వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎట్టకేలకు ఇరాన్.. ట్రంప్ డిమాండ్‌కు తలొగ్గినట్టు ఆయన వెల్లడించారు. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ అంగీకరించినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశముంది.
ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్‌హౌస్ వేదికగా మాట్లాడుతూ..‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదు. ఇరాన్ అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలకు ముప్పు. న్యూక్లియర్ వెపన్స్ ఉండటం ఇరాన్‌కు కూడా మంచిది కాదు. మా డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించింది. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ ఓకే చెప్పింది. ఇరాన్ అంగీకారంతో చర్చలు తుది దశకు చేరుకునట్టే’ అని వ్యాఖ్యలు చేశారు.
🚨 DONALD TRUMP CONFIRMS IRAN HAS AGREED TO NO NUCLEAR WEAPONS
This is HUGE! 🇺🇸
"Iran cannot have a nuclear weapon, and they won't. And they've agreed to that, among other things, yes!" 🔥 pic.twitter.com/3kgf8pkBeS— Eric Daugherty (@EricLDaugh) May 6, 2026
ట్రంప్ వార్నింగ్..
ఇదిలా ఉండగా.. అంతకుముందే ఇరాన్‌ను ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మూజ్‌లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందని వ్యాఖ్యనించారు.
ఇరాన్ కొత్త ప్లాన్..
మరోవైపు, హార్మూజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. "సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్" పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఇ-మెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై జరిగిన దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధం ఉన్న నౌకలను సురక్షితంగా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిని మరింత చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక ముసాయిదాను కూడా పరిశీలిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు, శత్రువులు కాని ఇతర దేశాల నౌకల ప్రయాణానికి 'టోల్ సిస్టమ్' తీసుకురావాలని భావిస్తోంది.


