-
ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. -
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్ఎస్ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్ఎంసీ వద్ద మోహరించాయి. -
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తాను ఏది మాట్లాడినా సరే.. అది సంచలనమే అవుతుందని చెప్పుకునే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా.. ఆయనను చూడటానికి జనం ఆశగా ఉన్నారంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.‘‘కేసీఆర్ సభకు జనం భారీగా రావొచ్చు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదు. ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసినట్టు లేదు. ఇదే విషయంలో సీఎస్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భూమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పునరాలోచన చేస్తుంది.’’ అంటూ ఆయన పేర్కొన్నారు.కాగా, ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపడానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. -
ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆసక్తికర కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. చంద్రబాబు మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు. ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలి. కనీసం కేసీఆర్ కుటుంబం నుండి కాకుండా వేరే వెలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా?. కేటీఆర్‌కి దమ్ముంటే పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలి.అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు?. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో ఆయనకే తెలియాలి. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకా? టీఆర్ఎస్ పార్టీకా?. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి రెండేళ్లు అయింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ కొడుకు విలన్. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అయితే పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా?.కమలం పువ్వు కాడికి గులాబీ పువ్వును అంటగడుతున్నారు. చంద్రబాబు, మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి మాకు సారూప్యత ఉందని కేటీఆర్ చెబుతున్నారు. హెచ్‌సీయూ విషయంలో బీఆర్ఎస్ హ్యాండిల్స్ నుండి ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారో చెప్పాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని, చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తొలుత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో బీ(టీ)ఆర్ఎస్ పురుడు పోసుకుంది. ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడి తెలంగాణను సాధించడంతో పాటు అధికారాన్ని చేపట్టి అద్భుతమైన పాలన అందించింది. ప్రభుత్వంగా, ప్రతిపక్షంగా హిమాలయాల స్థాయికి తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్. రెండున్నర దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటోంది. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా..’ అని కేటీఆర్ చెప్పారు. సభా స్థలికి నలుమూలలా పార్కింగ్ ఏర్పాట్లు‘రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. 10 లక్షల చొప్పున వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లుసభకు హాజరయ్యే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం. వీటిని ఇంకా పెంచుతాం. వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు మీద నమ్మకం లేదు. అందువల్ల 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. 2 వేల మంది వలంటీర్లు సభకు వచ్చే వారికి సహకరిస్తారు..’ అని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట రైతులకు సలాం‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూడాలి. ఆయన మాట వినాలన్న ఆత్రుతతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడదాం. కేసీఆర్ సందేశాన్ని గులాబీ సైనికులు ప్రతీ గ్రామానికీ చేర్చాలి. 27వ తేదీన తెలంగాణలోని 12,796 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలు ఎగురవేసి కదం తొక్కిన ఉత్సాహంతో చలో వరంగల్ సభకు చేరుకోవాలి. మండుటెండలను లెక్కచేయకుండా రజతోత్సవ సభ కోసం ఎడ్లబండ్లలో బయలుదేరిన సూర్యాపేట రైతులకు సలాం చేస్తున్నా. మనమందరం వారిని ఆదర్శంగా తీసుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతోపాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, చివరి రెండు గంటల్లో ఎవరూ రాలేదు. మొత్తం 112 మంది ఓటర్లలో.. 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి ఎన్.