఏమనుకుంటోందో తెలుసుకునేందుకు ప్రధానమంత్రి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. వారి ఆకాంక్షలను, వారి ఆలోచనలను, వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ కూడా... ఇటీవలి కాలంలో యువ నాయకులకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పజెబుతోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువకుడిని నియమించింది. రాజకీయంలో పెద్దలకు ఉండే అనుభవాన్ని యువత జోరు, వారి ఆవిష్కరణల సామర్థ్యంతో సమతుల్యం చేయాలన్న ప్రధాని ఆలోచనలకు కార్యరూపం ఇది.దేశ యువశక్తి బలం, క్రమశిక్షణ, నైతికతలోనే భారతదేశ పునరుజ్జీవనం ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవాళ అక్షరసత్యాలుగా మనముందున్నాయి. ఈ ‘జెన్–జీ’పై, యువశక్తిపై ప్రబలమైన విశ్వాసంతోనే... 2047 నాటికి వికసిత భారత నిర్మాణం జరగాలనే సంకల్పాన్ని ప్రధాని దేశం ముందుంచారు. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక సాంకేతికతకు వారథులుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ‘జెన్–జీ’ పాత్ర అత్యంత కీలకం. అందుకే స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ, భారతదేశాన్ని మళ్లీ విశ్వగురువుగా నిలబెట్టుకునేందుకు... ఆధునిక, ఆధ్యాత్మిక భారతాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు ప్రధాన మంత్రి సంకల్పించిన మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాము లమవుదాం!జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి(నేడు స్వామి వివేకానంద జయంతి; జాతీయ యువజన దినోత్సవం) -
3వేల మంది యంగ్ లీడర్స్‌తో రేపు ప్రధాని ముఖాముఖి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన 3 వేల మందికిపైగా యువజనులతో ముఖాముఖి సమావేశం జరపనున్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే వికసిత్ భారత్(వీబీ)–యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం జరగనుంది. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా పలువురు పాల్గొంటున్నారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) శనివారం తెలిపింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 12న జరిగే కార్యక్రమంలో ఎంపికైన యువ నేతలు 10 విభిన్న ఇతివృత్తాలకు సంబంధించిన తమ తుది ప్రజెంటేషన్లను ప్రధాని మోదీకి సమరి్పస్తారు. దేశాభివృద్ధికి సంబంధించి యువత దృక్పథం, వారి వినూత్న ఆలోచనలు, అమలు చేయదగ్గ ప్రణాళికలను నేరుగా ప్రధానితో పంచుకుంటారు. అనంతరం ప్రధాని ’వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2026’ వ్యాస సంకలనాన్ని విడుదల చేస్తారు. -
భారతీయ వారసత్వ విశ్వరూపం
ప్రయాగరాజ్ మహాకుంభం నుండి పారిస్ వేదికపై మరాఠా పరాక్రమం వరకు.. మట్టి ప్రమిదల వెలుగు నుండి వందేమాతరం శంఖారావం వరకు.. 2025 సంవత్సరం భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా నిలిచింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సంప్రదాయాలను, ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ సాగిన ఈ ఏడాది ప్రయాణం.. ‘వికసిత్ భారత్’దిశగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం కాలాన్ని లెక్కించడం కాదు, ప్రపంచ యవనికపై భారత్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం. మహా కుంభమేళా, ‘కళాగ్రామ్’ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాతి్మక కలయికగా భావించే కుంభమేళాను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నిర్వహించారు. మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని టెంట్ సిటీలో 10.24 ఎకరాల్లో ’కళా గ్రామం’ ఏర్పాటు చేశారు. ఇది భారతీయ హస్తకళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కుంభమేళా చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత కట్టడాలపై ప్రదర్శించి, దీనిని ఒక జాతీయ పండుగలా జరిపారు. వందేమాతరం @ 150 1875–76 ప్రాంతంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ’వందేమాతరం’ నినాదం పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకుంటూ ఏడాది పొడవునా సాగే ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2025లో శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద వందేమాతరం గీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బుద్ధుడి వారసత్వం – దౌత్య నీతి పైప్రావా (కపిలవస్తు) వద్ద లభించిన బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయ్‌లాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన ‘సాంస్కృతిక దౌత్యం’చాటింది. 1898లో కనుగొన్న అత్యంత విలువైన పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంగ్‌కాంగ్‌లో భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ దౌత్య సహకారంతో అమూల్యమైన బంగారు, స్ఫటిక ఆభరణాల నిధిని తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ (దేవ్నిమోరి) నుండి లభించిన అవశేషాలను శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో తీసుకెళ్లనున్నారు. జ్ఞాన భారతం – డిజిటల్ విప్లవం సెపె్టంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘జ్ఞాన భారతం’పోర్టల్ ద్వారా దేశంలోని అరుదైన రాత ప్రతులను భద్రపరిచి, డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యంలో భాగంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’తో ముగిసింది. దీపావళికి విశ్వ కిరీటం భారతీయుల ఆరాధ్య పండుగ ’దీపావళి’కి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైన ’మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చోటు కల్పించింది. డిసెంబర్ 10న లభించిన ఈ గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య 16కు చేరింది.మరాఠా కోటల ప్రపంచ రికార్డు జూలైలో పారిస్‌లో జరిగిన సమావేశంలో శివనేరి, రాయ్‌గఢ్ సహా 12 మరాఠా సైనిక కోటలకు ‘ప్రపంచ వారసత్వ హోదా’లభించింది. శత్రు దుర్భేద్యమైన భారతీయ యుద్ధ తంత్రానికి ఇది దక్కిన అంతర్జాతీయ గౌరవం. మహనీయుల స్మరణఅహిల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి, సర్దార్ పటేల్ 150వ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (125 ఏళ్లు), గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించి, భారతీయ మూలాలను స్మరించుకున్నారు. ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సుయునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశాన్ని తొలిసారిగా భారత్ నిర్వహించింది. వారసత్వ సంపద రక్షణపై ‘ఢిల్లీ డిక్లరేషన్’ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని వేడుకగా జరుపుకోవడం, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడం.. ఈ మూడింటి కలయికే 2025 భారత సాంస్కృతిక గమనం. భారతావనికి ఒక ‘సాంస్కృతిక వసంతం’! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్త జట్టు కోసం బీజేపీ జల్లెడ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా యువనేత నితిన్ నబిన్ ఇటీవల పగ్గాలు చేపట్టాక పార్టీ సంస్థాగత పునరి్నర్మాణంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులోభాగంగా నబిన్ సహాయక జట్టును పూర్తిగా యువరక్తంతో నింపేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. జనవరిలోకొత్త అధ్యక్షుడిని అధికారికంగా నియమించిన తర్వాత ఉపా ధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రతినిధులతో కూడిన కొత్త ఆఫీస్ బేరర్ల బృందాన్ని ఎంపిక చేసేందుకు దేశ వ్యాప్తంగా యు వ నేతలను జల్లెడ పడుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా దేశాన్ని నడిపించేలా యువ నాయకత్వానికి అధిక ప్రాతినిధ్యం కలి్పంచే లక్ష్యంతో జట్టు కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీలో మొదలైన ‘తరాల’మార్పు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే తన నాయకత్వ మార్పు ముద్రను స్పష్టంగా వ్యక్తం చేస్తూ వస్తోంది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రివర్గ కూర్పులో యువకులకు పెద్ద పీట వేస్తోంది. 56 ఏళ్లున్న సామ్రాట్ చౌదరి, 57 ఏళ్లున్న విజయ్ సిన్హాలను బిహార్‌లో ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయగా, ఛత్తీస్‌గఢ్‌లో 57 ఏళ్లున్న అరుణ్ సావో, 52 విజయ్ శర్మలను ఉపముఖ్యమంత్రులుగా ఎంపికచేశారు. 50 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, 53 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో కూర్చోబెట్టారు. ఇటీవలే గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి 19 మంది కొత్త మంత్రులను చేర్చుకున్నారు. దీంతో మంత్రివర్గం సగటు వయస్సు 60 నుంచి 55 ఏళ్లకు తగ్గింది. 40 ఏళ్ల హర్‡్ష సంఘ్వీని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇవన్నీ రాష్ట్రాల్లో బీజేపీ యువనాయకత్వాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతలకు అద్దంపడుతున్నాయి. 50 ఏళ్లుకూడా లేని నబిన్‌ను ఏకంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబిన్ ఎన్నిక అనేది పార్టీ యువనాయకత్వం వైపు అడుగులేస్తోందనడానికి ప్రబల తార్కాణం. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఇది నిర్ణయాత్మక మార్పే. బీజేపీ రాబోయే పాతికేళ్లకు వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే యువనాయకత్వాన్ని సంసిద్ధం చేసుకుంటోంది’’అని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. రెండు దశాబ్ధాలను నడిపించే నేతలకై వెతుకులాట.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత, అంతగా తెలియని నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. 52 ఏళ్ల గడ్కరీ అప్పట్లో తన జట్టుని పునరి్నరి్మంచినప్పుడు, ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకోబోయే దిశను సూచించాయి. ముఖ్యంగా ఆయన తన జట్టులోని ప్రధాన కార్యదర్శులలో అనంత్ కుమార్, వసుంధరా రాజే, అర్జున్ ముండా, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా వంటి నేతలున్నారు. వారంతా గడిచిన పదహారేళ్లుగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు మోస్తున్నారు. మరో పదేళ్ల పాటు సేవలందించే స్థాయిలో ఉన్నారు. అదే మాదిరి ప్రస్తుతం నబిన్ నేతృత్వంలోని జట్టులోనూ భవిష్యత్ నాయకత్వాన్ని ప్రతిబింబించే నేతలకు అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. రాబోయే రెండు, మూడు దశాబ్దాల పాటు పార్టీకి నాయకత్వం వహించే కొత్త నాయకులను తయారు చేయాలనే రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సూచనలకు అనుగుణంగా నవతరం ఆఫీస్ బేరర్లను ఎంపిక చేసే అవకాశాలున్నాయని∙తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తమ తమ రాష్ట్రాల్లో పార్టీ కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకుల వివరాలను పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా తెప్పించి పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీళ్లలో అత్యధికులు 35 నుంచి 50 ఏళ్ల వయస్సు వారేకావడం గమనార్హం. ఇప్పటికే కొందరి నేతలకు భవిష్యత్‌లో పోషించే పాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిని సైతం పార్టీ ప్రారంభించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తంగా జాతీయ కార్యవర్గంలో సగటు వయస్సు 53 ఏళ్లకు మించకుండా ఉండేలా నాయకుల ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. -
వీబీ–జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం సంతకం చేశారు. దాంతో అది వీబీ–జీ రామ్ జీ చట్టం–2025గా అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ కూడా వెలువడింది. గ్రామీణ ఉపాధి, అభివృద్ధి సాధన దిశలో ఇది కీలక మైలురాయిగా నిలవగల సంస్కరణ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 2047కల్లా భారత్ ను వికసిత దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో భాగంగానే కొత్త చట్టాన్ని తెచ్చినట్టు కేంద్రం వివరించింది. దీనికింద గ్రామీణులకు ఏటా కనీసం 125 పనిదినాలు కల్పించనున్నారు. ఈ బిల్లును నిరసనలు, ఆందోళనల మధ్యే గత వారం పార్లమెంటులో ప్రవేశపెట్టడం తెలిసిందే. తమ హయాంలో వచ్చిందన్న ఒకే ఒక్క కారణంగా చరిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏ ను కక్ష కొద్దీ మోదీ సర్కారు రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివ రాజ్ పాటిల్ తోసిపుచ్చారు. కొత్త చట్టంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది ఎంజీఎన్ఆర్ఈజీఏ కన్నా ఒకడుగు ముందున్న చట్టం’ అని ఆదివారం ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. శాంతి బిల్లుకు కూడాపౌర అణు శక్తి రంగంలోకి ప్రైవేటు భాగస్వా ములను కూడా అనుమతించేందుకు ఉద్దేశించిన సస్టైనబుల్ హర్నెసింగ్ అండ్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ ఇండియా (శాంతి) బిల్లుకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ బిల్లుపై శనివారం ఆమె సంతకం చేశారు. ఆదివారం వెలువడ్డ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఈ మేరకు పేర్కొంది. 1962 నాటి అటామిక్ ఎనర్జీ యాక్ట్, 2010 నాటి సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. -
‘జీ రామ్ జీ’కి జై
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ(జీ రామ్ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిల్లు ప్రతులను చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. గాం«దీజీ వారసత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్‌సభలో దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగింది. విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ చర్చకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు. ఉపాధి హమీ పథకంలో అవినీతి జరుగుతోందని, లోపాలను సరిచేయడానికే బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పథకంలో మార్పులు చేస్తున్నామని, స్థిరాస్తులను సృష్టించడం, గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడం పథకం ఉద్దేశమని వివరించారు. గాం«దీజీ ఆదర్శాలను మోదీ ప్రభుత్వం పాటిస్తోందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి ఎన్నో ప్రథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసం గాంధీజీ పేరు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాముడి పేరుపై ఎందుకంత అసహనం? విస్తృతమైన సంప్రదింపుల తర్వాతే జీ రామ్ జీ బిల్లును రూపొందించామని శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టంచేశారు. గ్రామీణ ఉపాధికి ప్రభుత్వం దాదాపు రూ.11 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. ఈ నిధులను నీటి సంరక్షణ, గ్రామీణ, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, ప్రతికూల వాతావరణ సమస్యలను పరిష్కరించే పనుల కోసం వెచ్చించబోతున్నట్లు వెల్లడించారు.అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సభలో బిల్లు ప్రతులను చించివేసి దుర్మార్గుల్లా ప్రవర్తించారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గూండాయిజంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. బిల్లుకు జీ రామ్ జీ అని పేరు పెడితే తప్పేమిటని ప్రశ్నించారు. పేరుపై రాద్ధాంతం అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం పేరును పట్టుకొని వేలాడుతున్నాయని, తాము మాత్రం పనిపై దృష్టి పెట్టామని స్పష్టంచేశారు. రాముడి పేరు వినిపిస్తే ఎందుకంత అసహనం? అని నిలదీశారు. విపక్షాల నిరసన ర్యాలీ జీ రామ్ జీ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలకు పంపించాలని లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ కోరారు. స్పీకర్ ఓం బిర్లా అందుకు అంగీకరించలేదు. దీనిపై మాట్లాడేందుకు అన్ని పారీ్టల సభ్యులకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రేరణ స్థలంలోని గాం«దీజీ విగ్రహం నుంచి మకరద్వారా వరకూ నడిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం హత్య చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. రాజ్యసభలో బిల్లు.. జీ రామ్ జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు సూచించడానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్లో...→ ప్రతి పక్షాల తీవ్ర నిరసనల మధ్య ‘జీ రామ్ జీ’ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కింది. → సభలో ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. → అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. → రాజ్యసభలో అర్ధరాత్రి దాటాక జీరామ్‌జీ బిల్లు ఆమోదం పొందింది. → అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం కల్పిచడానికి ఉద్దేశిచిన ‘శాంతి’ బిల్లుకు పార్లమెంట్ జై కొట్టింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభలో ఓకే అయ్యింది.→ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ‘సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లు’ను ప్రవేశపెట్టారు. → స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. -
ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థ
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ఒకే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) వంటి సంస్థల స్థానంలో ఏకైక వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ) బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు పేరును ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’గా మార్చారు. సింగిల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నూతన జాతీయ విద్యా విధానంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జన గణన, పంటలకు కనీస మద్దతు ధర, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కాలం చెల్లిన చట్టాల రద్దు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. మూడు ప్రధాన బాధ్యతలు ఉన్నత విద్య నియంత్రణను ఒకే ఒక్క వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించడం ముఖ్యమైన సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవస్థకు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారు. రెగ్యులేషన్, అక్రెడిటేషన్, ప్రమాణాలు నిర్దేశించడం. విద్యా సంస్థలకు నిధులు కేటాయించే అధికారం మాత్రం ఉండదని తెలుస్తోంది. నిధుల బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే వైద్య, న్యాయ కళాశాలలు ఈ సింగిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ పరిధిలోకి వచ్చే అవకాశం లేనట్లు సమాచారం. హెచ్ఈసీఐ ముసాయిదా బిల్లు ఇప్పటికే సిద్ధమైంది. ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’ పార్లమెంట్లో ఆమోదం పొందితే ఈ కమిషన్ సాకారం కానుంది. ‘ఉపాధి’ పని దినాలు ఇకపై 125 రోజులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చడానికి ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పనిదినాల సంఖ్యను ఏటా 100 నుంచి 125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కూలీలకు ప్రతి సంవత్సరం కనీసం 125 పని దినాలు కల్పించాల్సి ఉంటుంది. జన గణనకు రూ.11,718 కోట్లు దేశవ్యాప్తంగా జన గణన కోసం రూ.11,718 కోట్లు కేటాయించడానికి మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. ఈసారి డిజిటల్ రూపంలో జన గణన నిర్వహించబోతున్నారు. దాదాపు 30 లక్షల మంది ఎన్యుమరేటర్లు ఈ క్రతువులో పాల్గొంటారు. జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. రెండు దశలో కులగణన నిర్వహిస్తారు. మొదటి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడతారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి జన గణన ప్రారంభిస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే జమ్మూకశీ్మర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మాత్రం 2026 సెప్టెంబర్‌లోనే జన గణన ప్రారంభమవుతుంది. ప్రజల డేటా సేకరణ కోసం మొబైల్ యాప్‌ను ఉపయోగించబోతున్నారు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్ అని చెప్పొచ్చు. బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలు దేశంలో బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) అనుమతించే బీమా చట్టాల(సవరణ) బిల్లు–2025ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో బీమా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచబోతున్నారు బొగ్గు గనుల వేలానికి ‘కోల్‌సేతు’ పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గు గనుల వేలం, ఎగుమతులకు అనుమతులు ఇచ్చే విషయంలో ‘కోల్‌సేతు’ వేదిక ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేలంలో పారదర్శకతతోపాటు వనరుల సది్వనియోగానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ వినియోగదారులు బొగ్గు కావాలంటే ‘కోల్‌సేతు’ ద్వారా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. తవ్విన బొగ్గులో 50 శాతాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. మిగతా 50 శాతం ఇక్కడే ఉపయోగించాలి. ఎండు కొబ్బరికి మరో రూ.445 మిల్లింగ్ చేసిన ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కేంద్ర మంత్రివర్గం క్వింటాల్‌కు మరో రూ.445 పెంచింది. దీంతో 2026 సీజన్లో క్వింటాల్ ధర రూ.12,027కు చేరింది. ఇక మిల్లింగ్ చేయని ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు మరో రూ.400 పెంచింది. ఈ రకం కొబ్బరికి క్వింటాల్ ధర రూ.12,500కు చేరుకుంది. కొబ్బరి రైతులను ప్రోత్సహించడానికి, వారికి మరింత ఆదాయం దక్కేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 71 చట్టాలు రద్దు కాలం చెల్లిపోయిన 71 చట్టాల రద్దు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందులో 65 చట్టాలు సవరణ చట్టాలు, ఆరు అసలైన చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 1,562 పాత చట్టాలను రద్దు చేసింది. ప్రతిపాదిత రిపీల్ అండ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే.. రద్దయిన చట్టాల సంఖ్య 1,633కు చేరుకోనుంది. -
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. -
మోదీ రిటైర్మెంట్ అప్పుడే.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ(75) ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అనే సూటి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. బీజేపీలో ఒక వయసు దాటాక సీనియర్లను పక్కన పెడుతుండడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అయితే.. మోదీ(Modi Retirement) విషయంలో మాత్రం బీజేపీ, దాని మాతృ సంస్థ ఆరెస్సెస్ ఆ పనిని ఎందుకు చేయకపోతున్నాయంటూ ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు మోదీ సైతం తన రిటైర్మెంట్పై ఏనాడూ పెదవి విప్పింది లేదు. ఈ తరుణంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం లేకపోలేదు.ఆఫ్రికా దేశం మొరాకోలో పర్యటించిన తొలి భారత రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ తరుణంలో ఆ పర్యటనలో ఉన్న ఆయన.. ఓ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ఆ సమయంలో మోదీ భారత ప్రధానిగా ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అని రాజ్‌నాథ్ సింగ్‌ను యాంకర్ ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ.. ‘‘2029, 2034, 2039, ఆపై 2044లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి అని, 2047లో వికసిత్ భారత్(Viksit Bharat 2047) లక్ష్యాన్ని సాధించిన తర్వాతే విరమణ తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. మోదీ ఒక వ్యక్తి మాత్రమే కాదు భారత అభివృద్ధి లక్ష్యానికి ప్రతీక. ఆయన నాయకత్వంలో భారత్ శాంతి, శక్తి.. ఈ రెండింటికీ ప్రతినిధిగా మారింది. ఆయన సారథ్యంలోనే.. భారత తయారీ సామర్థ్యం ప్రపంచ స్థాయికి చేరింది. వికసిత్ భారత్‌ను మోదీ వ్యక్తిగత లక్ష్యంగా తీసుకున్నారు. కాబట్టి ఆయన సాధించేవరకు నాయకత్వం వదలబోరు. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. వికసిత్ బారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. అప్పుడే ఆయన రిటైర్ అవుతారు అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తద్వారా.. మోదీ విషయంలో బీజేపీ అసాధారణ మినహాయింపులు ఇచ్చిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారాయన. 🚨 BIG STATEMENT 🚨RM Rajnath Singh: “PM Narendra Modi will be BJP’s PM candidate in 2029, 2034, 2039 & even 2044.” 🎯“He will retire only after achieving the goal of a Viksit Bharat by 2047.” 🇮🇳 pic.twitter.com/f2xHicpnzB— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2025మొరాకా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్.. ఆఫ్రికా ఖండంలోనే భారత్ తరఫున మొదటి రక్షణ తయారీ కేంద్రం ప్రారంభించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మొరాక్ పేరిట.. ఇరు దేశాల మధ్య రక్షణ పరిశ్రమ, శిక్షణ, సాంకేతిక మార్పిడి అంశాల్లో ఎంవోయూ కుదిరింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్-మహమ్మద్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కలిపి ఈ కేంద్రాన్ని రూపొందించాయి. దీని ద్వారా ఏటా 100 యుద్ధ వాహనాలను(WhAP 8x8) తయారు చేయబోతున్నారు.ఇదీ చదవండి: రాజకీయాలు వదిలేశాక ఆ పని చేస్తా-అమిత్ షా


