చైనాలోని నింగ్బో నగరంలో 12 ఏళ్ల బాలుడు చేసిన చిన్న పొరపాటు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. తన తల్లిదండ్రుల ఆఫీసులో లైటర్‌తో ఆడుకుంటూ అతను పొరపాటున నిప్పు పెట్టడంతో కార్యాలయం చాలా వరకు దగ్ధమైంది.ఈ సంఘటన గత నెల 30వ తేదీన, తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బో నగరంలో జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
పిల్లాడిని ఇంట్లో ఒంటరిగా ఎందుకు, తమ మధ్య అనుబంధం పెరుగుతుందని భావించిన తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును ఆఫీసుకి తీసుకెళ్లారు. ఆఫీసులో అందరూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ బాలుడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంటో ఒంటరిగా ఉన్నవాడికి పిల్లవాడికి కాసేపటికి బోర్ కొట్టడంతో, అక్కడే ఉన్న ఒక లైటర్‌ను తీసుకుని టిష్యూ పేపర్లను కాల్చడం అనే ఆటను సరదాగా మొదలు పెట్టాడు. కానీ చూస్తుండగానే మంటలు ఆఫీసు అంతటా వేగంగా వ్యాపిస్తాయనీ గానీ, పెను ప్రమాదం ముంచు కొస్తుందని గానీ ఆ పిల్లగాడు ఊహించలేదు.
టిష్యూ పేపర్ల నుండి వచ్చిన నిప్పురవ్వలు డెస్క్ పక్కన ఉన్న చెత్తకు అంటుకున్నాయి. బాలుడు భయంతో తన తండ్రికి చెప్పాడు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోపే అక్కడున్న ఉద్యోగులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, ఆఫీసు సామాగ్రి భారీగా దెబ్బతింది.ఆస్తి నష్టం సుమారు వేల యువాన్లలో (సుమారు రూ.1,41,118) ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పిన తర్వాత, అక్కడి ఫైర్ ఫైటర్ ఒకరు ఉద్యోగులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, కానీ వారికి భద్రత పట్ల అవగాహన ఉండదు. తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద విపత్తుకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధిస్తారు. వారి పనిచేస్తున్న కంపెనీ ఏంటి అనే విషయాన్ని వెల్లడించలేదు.

నెటిజన్ల స్పందనలు
ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడు క్షేమంగా ఉన్నందుకు సంతోషం అని కొందరంటే.. వాడు మూడు నాలుగేళ్ల పిల్లాడు కాదు, 12 ఏళ్ల వయసులో కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడంటే ఇంట్లో బాగా గారాబం ఎక్కువై ఉంటుంది అని ఒకరు విమర్శించారు. ఇకపై ఏ బాస్ కూడా తన ఉద్యోగులను పిల్లల్ని ఆఫీసుకి తీసుకురావడానికి అనుమతించరు" అని మరొకరు ఎద్దేవా చేశారు. చైనాలో ఇలా పిల్లల వల్ల అగ్నిప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా ఘటన తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది.