గౌతమ్‌రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులెవరూ పోలింగ్‌లో పాల్గొనలేదు. పార్టీల వారీగా పోలింగ్‌కు హాజరైన ఓటర్ల సంఖ్యను బట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో ఉండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీలకు గెలిచేంత ఓటర్ల సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. చివరి క్షణం వరకూ తమకు ఇతర పార్టీల ఓట్లు పడతాయన్న బీజేపీ, పోలింగ్ అనంతరం సైతం కాంగ్రెస్ ఓట్లు కొన్ని తమకు పడ్డట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎం తొత్తుగా మారిందని బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు బయటపడ్డాయని, ఎంఐఎంకు వాటి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి నల్ల దుస్తులతో పోలింగ్‌కు హాజరయ్యారు. మిగతా బీజేపీ ఓటర్లు చేతులకు నల్లరిబ్బన్లు చుట్టుకొని వచ్చారు. -
65 దాటితే 'నో' పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.అయితే, జానారెడ్డి ఎపిసోడ్‌పై రాజగోపాల్‌రెడ్డి.. బుధవారం స్పందించారు. ‘‘జానారెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్‌పై ఒక సభలో మాట్లాడాను. మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి గట్టి హెచ్చరికలే చేశారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది...మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. -
జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్: కేటీఆర్
హన్మకొండ, సాక్షి: తెలంగాణలో కష్టం అనే మాట వినబడితే.. బాధితులకు అండగా నిలబడేది గులాబీ జెండా ఒక్కటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు అన్నారు. బుధవారం ఎల్కతుర్తితో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ రజతోత్సవ సభా ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. ముందుగా.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీఆర్ఎస్ నేతలంతా నివాళులర్పించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రజల్ని రెచ్చగొట్టడానికో, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికి కాదని.. 25 వసంతాలు పూర్తి చేసుకున్నందున జరుపుకొనే వేడుక మాత్రమేనని తెలిపారాయన. ఇక్కడ 1,250 ఎకరాల్లో సభా స్థలం ఉండగా.. వెయ్యి ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించాం. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నాం. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య తాగునీటి వసతి కల్పిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుపై నమ్మకం లేనందున జెనరేటర్లు ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ చరిత్రలో ఇది భారీ బహిరంగ సభ కాబోతుంది. గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంగా, ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ అన్నారు. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి అన్ని వర్గాలను సమీకరించి రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్. గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందనే పద్ధతిలో ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్‌లా మారింది’’ అని కేటీఆర్ అన్నారు. -
HYD: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియ్ సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించనున్నారుఉదయం 10 గంటల వరకు 50 శాతం ఓట్లు నమోదు అవ్వగా, 45 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ AVN రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ కార్పొరేటర్లు ఓటు వేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. డ్యూటీలో 250 మంది పోలింగ్ సిబ్బంది.. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. పోటీలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు.మొత్తం ఓటర్లు 112. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరిలో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్‌కు 14. సరిపడ సంఖ్య బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది. -
దెబ్బతిన్నా తిరిగి లేస్తాం: కేటీఆర్
శూన్యం నుంచి సునామీని సృష్టించి లక్ష్యాన్ని చేరుకున్న అసాధారణ నేత కేసీఆర్. ఆయన మార్గదర్శకత్వంలో పని చేయడం పూర్వజన్మ సుకృతం. బీఆర్ఎస్ మాత్రమే రాజీ పడకుండా కొట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే భావన ప్రజల్లో బలంగా ఉంది..రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. బీఆర్ఎస్తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీ లు తమ సొంత రాష్ట్రాల్లో పుంజుకుని మరింత బలంగా ఎదుగుతాయని అన్నారు. దెబ్బతిన్నా తిరిగి నిల్చుంటామని స్పష్టం చేశారు. తమకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని, తిరిగి ప్రజాదరణ పొందుతామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని, తెలంగాణలో బీజేపీతో కలిసి టీడీపీ, పవన్ కల్యాణ్ వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కుల, మతాలు అనే తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడే పార్టీ లు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ యే రక్షణ కవచం. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత లాభం.’’ఇక్కడి ప్రజలపై మాకు ఉన్న ప్రేమలో అణువంత కూడా ఢిల్లీ పార్టీలకు ఉండదు. అందుకే 25 ఏళ్లుగా తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను మరో 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ప్రజలు కాపాడుకోవాలి..’అని కేటీఆర్ అన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీగా అవతరించి బీఆర్ఎస్గా కొనసాగుతున్న పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం, పదేళ్ల పాలన, రజతోత్సవాలు, వర్తమాన రాజకీయాలు, తదితర అంశాలపై ఆయన స్పందించారు.సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గాపార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా చూస్తున్నారు? కేటీఆర్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ లు రజతోత్సవాలు నిర్వహించుకోవడం ఆషామాషీ కాదు. అధికారం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు చాలా పార్టీ లు ఒక లక్ష్యం కోసం ప్రారంభమై గమ్యాన్ని చేరుకోక మునుపే మూత పడతాయి. ‘‘టీఆర్ఎస్ పిడికెడు మందితో ప్రారంభమై 60 లక్షల మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్గా ఎదిగింది. ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం..ఇలా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా వారి గొంతుకగా నిలుస్తున్నాం. మరో 50 ఏళ్ల పాటు పార్టీ నిలిచేలా చేసే అద్భుతమైన నాయకత్వం మా పార్టీ సొంతం. 25 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ పేరు మాత్రమే మారింది. మా జెండా, ఎజెండా, గుర్తు, నాయకుడు, సిద్ధాంతం మారలేదు..’’ప్రజల బాగోగులు ఎజెండాగా పని చేయడమే మా పార్టీ భావజాలంసాక్షి: ఉద్యమ సమయంలో సవాళ్ల నడుమసాగిన ప్రయాణం ఎలా అనిపించింది? కేటీఆర్: మొండితనం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతంపై రాజీ పడకపోవడం, నిజాయితీ.. ఇవే కేసీఆర్ ఆస్తులు. ధన, కుల, మీడియా బలం లేకున్నా పార్టీని ప్రారంభించి తెలంగాణ అస్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. అపజయాలు, ఎదురుదెబ్బలు, అవమానాలతో రాటుదేలిన కేసీఆర్‌కు ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకునే శక్తి ఉంది. పార్టీని ప్రారంభించింది మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ చరిత్ర మార్చిన నాయకుడు ఆయన. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సాధించిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. పదేళ్లు అధికారంలో ఉన్నదాని కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది.కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ఎందుకు వెనక్కి తగ్గారు? పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియాఇంటికి వెళ్లి పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. సోనియా సూచన మేరకు దిగ్విజయ్ సింగ్‌తో విలీనంపై జరిపిన సంప్రదింపుల్లో కాంగ్రెస్నిజాయితీగా స్పందించలేదు. తనను నమ్ముకున్న వందలాది మందినాయకులు, వేలాది మంది కార్యకర్తల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకపోవడంతో విలీనం ప్రతిపాదనను కేసీఆర్ విరమించుకున్నారు. తమిళనాడులో డీఎంకే తరహాలో తెలంగాణకు ఒకగొంతు ఉండాలని పౌర సమాజం నుంచి ఒత్తిడి కూడా రావడంతో స్వతంత్రంగా ఉండేందుకే కేసీఆర్ ఇష్టపడ్డారు.సాక్షి: కొత్త రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు? కేటీఆర్: జమిలి ఎన్నికల పేరిట రెండు జాతీయ పార్టీ లు నాటకం ఆడుతున్న సమయంలో తెలంగాణను దేశం ముందు ఆవిష్కరించేందుకు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ఆరు నెలల పదవీ కాలాన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళితే 88 సీట్లతో అసాధారణ గెలుపు నమోదు చేశాం. ఇది కేసీఆర్ సమర్థతకు ప్రజలు ఇచ్చిన సరి్టఫికెట్. రెండో టర్మ్‌లో పెద్ద నోట్ల రద్దు, కరోనాతో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా సమర్థవంతమైన నాయకత్వం అందించాం. మూడోసారి కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయినా మేము తుడిచి పెట్టుకుపోలేదు. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మోడల్ సాధించిందేమిటి? 2014లో తెలంగాణలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి విద్యుత్, సాగునీరు, తాగునీరు సహా అనేక అంశాల్లో తన దూరదృష్టితో కేసీఆర్ సమగ్ర, సమతుల్య, సమీకృత అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు మేరకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. భవిష్యత్తులోనూ జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకున్నారా? పదేళ్ల పాలనలో మేము చేసిన మంచి పనులను సరిగా ప్రచారం చేసుకోలేక పోయాం. విప్లవాత్మక పథకాలు అమలు చేసినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. నాతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఓటమికి కారణం. మరోవైపు కాంగ్రెస్ ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడంతో ప్రజలు మోసపోయారు. మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం తదితరాలు ప్రభావం చూపాయి. రాజకీయ పునరేకీకరణతో బహుళ నాయకత్వ సమస్యతో ఓటమి చెందామనే వాదన కూడా సరికాదు. ఇది తాత్కాలికమైన చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. శాశ్వతంగా ఇదే పరిస్థితి కొనసాగదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాదరణ రుజువు చేసుకుంటాం. ఫామ్‌హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ అనే విమర్శలను ఎలా చూస్తారు? అధికారం చేతిలో పెట్టినా రాష్ట్రాన్ని నడపలేక చేసే విమర్శలు అవి. కేసీఆర్ ఆయన నియోజకవర్గంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో ఇటీవల ఫామ్‌హౌస్ పాలన కావాలా, కాంగ్రెస్ పాలన కావాలా అని పోల్ పెడితే ప్రజలు ఫామ్‌హౌస్ వైపు మొగ్గు చూపారు. ఇక సీఎం రేవంత్ కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం. పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ బిడ్డగా కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌పై పనిభారం తగ్గించేందుకు 2018 డిసెంబర్లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆరున్నరేళ్లలో 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, 60 లక్షల సభ్యత్వం, అనేక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం. అధికారం కోల్పోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నా. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, కేసీఆర్‌కు అనారోగ్యం వంటి సమస్యలు ఎదురైనా కేడర్‌లో విశ్వాసం కల్పించాం. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించేలా పనిచేస్తా.పార్టీ రజతోత్సవంసందర్భంగా మీ సందేశం తెలంగాణ ఇంటి పార్టీ మాది.రాబోయే రోజుల్లో విద్యార్థి, యువజన, మహిళా విభాగాలను బలోపేతం చేసి సంస్థాగతంగా బలోపేతం చేస్తాం.కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేంత వరకు ఒక కార్యకర్తగా పనిచేస్తా.నాతో కలిసి వచ్చే పార్టీ శ్రేణులనుకంటికి రెప్పలా కాపాడుకుంటా. బీజేపీ నుంచి కొత్త పోటీఎదురవుతోందా?కేసీఆర్ స్థాయి రాష్ట్ర రాజకీయాల్లో ఏ ఇతర నేతకూ లేదు. మేం బ్యాగులు, చెప్పులు మోసే నాయకులం కాదు. ఎవరికీ తలవంచకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ దశాబ్దాల కల నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటలేదు. మోదీకి ఆదరణ క్రమంగాతగ్గుతున్న తరుణంలో ఆ పార్టీని పోటీగా భావించడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీ సాధిస్తుంది. మరోవైపు రేవంత్.. సొంతూరుకు చెందిన మాజీ సర్పంచ్ మొదలుకుని రాష్ట్రమాజీ ముఖ్యమంత్రిపైనా ఆరోపణలతో అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.ప్రజల దృష్టిలో కాంగ్రెస్, బీజేపీ పలుచన అవుతున్నాయి.−కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
‘మా ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని వదిలిపెట్టం’.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc) ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.ఎన్హెచ్ఆర్సీ నివేదిక విడుదలతో లగచర్ల బాధితులు హైదరాబాద్ నందినగర్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలి. లగచర్లలో మహిళలపై దాడి చేశారు. బాధితుల పకక్షాన ఎన్హెచ్ఆర్సీని సంప్రదించాం. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతాం. లగచర్లలో ఓవర్ యాక్షన్ చేసిన అధికారులను వదలం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తాం’ అని హెచ్చరించారు. -
అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్
హైదరాబాద్: గత పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. అదే తెలంగాణకు కేంద్రం చేసింది అనే దానిపై చర్చకు వస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అబిడ్స్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా కేటీఆర్? అని ఈటల ప్రశ్నించారు.‘కాంగ్రెస్ నైజం దేశ వ్యాప్తంగా బట్టబయలైంది. మరొకవైపు కార్పోరేట్లరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయొద్దని బీఆర్ఎస్ అప్రజాస్వామిక పిలుపునిచ్చింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి. కేంద్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి. మజ్లీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు.ముఖ్యమంత్రి గత విదేశీ పర్యటనలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ కనపడటలేవు. ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఉడిపోతున్నాయి. కేసీఆర్ హయంలోనే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యే వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు’ అని ఈటల విమర్శించారు.. -
