ఎలుక ఎంత పనిచేసింది.. 10 లక్షల వజ్రాల నగలు.. | Rat Steals Rs 10 Lakh Worth of Diamond Jewellery At Karnataka | Sakshi
Sakshi News home page

ఎలుక ఎంత పనిచేసింది.. 10 లక్షల వజ్రాల నగలు..

Jul 31 2026 7:47 AM | Updated on Jul 31 2026 8:43 AM

Rat Steals Rs 10 Lakh Worth of Diamond Jewellery At Karnataka

సాక్షి, బెంగళూరు: తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి. దీంతో నగల దుకాణం యజమాని గుండె ఆగినంత పనైంది. చివరకు సీసీటీవీ ఫుటేజీ చూస్తే అసలు దొంగను చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ 'మాస్టర్‌మైండ్' ఒక చిన్న ఎలుక!

కర్ణాటకలోని తుమకూరు నగరంలోని కాల్టెక్స్ సర్కిల్‌లో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని, కౌంటర్‌పై ఉన్న 50 గ్రాములకు పైగా వజ్రాల నగలు, 10 ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు.

ఎవరూ లోపలికి రాకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రాత్రి వేళ గోడలోని చిన్న రంధ్రం గుండా లోపలికి వచ్చిన ఓ ఎలుక, ఒక్కో నగను నోటితో లాక్కెళ్లి తన బొరియలో దాచిపెడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఎలుక జాడను అనుసరించి బొరియను తవ్వి చూడగా.. కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు సహా అన్ని వజ్రాల నగలు అక్కడే లభించాయి. దీంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. నగలన్నీ తిరిగి దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సినిమాల్లోనే కనిపించే సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement