డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఒకే ఒక్క సీనియర్ నేత చేతుల్లోకి వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. ఆయనే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) అధినేత హగ్రామా మొహిలారీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాడో అస్సాంలో హగ్రామా మొహిలారీ అదే పంథాలో కనిపిస్తున్నారు.
అత్యంత శక్తివంతమైన నేత
ఒకప్పుడు బద్ధ శత్రువుగా ఉన్న అధికార బీజేపీతో ఇప్పుడు మళ్లీ చేతులు కలిపి, తదుపరి ప్రభుత్వాన్ని శాసించే కింగ్ మేకర్‌గా హగ్రామా మొహిలారీ అవతరించారు. పశ్చిమ అస్సాంలోని బోడోలాండ్ ప్రత్యేక స్వయంప్రతిపత్తి ప్రాంతంలో మొహిలారీ అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఒకప్పుడు సాయుధ తిరుగుబాటుదారునిగా ఉన్న ఆయన, 2003లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని, ప్రధాన స్రవంతిలో కలిసిపోయి, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఒక ప్రత్యేక కౌన్సిల్ ద్వారా ఐదు జిల్లాలను పరిపాలిస్తూ, రాష్ట్ర అసెంబ్లీలోని కీలకమైన 15 స్థానాలపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
బీజేపీకి అత్యవసరమైన ‘సోషల్ ఇంజనీరింగ్’
మొహిలారీ అసలు బలం సమాజంలోని భిన్న వర్గాలను ఏకం చేయగలగడమే. కేవలం ఒకే సామాజిక వర్గానికి పరిమితం కాకుండా గిరిజనులు, బెంగాలీ మూలాలున్న ముస్లిం మైనారిటీల మద్దతు కూడగట్టుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ ‘సోషల్ ఇంజనీరింగ్’ వ్యూహమే బీజేపీకి ఆయనను అత్యవసర భాగస్వామిగా మార్చింది. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, మొహిలారీ అండతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు ఆశిస్తున్నారు.
నిధుల కోసమే ఈ రాజకీయ రాజీ?
బీజేపీ, బీపీఎఫ్‌ల మధ్య సంబంధం ఎప్పుడూ ఒకేలా లేదు. కొన్నేళ్ల క్రితం మొహిలారీని జైలుకు పంపుతామని అగ్రశ్రేణి బీజేపీ నేతలు హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరు పార్టీలు పాత పగలు మరిచి ఒక ‘రాజకీయ రాజీ’కి వచ్చాయి. గిరిజన కౌన్సిల్స్ మనుగడకు, అభివృద్ధికి ప్రభుత్వ నిధులు అత్యవసరం కావడంతో, అధికార పార్టీకి దగ్గరగా ఉండటం మొహిలారీకి కూడా తప్పనిసరి. 85 శాతానికి పైగా భారీ పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మొహిలారీ మళ్లీ తిరుగులేని నాయకునిగా ఎదుగుతారా లేదా అనేది ఓట్ల లెక్కింపుతో తేలనుంది.
ఇది కూడా చదవండి: మాలి రక్షణ మంత్రి దారుణ హత్య