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
హైదరాబాద్,సాక్షి: తీన్మార్ మల్లన్న ఖబడ్దార్. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి నోరు జారితే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. గత వారం నిర్వహించిన బీసీ చైతన్య సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలపై సోమవారం తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. సీఎం రేవంత్‌ను విమర్శించే స్థాయి తీర్మార్ మల్లన్నకు లేదన్నారు. దమ్ముంటే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) ఇంకా ఏమన్నారంటే.. 'తెలంగాణ రాజకీయ వ్యభిచారి ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్నే. నేను రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల నాయకత్వం పెంపొందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఎన్నిసార్లు రేవంత్ కాళ్ళు మొక్కావో గుర్తులేదా. అధిష్టానం రాష్ట్ర రాజకీయ నాయకులను ఒప్పించి రేవంత్ నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు.స్పీకర్ ఫార్మార్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నీ దమ్ము ఏంటో నిరూపించుకో. ఎన్ని పార్టీలు మారావో గుర్తుందా. బీసీల ముసుగులో చిల్లర పనులు చేస్తూ బిసిలను ఇబ్బందులకు గురి చేయడానికి సిగ్గుండాలి. నీది నా కంటే దిగువ స్థాయి.. సీఎం రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా నీ స్థాయికి తగ్గట్లు మాట్లాడటం నేర్చుకో. బీజేపీ నేతలకు గులాంగిరి చేసుకో. ఉదయం బీజేపీ, సాయంత్రం బీఆర్ఎస్ భజన చేసుకో’ అని ధ్వజమెత్తారు.చదవండి: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట -
కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం
సాక్షి, హైదరాబాద్/ అత్తాపూర్: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవటం తెలంగాణ సమాజానికి చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవలసిన బాధ్యత తెలంగాణ సమాజంపైనే ఉందని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు తరలివచ్చి కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు.వారికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్లీ వెనక్కు తీసుకెళ్తోందని మండిపడ్డారు. ‘మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం తక్కువ. మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది.స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఈ రికార్డును ఎవరూ చెరపలేరు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్నా అనుకుంటే అది వారి అజ్ఞానం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పరు’అని కేటీఆర్ అన్నారు. బీజేపీకి మత పిచ్చి లేపడమే తెలుసు ‘దేశంలో మత పిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ వెనక్కి పోయినట్టే.. మోదీ నాయకత్వంలో దేశం వెనక్కి పోతుందని అన్నారు. ‘మత పిచ్చి మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారట! 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారట. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయితీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పెడుతున్నారు? రాజకీయం కోసం దేశాన్ని విడగొడుతున్నారు. మంచి పనులు చేసి ఓట్లు అడగాలి. హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరాం, మోదీ.. ఈ ఐదు పదాలు చెప్పకుండా ఓట్లు అడిగేటోళ్లు ఎవరైనా ఉన్నారా? తెలంగాణకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ శత్రువులే’అని కేటీఆర్ విమర్శించారు. గరీబోళ్ల ఇండ్లపైకే హైడ్రా బుల్డోజర్లు హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘హైడ్రాతో ఆస్తులు కాపాడుతాం అంటున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రర్‌రావు, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇళ్లను మాత్రం ముట్టరు. అల్కగా దొరికే గరీబోని పైకి బుల్డోజర్లు పంపుతున్నారు. రైతుబంధు, తులం బంగారం, రుణమాఫీ, స్కూటీలకు పైసల్లేవు కానీ.. మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు ఇస్తారట’అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణలో జనజాతర.. ఇది మన జాతర’
ఖమ్మం: వచ్చేవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభతో తెలంగాణలో ఒక ఉత్సవ వాతావరణం నెలకొందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఖమ్మంలో మాట్లాడిన కవిత.. తెలంగాణలో జన జాతర, ఇది మన జాతర అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారని, కానీ ధాన్యం తడిసిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. కనీసం రైతుల కష్టాల మీద ఒక్క రివ్యూ కూడా చేయటం లేదు. రైతుల కష్టాల మీద ఈ ప్రభుత్వం కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఈ జిల్లాతోనే ఉన్నారు. డిప్యూటీ సీఎం అంటే ఎంత బాధ్యత .. ఆలోచన ఉండాలి...? , ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకుంటున్నారు .. తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల జిల్లా అని పేరు ఉంది. ప్రశ్నించే కమ్యూనిస్టు కూడా ప్రశ్నించకపోవడంతో కమ్యూనిజం మీద నమ్మకం సన్నగిల్లింది.ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు పెద్దలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్లే ప్రశ్నించడం లేదా.?. తెలంగాణ ఏర్పడిన 9 /10 నెలల్లోనే ఇదే జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్టు కట్టించి 60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడి 15/ 16 నెలలు అయింది . ఒక కొత్త పథకం లేదు. కొత్త ప్రాజెక్టు లేదు. ముఖ్యమంత్రి గారి పాలన గురించి, మాటల గురించి చెప్పనవసరంలేదు. నేను ఖమ్మం రాగానే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన బాధను వ్యక్తం చేశాడు. గ్రామ శాఖ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ పర్యటన చేస్తున్నారు తప్ప .. వాన పడి రాష్ట్ర రైతుల అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదు.రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ. 20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా . ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం చెల్లించాలి . అధికారులను అప్రమత్తం చేయాలి. రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. మంత్రులు ములుగు పర్యటనకు పోతే.. ఆసుపత్రిలో దుస్థితి వల్ల చనిపోయిన పసిపాపను చూపించారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏ ఒక్క పని అమలు చేయలేదు. రైతు రుణమాఫీ సంపూర్ణం చేశామని ఘోరమైన అబద్ధాలు చెబుతున్నారు. రైతు కూలీలకు ఇస్తామన్న రైతుభరోసా పథకం ఏది..?? , కేసీఆర్ ఇచ్చిన ప్రతీ మాటను నెరవేర్చారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మన్ననలు కోల్పోయింది.ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రతినిధులను ప్రజలు ఎక్కడికి నిలదీయాలి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ను ఎంకరేజ్ చేయండి. ఏప్రిల్ 27న టిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.. బలమైన నాయకత్వం ఉన్న ఖమ్మం జిల్లా నుంచి ప్రజానికం పెద్ద ఎత్తున తరలిరావాలని ఆహ్వానిస్తున్న’ అని కవిత విజ్ఞప్తిచేశారు. . -
అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే
పెద్దపల్లి జిల్లా,సాక్షి: పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాం. అలాంటి బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది. టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం పార్టీది. న్యాయస్థానాలపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది. నిన్న జరిగిన మీటింగుకి ఖర్మ, కర్త, క్రియ రేవంత్ రెడ్డియే..మీటింగు కోసం నిధులు సమకూర్చింది కూడా రేవంత్ రెడ్డియే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు నాటకాలాడుతున్నాయి. మంచి ఉద్దేశంతో బిల్ తీసుకువస్తే మత కోణంలో ప్రతిపక్షాలు విద్వేశాలు రెచ్చగొడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి. రైతుల విషయాన్ని పక్కన పెట్టి వక్ఫ్ మీటింగు కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తాపత్రయ పడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
రాజేంద్రనగర్, చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు: కేటీఆర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నిట్టనిలువునా మోసపోయామని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, తెలంగాణలోని రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్‌కు వచ్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలవాలి. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటుందా?.కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ గుండెలు జారేలా బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ సభకు కదలాలి. వరంగల్‌లో 1250 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. వరంగల్ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు. -
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్ఎస్టేట్ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.ఓ హత్యకేసులో ప్రశాంత్‌రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బీఆర్ఎస్.. రాం రాం! .. మరి కాంగ్రెస్ వైఖరేమిటో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయంగా మారనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నిక జరగనుంది. తగిన బలం లేకపోయినప్పటికీ, బీజేపీ తమ అభ్యరి్థని బరిలో దింపడంతో పోలింగ్ అనివార్యంగా మారింది. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. కాంగ్రెస్‌కు సంబంధించి ఎంఐఎంకు స్నేహహస్తం కోసమే పోటీకి దింపలేదని కూడా ప్రచారంలో ఉంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కలిసిమెలిసి గెలిచిన ఆ రెండు పారీ్టలూ ఈ ఎన్నికలోనూ అదే వైఖరి పాటించనున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నిక సందర్భంగా ఇచి్చన హామీ మేరకు సైతం కాంగ్రెస్ రంగంలో దిగలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బీఆర్ఎస్ దూరం.. ఎంఐఎంతో విభేదాల్లేని బీఆర్ఎస్.. ఆ పార్టీకికి మద్దతు ఇస్తుందా, లేక పోలింగ్‌కు గైర్హాజరవుతుందా అని ఆలోచిస్తున్న రాజకీయ పరిశీలకుల ఆలోచనలకు తెర దించుతూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. విప్ జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాంగ్రెస్ దారెటు ? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొంటుందా, లేక అది సైతం పోలింగ్‌కు దూరంగా ఉంటుందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఎంఐఎంకు వచ్చే నష్టమంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓట్లేసే అవకాశం లేదు. మిగిలింది ఎంఐఎం మాత్రమే అయినందున కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొంటే ఆ పార్టీ మెజార్టీ పెరుగుతుందే తప్ప దానికి ఓటమి అంటూ లేదని చెబుతున్నారు. మొత్తం 112 మంది ఓటర్లలో బీజేపీకి 25 ఓటర్ల బలం ఉండగా, ఎంఐఎం బలం 49గా ఉంది. అంటే దాదాపు రెట్టింపు బలం. కాబట్టి ఎంఐఎం గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అనూహ్య పరిణామం ఏమైనా జరిగేనా? ఇదే తరుణంలో అనూహ్యంగా ఏమైనా జరగనుందా ? అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అందుకు కారణం ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలో గెలవాలనే తలంపుతోనే బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపిందని చెబుతున్నారు. అంతే కాదు.. పోలింగ్‌కు సంబంధించి సన్నాహక సమావేశం, మాక్‌పోలింగ్ వంటివి సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పారీ్టకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడూ ఒకటేనన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో లేవని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మరో కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం ఎంఐఎంను ఓడించేందుకు పార్టీలకతీతంగా ఓట్లేయాలని పిలుపునిచ్చారు. విప్ ఉండదా? ఈ నేపథ్యంలోనే తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తుందని కేటీఆర్ చెబుతున్నారు. ఈ ఎన్నిక నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సమాచారం మేరకు అసలు విప్ అంటూ ఉండదు. అయినా విప్ జారీ చేస్తామనడం పారీ్టవారు కట్టుతప్పకుండా ఉండటానికేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, బీజేపీ తగిన వ్యూహరచన చేసిందని వినిపిస్తోంది. గెలుస్తామనే ధీమాలోనే ఆ పార్టీ ఉందని, అందుకే ఈ ఎన్నిక కోసమే గ్రేటర్ పరిధిలోని ఎంపీలు కిషన్‌రెడ్డితో పాటు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఎక్స్‌అఫీíÙయో సభ్యులుగా ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రోజుకో మలుపుతో ‘స్థానిక’ ఎన్నిక రసకందాయంగా మారింది. పోలింగ్ వరకు ఇంకా ఏం జరగనుందోనన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. -
బీఆర్ఎస్ నేతల కోసమే ధరణి
నాగర్‌కర్నూల్/గద్వాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు గోడల మధ్య కూర్చొని, నలుగురి స్వార్థం కోసం రూపొందించిన చట్టమే ధరణి అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు చేయలేదని వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారని ఆరోపించారు.ఎప్పుడైనా, ఏ నియోజకవర్గంలోనైనా ధరణిపై సమావేశం పెట్టారా? అన్ని ప్రశ్నించారు. ఒకవేళ సమావేశం పెట్టి ఉంటే నాయకుల వీపులు చింతపండయ్యేవని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, వారి బంధువుల కోసమే ధరణి తెచ్చారని ఆరోపించారు. ధరణిలో రాత్రికి రాత్రే భూ యజమానుల పేర్లు మారిపోయేవని తెలిపారు. అన్ని సమస్యలకు పరిష్కారంగానే భూ భారతి చట్టం తెచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీ..?గద్వాల జిల్లా ధరూరు మండలంలో మంత్రి పర్యటన ఉద్రిక్తతలు, అలకల మధ్య సాగింది. అవగాహన సదస్సు పూర్తిగా అధికారిక కార్యక్రమం కావడంతో అధికారులు ప్రొటోకాల్ పాటించారు. దీంతో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సభా వేదికపైకి రాకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కాసేపు అక్కడే వేచి చూసిన సంపత్‌కుమార్ వేదికపైకి పిలవకపోవడంతో సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.సరిత అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నాయకురాలిని ఇలా అవమానించడం ఏంటని మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడు మల్లురవితో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆయన వారిని సముదాయించారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సరిత, సంపత్‌కుమార్ వర్గీయులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినట్లు చెబుతున్న ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో సభాముఖంగా ప్రకటించాలని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు సభా ప్రాంగణానికి దూరంగా తీసుకెళ్లారు. హెలిప్యాడ్‌లో మంటలు: మంత్రి పొంగులేటి పర్యటనలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ సిగ్నల్ కోసం స్మోక్ ఫైర్ చేసిన సమయంలో కింద ఉన్న ఎండు గడ్డికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి ఘటనలో తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఐఏఎస్ అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు?. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.‘‘అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవోలో ఇరిగేషన్ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. అప్పుడు కనిపించని తప్పు.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో?.. అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా?’ అంటూ సీపీఆర్వో ట్వీట్ చేశారు.ఆ IAS అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు. .??అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా. .??అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (CMO లో Irrigation బాధ్యతలు నిర్వహించిన) వీరే. . ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో. .?? అసలు… pic.twitter.com/0KnHYAVeg5— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) April 19, 2025కాగా, స్మితా సబర్మాల్ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్‌లో ఆమె విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపై తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు. హాయ్ హైదరాబాద్ పోస్టును రీట్వీట్ చేశా. 2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్?. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా?’’ అని ట్వీట్ చేశారు. -
‘మోదీకి దాసోహమైంది మీరు కాదా?’
హైదరాబాద్: దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నది మీరంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నదని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు.. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు.. మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోదీకి దాసోహమయ్యారు.మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసింది. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్, పదేళ్లలో మోదీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదం. కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీ కి ఊడిగం చేసిది నిజం కాదా?, బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారు.సంఖ్యా బలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారు’ అని విమర్శించారు మహేష్ గౌడ్. -
బీఆర్ఎస్ బండారం బట్టబయలు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ బండారం బయటపడిందని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంను గెలిపించేందుకే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉందని ఆరోపించారు. భాగ్యనగర్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని రాజాసింగ్ ఆరోపణలు గుప్పించారు. భాగ్యనగర్‌లో బీఆర్ఎస్ను పాతరేస్తాం. మజ్లిస్‌ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండి అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు.కాగా, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. -
బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. 17 నెలల కాలంలో బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.హెచ్‌సీయూ భూ కుంభకోణం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఒక్క రూపాయైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే.. రేవంత్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్న.. కేటీఆర్.. బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు.చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ, హైడ్రా, మూసీ పేరుతో అరాచకాలు సృష్టిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనరని.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు.