కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందే రాష్ట్రంలో రాజకీయ హింస పడగ విప్పింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బూత్ ప్రెసిడెంట్‌ను గుర్తుతెలియని దుండగులు అత్యంత క్రూరంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో బెంగాల్‌లో మరోసారి ఎన్నికల ముందే 'రక్తపాతం' మొదలైందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హరోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝుజుర్‌గాచా గ్రామంలో గురువారం ఉదయం టీఎంసీ నేత మొషీయుర్ కాజీ (38) మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. దేగంగాలోని చపాతల పంచాయతీ పరిధిలో గల గంగ్నియా నివాసి అయిన కాజీ బూత్ నంబర్ 178కి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దుండగులు కాజీ రెండు చేతులను నరికివేసి, శరీరంపై కత్తులతో విచక్షణారహితంగా గాయపరిచారు. మృతుడిని గుర్తించకుండా ఉండేందుకు ముఖంపై యాసిడ్ పోసినట్లు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో కాజీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. రాత్రంతా గాలించినా అతని ఆచూకీ లభించలేదు. చివరకు గురువారం ఉదయం ఆయన శవమై కనిపించారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందని కాజీ సోదరుడు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని టీఎంసీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, హరోవా రూరల్ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం కోసం బసిర్‌హాట్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పాత కక్షలా లేక రాజకీయ విరోధాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ..


