పుణె జిల్లాలోని దౌండ్‌లో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం స్కూల్ మార్కుల విషయంలో వచ్చిన గొడవ కారణంగా తొమ్మిదేళ్ల బాలికను ఆమె తండ్రే కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ప్రకంపనలు రేపింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు శాంతారామ్ దుర్యోధన్ చవాన్ కుమార్తె అనామిక (9 ఏళ్లు). ఇటీవల స్కూల్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో అనామిక తమ్ముడు (సవతి తల్లి కుమారుడు) సంస్కార్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా, అనామికకు రెండో ర్యాంక్ వచ్చింది. దీనిపై ఇంట్లో వాళ్లంతా ఆమెను ఎగతాళి చేశారు. ఆ అవమానంతో అనామిక తన తమ్ముడి మార్కుల జాబితాను మార్చేసింది. తద్వారా తనదే ఫస్ట్ ర్యాంక్ అని నిరూపించుకోవాలని చేసింది. అంతే .. ఇది తెలిసి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులను అర్థం చేసుకొని, అవగాహన కల్పించాల్సింది పోయి, విచక్షణ మరిచి తండ్రి శాంతారామ్, చెక్క కోసే యంత్రం (wood-cutting machine)తో చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు, మృతదేహాన్ని వస్త్రంతో చుట్టి నిప్పంటించాడు.
దీనిపై పోలీసులకు సమాచారం అందడంతోవారు ఘటనా స్థలానికి చేరుకుని, పాక్షికంగా కాలిపోయిన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని డీఎన్‌ఏ పరీక్షలు, తదుపరి విచారణ నిమిత్తం పుణేలోని సాసూన్ ఆసుపత్రికి తరలించారు.
ప్రధాన నిందితుడు తండ్రి శాంతారామ్ చవాన్‌తో పాటు, అతనితో కలిసి ఉంటున్న సవతి తల్లి చింకీ భోంస్లేను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేరం గురించి తెలిసి కూడా అధికారులకు సమాచారం ఇవ్వనందుకు ఆమెపై కూడా కేసు నమోదైంది. చిన్నారి మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొన సాగుతోంది.
మరోవైపు వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనల నేపత్యంలో పూణేలో పిల్లల భద్రతపై ఆందోళన తలెత్తింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి విషాదాలను నివారించేందుకు కఠినమైన చట్టాల అమలు, జవాబుదారీతనం, తక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఇదీ చదవండి: కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం.. ఎవరీయన?


