ఎడచేరి: నేరస్తుడు ఎంతటి తెలివైన వాడైనా, చట్టం చేతికి చిక్కక తప్పదు అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. దశాబ్దాల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిన ఒక హంతకుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 24 ఏళ్ల పాటు పోలీసుల కళ్లుగప్పిన ఆ నేరస్తుడిని పట్టించింది ఒక పాత ఫోటో కావడం ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం.
నెత్తురోడిన 2001 నాటి గతం
కేరళలోని ఎడచేరి ప్రాంతానికి చెందిన జమీలా అనే మహిళ సెప్టెంబర్ 8, 2001న దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త హమీద్ ఆమె తలపై బలంగా కొట్టి, గొంతు నులిమి అత్యంత క్రూరంగా ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం అప్పట్లో పోలీసులు ఎంత గాలించినా ఎలాంటి ప్రయోజనం లేక పోయింది, దర్యాప్తుకు అవసరమైన ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు.
దర్యాప్తును మలుపు తిప్పిన పాత ఫోటో
రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఈ కేసు దర్యాప్తును పోలీసులు ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడు హమీద్‌కు సంబంధించిన ఒక పాత ఫోటో దర్యాప్తు అధికారుల కంటపడింది. ఈ ఒక్క ఫోటో ఆధారంగానే దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, నిందితుడు కాసర్‌గోడ్ జిల్లాలోని అదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తలదాచుకున్నట్లు గుర్తించి అతని కదలికలపై రహస్యంగా నిఘా ఉంచారు.
చేపలు అమ్ముతూ దొరికిపోయిన కిల్లర్
కేసులో పక్కా సమాచారం రాబట్టిన పోలీసులు చివరికి అతని ప్రస్తుత స్థావరాన్ని కనుగొన్నారు. హమీద్ ఇన్నేళ్లుగా అదూర్ సమీపంలోని బోవిక్కానంలో ఉంటూ, ఎవరికీ అనుమానం రాకుండా చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. అతని గుర్తింపు, నివాసాన్ని పక్కాగా నిర్ధారించుకున్న కోజికోడ్ పోలీసులు, 24 ఏళ్ల నిరీక్షణ తర్వాత అతనిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: పత్రికా స్వేచ్ఛ.. దాయాది కన్నా దిగువకు భారత్


