అమృత్‌సర్: జంట పేలుళ్లతో పంజాబ్ ఉలిక్కిపడింది. మంగళవారం రాత్రి జలంధర్, అమృత్‌సర్ నగరాల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ముఖ్యంగా జలంధర్‌లోని అత్యంత రద్దీగా ఉండే బీఎస్‌ఎఫ్ చౌక్ సమీపంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు స్థానికులను, భద్రతా బలగాలను బెంబేలెత్తించేలా ఉన్నాయి.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న సీసీటీవీ ఫుటేజీలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక స్కూటర్ సమీపంలోనే ఈ పేలుడు సంభవించినట్లు స్పష్టంగా రికార్డ్ అయ్యింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ స్కూటర్‌ను పార్క్ చేసిన కొన్ని క్షణాల్లోనే, భారీ శబ్దంతో పేలుడు జరగడం, శిథిలాలు గాల్లోకి ఎగిరిపడటం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ స్కూటర్‌ను ఎవరు తీసుకువచ్చారు? పేలుడు పదార్థం ఏమిటి? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అమృత్‌సర్‌లో మరో పేలుడు
జలంధర్ పేలుడు ఘటనపై పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతుండగానే, అమృత్‌సర్‌లో మరో పేలుడు సంభవించడం భద్రతా సంస్థలను ఉరుకులు పరుగులు పెట్టించింది. పరిస్థితుల తీవ్రతను దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, భారీ ఎత్తున పోలీసు బలగాలను ఈ రెండు ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సరిహద్దు రాష్ట్రంలో భద్రతపై ఆందోళన
అతి తక్కువ వ్యవధిలోనే ఇలా వరుసగా పేలుళ్లు జరగడం సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అయితే, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావొద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దుశ్చర్య వెనుక ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ
జలంధర్‌లోని బీఎస్ఎఫ్ పంజాబ్ హెడ్‌క్వార్టర్స్ వెలుపల జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత ‘ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (కేఎల్‌ఏ) ప్రకటించుకుంది. ఫిబ్రవరిలో గురుదాస్‌పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మృతికి ప్రతీకారంగానే జలంధర్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడినట్లు కేఎల్‌ఏ ఒక లేఖ ద్వారా స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటనను అధికార వర్గాలు తోసిపుచ్చాయి. ఆ ఉగ్రవాద సంస్థ చెప్పిన ప్రాణనష్టం గణాంకాలు అవాస్తవమని స్పష్టం చేశాయి.
CCTV footage of the Jalandhar scooty blast outside BSF HQ. https://t.co/qBSvKJL2RO pic.twitter.com/cwCTkgq79V
— Elite Predators (@elitepredatorss) May 5, 2026


