బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా.. | In Ukraines Kharkiv, 20,000 children go underground to study | Sakshi
Sakshi News home page

బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా..

Mar 19 2026 9:21 AM | Updated on Mar 19 2026 9:21 AM

In Ukraines Kharkiv, 20,000 children go underground to study

ఖార్కివ్: పైన క్షిపణుల మోత.. కింద పిల్లల అక్షరాల పాట.. రష్యా సరిహద్దుకు కూతవేటు దూరంలోని ఉక్రెయిన్ నగరం ఖార్కివ్‌లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఇదే. నిత్యం బాంబు దాడులు, డ్రోన్ల ముప్పుతో వణికిపోతున్న ఈ నగరంలో చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మెట్రో రైలు స్టేషన్లనే తరగతి గదులుగా మార్చివేసింది.

పాతాళంలో పాఠశాలలు
రష్యా సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్కివ్ నగరంపై నిత్యం బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న 184 పాఠశాలల్లో 134 ధ్వంసమయ్యాయి. దీంతో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే, వారికి చదువును అందించేందుకు ఎనిమిది మెట్రో స్టేషన్లను పాఠశాలలుగా మార్చారు. ప్రస్తుతం సుమారు 20 వేల మంది విద్యార్థులు భూగర్భ మెట్రో స్టేషన్లు, బంకర్లలో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో చదువుకుంటున్నారు.

ట్రైన్ల పక్కనే పాఠాలు
ఒకప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడే మెట్రో స్టేషన్ హాల్స్ ఇప్పుడు క్లాస్ రూమ్‌లుగా మారిపోయాయి. ఒలెక్సాండర్ మాసెల్స్కీ మెట్రో స్టేషన్‌లో సుమారు 2,000 మంది చిన్నారులు షిఫ్టుల వారీగా చదువుకుంటున్నారు. ‘ఇక్కడ యుద్ధం గురించి ఆలోచించాల్సిన పనిలేదు, ఇది చాలా సురక్షితమైన ప్రదేశం. మా దృష్టి అంతా పిల్లలకు పాఠాలు చెప్పడంపైనే ఉంటుంది’ అని ఇంగ్లీష్ టీచర్ మాక్సిమ్ త్రిస్తాప్షోన్ తెలిపారు.

భయం నీడలో భద్రత
బయట పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. బస్టాపుల్లో నిలబడితే ఎప్పుడు డ్రోన్ దాడులు జరుగుతాయో తెలియదు. అందుకే పిల్లలను బస్సుల ద్వారా నేరుగా స్టేషన్ లోపలికే తీసుకొస్తారు. ‘నాకు ఇక్కడ చదువుకోవడం ఇష్టం, ఎందుకంటే ఇక్కడ బాంబుల భయం ఉండదు’ అని తొమ్మిదేళ్ల అలీసా అనే విద్యార్థిని చెప్పడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు పోషక విలువల కోసం ‘ఉజ్వర్’ అనే పానీయాన్ని కూడా అందిస్తున్నారు.

సంస్కృతిని కాపాడుకుంటూ..
ఈ మెట్రో పాఠశాలలు కేవలం అక్షరాలు నేర్పడమే కాదు, ఉక్రెయిన్ సంస్కృతిని కాపాడే వేదికలుగా కూడా మారాయి. రష్యన్ భాషా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నగరంలో, పిల్లలు ఇప్పుడు పాఠశాలల ద్వారా ఉక్రేనియన్ భాషను నేర్చుకుంటున్నారు. యుద్ధం తమ గతాన్ని, చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని అధ్యక్షుడు జెలెన్ స్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా యుద్ధం మిగిల్చిన గాయాల మధ్య, క్షిపణి దాడుల భయం లేకుండా ప్రశాంతంగా చదువులు సాగించడం ఈ పిల్లలకు అతిపెద్ద ఊరటగా మారింది. ఖార్కివ్ మెట్రో స్టేషన్లు ఇప్పుడు కేవలం ప్రయాణ ప్రాంగణాలు మాత్రమే కాదు, విజ్ఞాన దేవాలయాలుగా మారాయంటున్నారు స్థానికులు.

ఇది కూడా చదవండి: ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement