చిన్నారిపై వార్డెన్, వంటవాని పైశాచికం | 12 Year Old Boy Hung Upside Down Over rs 500 Theft Suspicion | Sakshi
Sakshi News home page

చిన్నారిపై వార్డెన్, వంటవాని పైశాచికం

May 2 2026 1:37 PM | Updated on May 2 2026 1:37 PM

12 Year Old Boy Hung Upside Down Over rs 500 Theft Suspicion

కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 500 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో 12 ఏళ్ల పసివాడిని తలకిందులుగా వేలాడదీసి, పైశాచికంగా హింసించిన ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్ సిబ్బంది అమానుషత్వం అందరినీ కలచివేసింది. ఈ అమానవీయ ఘటనకు పాల్పడిన వార్డెన్, వంట మనిషిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

వంటవాని కిరాతకం.. వార్డెన్ వత్తాసు
పునలూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్న 12 ఏళ్ల విద్యార్థిపై అక్కడి వంటవాడి కన్ను పడింది. తన దగ్గర ఉన్న రూ. 500 దొంగిలించాడంటూ ఆ బాలుడిపై నింద మోపాడు. అనుమానంతో ఆ పసివాడిని శారీరకంగా తీవ్రంగా హింసించాడు. అంతటితో ఆగకుండా బాలుడిని అత్యంత పాశవికంగా తలకిందులుగా వేలాడదీసి, తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఈ దారుణ కాండలో బాలుడిని రక్షించాల్సిన స్కూల్ వార్డెన్ కూడా వంటవాడికి సహకరించడం గమనార్హం.

తండ్రి ఫిర్యాదుతో..
కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిబ్బంది చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన ఆ బాలుడు.. తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని రోదిస్తూ చెప్పాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలుడి తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. స్కూల్ సిబ్బంది పైశాచికత్వంపై ఆధారాలతో సహా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.

నిందితుల అరెస్ట్.. సురక్షితంగా బాలుడు
తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేశారు. బాలుడిని హింసించిన వంటవాడిని, అతనికి సహకరించిన వార్డెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టాల కింద వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ దాడి వల్ల బాలుడి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement