న్యూఢిల్లీ: భారత రాజకీయ ముఖచిత్రంపై ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. అర్ధ శతాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల పాలన ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఓటమి పాలుకావడంతో, 50 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇది కామ్రేడ్ల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక పరిణామం అని విశ్లేషకులు అంటున్నారు.
కూలిపోయిన చివరి కంచుకోట
ఒకప్పుడు దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వామపక్షాలకు ఇంతకాలం కేరళ చివరి కంచుకోటగా మిగిలింది. 1977 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌ను, 1993 నుండి 2018 వరకు త్రిపురను పాలించిన కమ్యూనిస్టులు.. అక్కడ వరసగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల చేతిలో పరాజయం పాలయ్యారు. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే సంప్రదాయాన్ని 2021లో తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్న లెఫ్ట్ ఫ్రంట్, తాజా ఎన్నికల్లో మాత్రం తన ఆఖరి కోటను కోల్పోయింది. దీంతో 1977 తర్వాత తొలిసారిగా దేశం కమ్యూనిస్ట్ పాలన లేని శకంలోకి అడుగుపెట్టింది.
జాతీయ రాజకీయాల్లో చేజారిన పట్టు
కేరళలో ఎదురైన ఈ ఘోర పరాజయం వామపక్షాల జాతీయ రాజకీయ ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇన్నాళ్లూ కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల అండతో సీపీఎం, సీపీఐ, తదితర వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో తమ బలానికి మించి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఒకప్పుడు దేశ గతిని శాసించిన ఈ పార్టీలు.. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన దయనీయ స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ మూడు కీలక రాష్ట్రాల నుండి వామపక్షాలకు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే ఉండటం వారి రాజకీయ పతనానికి అద్దం పడుతోంది.
యూపీఏ కాలం నుంచి మొదలైన క్షీణత
కమ్యూనిస్టుల పతనం ఒక్కరోజులో జరిగింది కాదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో 59 స్థానాలు గెలుచుకుని యూపీఏ-1 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు, ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇండో-యూఎస్ అణు ఒప్పందం నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత, 2009లో వారి బలం 24 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత 2014లో 10, 2019లో ఐదు స్థానాలకు దిగజారింది. ప్రస్తుతం సీపీఎం, సీపీఐలకు లోక్‌సభలో ఆరుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, అందులో నలుగురు తమిళనాడులో డీఎంకే, ఒకరు రాజస్థాన్‌లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వారే కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ!


