బిహార్‌ సీఎంగా ‘సామ్రాట్’.. నితీష్ వ్యాఖ్యలకు మంత్రి క్లారిటీ! | Did Nitish Kumar project Samrat Choudhary as the new CM | Sakshi
Sakshi News home page

బిహార్‌ సీఎంగా ‘సామ్రాట్’.. నితీష్ వ్యాఖ్యలకు మంత్రి క్లారిటీ!

Mar 19 2026 10:39 AM | Updated on Mar 19 2026 10:39 AM

Did Nitish Kumar project Samrat Choudhary as the new CM

పట్నా: బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే చర్చ.. సీఎం నితీష్ కుమార్ వారసుడు ఎవరు? ఆయన తన వారసుడిగా డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటికి సీనియర్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి బ్రేక్ వేశారు. ఆ వార్తల్లో నిజం లేదని, మీడియా కేవలం ఊహాగానాలతో వార్తలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.

అసలేం జరిగింది?
ఇటీవల జముయి జిల్లాలో జరిగిన ‘సమృద్ధి యాత్ర’లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న సామ్రాట్ చౌదరీని చూపిస్తూ.. ‘ఇకపై ఈయనే బీహార్ బాధ్యతలను చూసుకుంటారు, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు. నితీష్ రాజ్యసభకు వెళుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపాయి. సామ్రాట్ చౌదరిని నితీష్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించేశారని అంతా భావించారు.

మంత్రి క్లారిటీ ఇదీ..
ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఇఫ్తార్ వేడుక అనంతరం మంత్రి విజయ్ కుమార్ చౌదరి మీడియాతో మాట్లాడారు. నితీష్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన కోరారు. ‘ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. నితీష్ కుమార్ ఎప్పుడూ తన కేబినెట్ సహచరులను ఇలాగే ప్రోత్సహిస్తుంటారు. బాధ్యతలు చూసుకోమని చెప్పడం ఆయనకు అలవాటే. ఇందులో కొత్త సిగ్నల్స్ ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు.

మారుతున్న రాజకీయ సమీకరణలు
నితీష్ కుమార్ తన పదవిని వదులుకున్నాక, బీహార్‌లో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ గత వారమే పార్టీలో చేరారు. కొత్త ప్రభుత్వంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చని జేడీయూ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, మైనారిటీల పట్ల నితీష్‌కు ఉన్న అంకితభావాన్ని మంత్రి కొనియాడారు. రాజకీయం అనేది భావోద్వేగాలతో కాకుండా సమీకరణలతో నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీయూలో కీలక నేత కేసీ త్యాగి రాజీనామా చేయడంతో బిహార్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

ఇది కూడా చదవండి: నవరాత్రి శోభ: వర్షంలోనూ వైష్ణోదేవికి పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement