‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.’’ అని ఓ సినీకవి అన్నట్టుగా పెళ్లి వేడుకలు, బంధు మిత్రుల ఆనందోత్సాహాలు, వధూవరుల కోటి కలల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగాల్సిన పెళ్లి ముచ్చట ఉన్నట్టుండి విచారంగా పోయింది. వేద మంత్రాల మధ్య వైభవంగా వధువుకు తాళి కట్టాల్సిన ముచ్చట ఆసపత్రి ఐసీయూకి చేరింది. ఇంతకీ ఏమైంది తెలుసుకుందాం ఈ కథనంలో.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ భావోద్వేగపూరితమైన వివాహం జరిగింది. పెళ్లి రోజునే వధువు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో బరాత్‌ను ఆసుపత్రికే తీసుకువచ్చి, వధువు నుదిట సింధూరం అద్ది పెళ్లి చేసుకున్నాడు.
అసలేం జరిగింది అంటే
గోరఖ్‌పూర్ జిల్లా బాన్స్‌గావ్ ప్రాంతానికి చెందిన పూజా యాదవ్ అనే యువతికి, సన్ని యాదవ్ అనే యువకుడితో మే 13న పెళ్లి జరగాల్సి ఉంది. పూజ ఎల్.ఎల్.బి (LLB) చివరి సెమిస్టర్ చదువుతోంది. పెళ్లి రోజు ఉదయం ఆమె తన సోదరుడితో కలిసి పరీక్ష రాయడానికి కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరీక్ష రాసి బైక్‌పై తిరిగి వస్తుండగా, పూజకు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో బైక్ మీద నుండి కింద పడి పోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూ (ICU)కి తరలించి చికిత్స అందించారు.

పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. చివరికి వధూవరుల కుటుంబాల భారమైన హృదయాలతోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిని వాయిదా వేయకుండా, నిర్ణయించిన ముహూర్తానికే ఆసుపత్రిలో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.
వరుడు సన్ని యాదవ్ పెళ్లి బట్టల్లో, బంధుమిత్రులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఐసీయూ బెడ్ మీద ఆసుపత్రి దుస్తుల్లో చికిత్స పొందుతున్న పూజ నుదుట సింధూరం దిద్దాడు. అక్కడున్న పండితుడు వేద మంత్రాలు పఠిస్తూ, ఏడు అడుగుల (సప్తపది) ప్రమాణాలను చేయించారు. సింధూర ధారణ ముగిసిన తర్వాత వరుడు తిరిగి గ్రామానికి చేరుకుని మిగిలిన పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేశాడు. వరుడు సన్ని యాదవ్ ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆపద సమయంలో వధువును వదిలేయకుండా, ఆమెకు మనోధైర్యాన్ని ఇస్తూ ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న వరుడి గొప్ప మనసును చూసి అక్కడున్న వారందరూ కన్నీరు పెట్టు కున్నారు. ప్రస్తుతం పూజ కోలుకుంటోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది.
నెటిజన్ల ప్రశంసలు
పెళ్లి ఇంట్లో జరగాల్సిన వేడుక ఆసుపత్రికి మారినప్పటికీ, ఆపదలో ఉన్న వధువుకు తోడుగా నిలిచిన వరుడిని, అతని కుటుంబాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. "నిజమైన ప్రేమ అంటే ఇదే" అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 'హాస్పిటల్ వెడ్డింగ్' ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
UP: अस्पताल बना मंडप, आईसीयू में भरी मांग, फेरों से पहले निभा दिया वचन; इसलिए दुल्हन को कराना पड़ा था भर्तीhttps://t.co/xBpkJDPLOt
— Amar Ujala (@AmarUjalaNews) May 14, 2026
ఇదీ చదవండి: మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్!


