విలేజ్‌.. విన్నర్‌ | Full focus on rural development with the aim of Vikasit Bharat | Sakshi
Sakshi News home page

విలేజ్‌.. విన్నర్‌

Feb 2 2026 2:59 AM | Updated on Feb 2 2026 4:10 AM

Full focus on rural development with the aim of Vikasit Bharat

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా గ్రామీణాభివృద్ధిపై ఫుల్‌ ఫోకస్‌ 

ఫ్లాగ్‌షిప్‌ పథకాలకు దండిగా నిధులు 

ఉపాధి హామీ పథకానికి కొత్తరూపు

ఇళ్లు, రహదారుల నిర్మాణానికి మరింత దన్ను 

న్యూఢిల్లీ: వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలాంటి గ్రామీణ భారతావనిపై మరింత దృష్టి సారించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం కీలక ఫ్లాగ్‌షిప్‌ పథకాలకు తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించింది. గత ఉపాధి హామీ పథకం స్థానంలో మరింత పటిష్టమైన వీబీ–జీ రామ్‌ జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. 

రాష్ట్రాలను భాగస్వామ్యం చేసే ఈ కొత్త పథకానికి మునుపెన్నడూ లేని రీతిలో కేటాయింపులు చేయడం విశేషం. మొత్తంమీద గ్రామీణాభివృద్ధికి 2026–27 బడ్జెట్లో రూ.1,94,369 కోట్లు దక్కాయి. పాత ఉపాధి హామీ పథకానికి రూ.30,000 కోట్లు, వ్యవసాయ మౌలికసదుపాయాలు, అభివృద్ధి ఫండ్‌కు రూ.4,400 కోట్లను కలుపుకుంటే 21 శాతం మేర నిధులు ఎగబాకినట్లు లెక్క!

గ్రామీణ ప్రజలకు పక్కాగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచి్చంది. దీనికి వికసిత్‌ భారత్‌ – గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ).. సంక్షిప్తంగా వీబీ–జీ రామ్‌ జీ అని పేరు పెట్టారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఇకపై ఏటా 125 రోజుల పాటు (పాత చట్టంలో 100 రోజులు) ఉపాధి హామీ దక్కుతుంది. 

కీలక వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరతను నివారించేందుకు 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. దీని కింద ప్రధానంగా జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధిని కల్పించే పనులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులను చేపడతారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం(వికసిత్‌ భారత్‌) లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, మెరుగైన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్‌ గవర్నెన్స్‌ పెంపొందించడం, పల్లెవాసుల్లో ఆర్థిక సాధికారతను పెంచడం కొత్త చట్టం ప్రధానోద్దేశమని మోదీ ప్రభుత్వం చెబుతోంది. 

పాత ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు 100 శాతం, మెటీరియల్‌ ఖర్చులో 75 శాతం కేంద్రమే భరించేది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న జీ–రామ్‌–జీ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు ఉపాధి వ్యయాన్ని 60:40 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది. తాజా బడ్జెట్‌ కేటాయింపులకు రాష్ట్రాల వాటా తోడైతే జీ–రామ్‌–జీ కోసం ఏకంగా రూ.1.51 లక్షల కోట్లు దక్కుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. 

ఈ కేటాయింపులను ‘చరిత్రాత్మకం, అపూర్వమైనది’గా ఆయన అభివర్ణించారు. కాగా, ముగిసిపోతున్న పాత పథకం కింద చేపట్టిన పనుల కోసం అదనంగా ఈ బడ్జెట్లో మరో రూ.30,000 కోట్లను కేటాయించడం ద్వారా ఉపాధి కల్పనకు గట్టిగానే నిధుల హామీ లభించింది.

‘వికసిత్‌ భారత్‌ జీ–రామ్‌–జీ’తో ఉపాధికి మరింత గ్యారంటీ... 
2026–27 కేటాయింపులు:రూ.95,692 కోట్లు 
2025–26 కేటాయింపులు:రూ.86,000 కోట్లు 
(సవరించిన అంచనా రూ.88,000 కోట్లు)

జోరుగా ఇళ్ల నిర్మాణం (పీఎంఏవై)
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లోనూ కేంద్రం నిధులను భారీగా కేటాయించింది. పీఎంఏవై 2.0 స్కీమ్‌ కింద పీఎంఏవై (అర్బన్‌)కు ఈ బడ్జెట్లో రూ.18,625 కోట్లు దక్కాయి. గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబి్ధదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్‌ కింద 2026–27లో రూ.3,000 కోట్లు జమ చేయనున్నారు. 

కాగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు 2026–27లో 6.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 30.75 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. పీఎంఏవై (గ్రామీణ్‌)కు రూ.54,917 కోట్ల నిధులు అందనున్నాయి. గ్రామాల్లో 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026–27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలనేది బడ్జెట్‌ అంచనా.

2026–27 కేటాయింపులు: రూ.73,542 కోట్లు
2025–26 కేటాయింపులు:రూ.74,626 కోట్లు
(సవరించిన అంచనా రూ.40,000 కోట్లు)

మ్యాచ్‌ సమ్మరీ
ఈ బడ్జెట్‌ మ్యాచ్‌లో గ్రామీణ భారతం క్రీజ్‌లో నిలబడి గెలిచింది. ఉపాధి, ఇళ్లు, రహదారులు, తాగునీరు, డిజిటల్‌ కనెక్టివిటీతో పల్లెల ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఫ్లాగ్‌షిప్‌ పథకాలకు దండిగా నిధులు రావడంతో గ్రామీణ అభివృద్ధి స్ట్రైట్‌ బ్యాట్‌తో ఆడిన క్లియర్‌ విన్నర్‌గా మారింది. ఉపాధి హామీకి కొత్త రూపు, ఇళ్ల నిర్మాణానికి వేగం, గ్రామ రహదారులకు దిశ, ఇంటింటికీ నీరు, నెట్‌కి హైస్పీడ్‌తో గ్రామాలు ఈ బడ్జెట్‌లో చేతులెత్తి విజయాన్ని ప్రకటించాయి. ఇది వికసిత్‌ భారత్‌ లక్ష్యం దిశగా గ్రామీణ భారతం సమయం చూసుకుని కొట్టిన మ్యాచ్‌– విన్నింగ్‌ షాట్‌.

రహదారులు..  రయ్‌ రయ్‌ (పీఎంజీఎస్‌వై)  
2026–27 కేటాయింపులు:రూ.19,000 కోట్లు 
2025–26 కేటాయింపులు:రూ.19,000 కోట్లు
(సవరించిన అంచనా రూ.11,000 కోట్లు)  
గ్రామీణ ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణం, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అమలవుతున్న ఫ్లాగ్‌ షిప్‌ స్కీమ్‌ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన – పీఎంజీఎస్‌వై) ఇది. తాజా బడ్జెట్లోనూ మోదీ సర్కారు ఈ పథకంపై మరింత ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌ నాలుగో దశ అమలవుతోంది. 

2026–27 ఆర్థిక సంవత్సరంలో 26,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్ల నిర్మాణం లక్ష్యం. పర్యావరణ అనుకూల సాంకేతికతతో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 4,200 గ్రామీణ ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానించాలని కేంద్రం సంకల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్‌ నాటికి 7,87,809 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు అంచనా.

స్వచ్ఛ భారత్‌.. రెండో దశ 
2014లో ఆరంభమైన స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఫ్లాగ్‌షిప్‌ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్‌) స్టేటస్‌ సాకారమైంది. దీన్ని కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ కోసం ఇప్పుడు రెండో దశ అమలవుతోంది. 2026–27లో 48,096 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణ పరిధిలోకి తీసుకురానున్నారు. 

36,119 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. 1,352 బ్లాక్‌లలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. 1,50,000 గ్రామాల్లో సెప్టిక్‌ ట్యాంకుల క్లీనింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. స్వచ్ఛ భారత్‌ (అర్బన్‌) కింద పట్టణ ప్రాంతాల్లో 2026–27లో 50,000 వ్యక్తిగత టాయిలెట్లు, 5,000 కమ్యూనిటీ టాయిలెట్లు, 10,000 పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించనున్నారు. 

2026–27 కేటాయింపులు:రూ.9,692 కోట్లు 
2025–26 కేటాయింపులు:రూ.12,192 కోట్లు 
(సవరించిన అంచనా రూ.8,000 కోట్లు)

ఇంటింటికీ తాగునీరు (జల్‌జీవన్‌ మిషన్‌) 
జల్‌ జీవన్‌ మిషన్‌ ఫ్లాగ్‌షిప్‌ పథకం ద్వారా దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది లక్ష్యం. దీన్ని సాకారం చేసేందుకు పథకాన్ని 2028 వరకు పొడిగించారు. తదనుగుణంగానే తాజా బడ్జెట్‌లో దండిగా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2026–27లో 1,70,000 గ్రామ పంచాయితీల్లో హర్‌ఘర్‌ జల్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. 80 శాతం గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనేది తాజా బడ్జెట్‌ లక్ష్యం.

2026–27 కేటాయింపులు:రూ.67,670 కోట్లు 
2025–26 కేటాయింపులు:రూ.67,000 కోట్లు 
(సవరించిన అంచనా రూ.17,000 కోట్లు)

భారత్‌ నెట్‌.. హైస్పీడ్‌
దేశంలో గ్రామ పంచాయతీలన్నింటినీ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ కనెక్ట్‌ చేయాలనేది ఈ స్కీమ్‌ లక్ష్యం. ఇప్పటిదాకా 2,24,323 పంచాయితీలను కనెక్ట్‌ చేశారు. 7,72,676 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (ఓఎఫ్సీ) వేశారు. 2025–26లో 10,000 జీపీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించారు. 80,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ వేశారు. 2026–27లో 42,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం లభించనుంది. 1,60,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్‌సీ వేయనున్నారు. 20,50,00 ఫైబర్‌–టు–హోమ్‌ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.

2026–27 కేటాయింపులు: రూ.24,000 కోట్లు
2025–26 కేటాయింపులు: రూ.22,000 కోట్లు 
(సవరించిన అంచనా రూ.5,500 కోట్లు)

ఇక చాంపియన్లుగా ఎంఎస్‌ఎంఈలు
బడ్జెట్‌లో రూ.10,000 కోట్లతో డెడికేటెడ్‌ ఫండ్‌ 
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) చాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్‌ ఫండ్‌ను తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్‌ ఆదివారం బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

మన కర్తవ్యం నెరవేర్చు కోవడానికి సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూడు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ అని వివరించారు.  ఇందులో భాగంగా ఎంఎస్‌ఎస్‌ఈలు చాంపియన్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్‌ ఇంజన్‌కు ఎంఎస్‌ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. 

అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి 2021లో ఏర్పాటుచేసిన ‘స్వయం సమృద్ధ భారత్‌ నిధి’కి రూ.2,000 కోట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రూ.7 లక్షల కోట్లకుపైగా విలువైన టీఆర్‌ఈడీఎస్‌లను ఎంఎస్‌ఎంఈలు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఆయా కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. టీడీఎస్‌ను సులభతరం చేయడంతో ఎంఎస్‌ఎంఈలకు మేలు జరుగుతుందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement