ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఆస్తి కేసు ఓడి పోయాననే ఆగ్రహంతో ఒక వ్యక్తి తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.
ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉంటున్న జలవనరుల శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జాఫర్కమరుద్దీన్ సయ్యద్ పటేల్‌కు, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న కుమారుడు అబ్దుల్ రెహమాన్‌తో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, వారిపై దాడిచేసేవాడు. దీంతో బాధితుడు జాఫర్ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది, ఇంటి కోసం కేసు వేయడానికి ముందు పూణేలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు.
కుమారుడి ప్రవర్తనతో వేగలేక, అతడిని ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు న్యాయపోరాటం చేశాడు. చివరికి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కుమారుడిని ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఆస్తి యాజమాన్యాన్ని తండ్రికి పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిన కొడుకు ఉత్తర్వులతో కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జాఫర్‌పై ఎటాక్ చేశాడు. తండ్రి ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపాడు. పటేల్‌తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


