నవరాత్రి శోభ: వర్షంలోనూ వైష్ణోదేవికి పోటెత్తిన భక్తులు | Chaitra Navratri begins with morning aarti Vaishno Devi | Sakshi
Sakshi News home page

నవరాత్రి శోభ: వర్షంలోనూ వైష్ణోదేవికి పోటెత్తిన భక్తులు

Mar 19 2026 10:10 AM | Updated on Mar 19 2026 10:11 AM

Chaitra Navratri begins with morning aarti Vaishno Devi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తోంది. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ‘చైత్ర నవరాత్రులు’ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే దేశంలోని ప్రముఖ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మంగళ హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు, జమ్ముకశ్మీర్ నుంచి వారణాసి వరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

వర్షాన్ని లెక్కచేయని భక్తులు..
జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో వాతావరణం అనుకూలించకపోయినా, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. మాతా వైష్ణో దేవి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తెల్లవారుజామునే బేస్ క్యాంప్‌కు చేరుకుని, తమ యాత్రను ప్రారంభించారు. వర్షంలో తడుస్తూనే కొండపైకి కదిలిన భక్తుల దృశ్యాలు వారి అచంచల విశ్వాసానికి అద్దం పడుతున్నాయి.
 

రాజధానిలో ఆధ్యాత్మిక సందడి
దేశ రాజధాని ఢిల్లీలో నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఛతర్‌పూర్‌లోని ప్రసిద్ధ ఆద్యా కాత్యాయిని శక్తిపీఠంలో తెల్లవారుజామున నిర్వహించిన ఆరతి కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. అదేవిధంగా, ఝండే వాలన్ ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు బారులు తీరి అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మాయానగరి నుంచి కాశీ వరకు..
ముంబైలోని ప్రసిద్ధ ముంబా దేవి ఆలయంలోనూ నవరాత్రి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆధ్యాత్మిక నగరం వారణాసిలోని దుర్గాకుండ్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, దుర్గామాతను వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజించి, చివరి రోజున శ్రీరామనవమితో వేడుకలకు ముగింపు పలుకుతారు.

ఇది ​​కూడా చదవండి: బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement