తమిళనాడు రాజకీయాలు హై-వోల్టేజ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. విజయ్ స్థాపించిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ హైడ్రామా మధ్య ‘జోహో’ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ చేసిన సంచలన డిమాండ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
అంతుచిక్కని మ్యాజిక్ ఫిగర్
తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 234 స్థానాలున్న అసెంబ్లీలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, 118 మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీధర్ వేంబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతర పార్టీల మద్దతుతో అతుకుల బొంతలా ఏర్పడే ప్రభుత్వం అస్థిరంగా ఉండే ప్రమాదం ఉందని, తమిళనాడుకు ఇంతకంటే మెరుగైన, బలమైన పాలన అవసరమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రపతి పాలన.. మళ్లీ ఎన్నికలు
రాష్ట్రంలో నెలకొన్న ఈ అనిశ్చితికి రాష్ట్రపతి పాలనే సరైన పరిష్కారమని శ్రీధర్ వేంబు సూచించారు. కఠినమైన నిబంధనల నడుమ మళ్లీ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ ఎన్నికలు జరిగితే విజయ్ సూపర్ మెజారిటీ సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దాన్ని అడ్డుకోవాలనుకుంటే డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి పోరాడాలని, బీజేపీ కూడా ఏ ఒక్క సీటు రాకపోయినా సరే, ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.
సస్పెన్స్‌లో గవర్నర్ నిర్ణయం
మరోవైపు, అధికార పీఠం దక్కించుకునేందుకు టీవీకే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించగా, వీసీకే, సీపీఐ, సీపీఎం (చెరో 2), పీఎంకే (4 సీట్లు), అన్నాడీఎంకే నేతలతోనూ మంతనాలు జరిపింది. బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసిన విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ చెబుతున్న మద్దతుపై గవర్నర్ ఇంకా పూర్తి నమ్మకంతో లేరని, తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టేందుకు టీవీకేకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: సీఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత


