సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..! | Sai Pallavi Ramayana: Significance of Jaap Mala Worn by the Actress | Sakshi
Sakshi News home page

Sai Pallavi: సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..!

Jul 30 2026 1:54 PM | Updated on Jul 30 2026 1:58 PM

Ramayanas Sai Pallavi Often Wears A Jaap Mala  What Its Significance

తమిళ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఆమె ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న  'రామాయణం' చిత్రంలో సీతాదేవి పాత్రను పోషించనున్నారు. తెరపైనే కాకుండా, నిజ జీవితంలో కూడా ఆమె తన నిరాడంబరమైన వ్యక్తిత్వం, సంప్రదాయబద్ధమైన జీవనశైలితో అశేష అభిమానులను సొంత చేసుకుందామె. అయితే ఆమె కనిపించినప్పుడు అందర్నీ ఆక‌ర్షించే వస్తువు  'జప మాల'. సాధారణంగా దీన్ని ఆమె కుడి చేతికి చుట్టుకుని కనిపిస్తుంటారామె. ఇది ఆమెకు అధ్యాత్మికత పట్ల ఉన్న భక్తి విశ్వాసాన్ని, ఆసక్తిని సూచిస్తోంది. ఆఖరికి ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'రామాయణం: ప్రథమ సంకల్ప' కార్యక్రమంలో కూడా, కాంచీవరం చీర, బంగారు ఆభరణాల తోపాటు ఎడమచేతికి జపమాల ధరించి కనిపించారు.  ఈ నేపథ్యంలో జపమాల ప్రాముఖ్యత, ఎందుకు ధరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

ఎందుకు ధరిస్తారంటే..
ఈ ముద్దుగుమ్మ సాయిపల్లవి సాధారణంగా గంధపు చెక్క (చందనం)తో చేసిన జప మాలను ధరిస్తుంటుంది. ఇది కేవలం అలంకరణ మాత్రం కాదట, మనిషిని నిలకడగా, సదా స్పృహతో, దైవంతో అనుసంధానమయ్యేలా చేస్తుందట. జప మాలలో ఉండే 108 పూసలు యాదృచ్ఛికం కాదని, ఆ సంఖ్యకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.  సనాతన ధర్మంలో 108 సంఖ్య అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది సృష్టి సంపూర్ణతను, ఆధ్యాత్మిక పరిపూర్ణతను సూచిస్తుంది. 

సాంప్రదాయం ప్రకారం, ఒక మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఏకాగ్రత, భక్తి, అంతర్గత పరివర్తన కలుగుతాయి. అలాగే 108 సంఖ్యను 108 ఉపనిషత్తులు, దేవతల 108 నామాలు, జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉండే అనుసంధానంతో ముడిపెట్టి చూస్తారు ఆధ్యాత్మికవేత్తలు. చాలా మంది జపం చేసేటప్పుడు చేతిలో మాలను తిప్పుతూ ఉంటారు. ధరించడానికి వివిధ రకాల జపమాలలు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 

అత్యంత సాధారణమైన జపమాల రకాలలో తులసి, రుద్రాక్ష, గంధపు చెక్క,  స్ఫటికం (క్రిస్టల్) మాలలు ఉంటాయి. ఇవేగాక తామర గింజలు, పసుపు లేక ఎరుపు గంధపు పూసలతో కూడా మాలలను తయారు చేస్తారు. అయితే ప్రతి ఒక్క మాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందట. అందరూ అన్నింటిని ధరించడం సాధ్యం కాదని అంటున్నారు. ఇక్కడ మాల అనేది కేవలం అలంకరణ కోసం ఎంచుకునే వస్తువు కాదట. ఇది  ఒక దైవం, మంత్రం లేదా నిర్దిష్ట సాధనతో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. 

ఏవేవి ఎందుకోసం అంటే..
శివ మంత్ర సాధన చేస్తుంటే, సాధారణంగా రుద్రాక్షకు ప్రాధాన్యత ఇస్తారు. విష్ణు లేదా కృష్ణ భక్తికి తులసి మాల ఎక్కువగా వాడతారు. ‍ప్రశాంతత, స్పష్టత కోసం స్పటికమాలను ఉపయోగిస్తారట. కొన్ని మాలలు సంప్రదాయబద్ధంగా నిర్దిష్ట దేవుళ్లకు లేదా గ్రహాలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే చాలామంది రుద్రక్షను ఎంచుకుంటారు. దీన్ని రక్షణ, స్థిరత్వం, క్రమశిక్షణతో కూడిన అంతర్గత జీవితాన్ని కోరుకునే వారు ఎంచుకుంటారని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు. 

ఎవరు ధరించవచ్చంటే..
రత్నాల వలె, మాలను ఎల్లప్పుడూ ధరించరని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. కొందరు కేవలం జపం చేసేటప్పుడు మాత్రమే ధరిస్తే, మరికొందరు అప్పుడప్పుడు ధరిస్తారు. ఉదాహరణకు, సాయి పల్లవి సినిమా సెట్లలో తప్ప, మిగతా సమయాల్లో జపమాలతోనే కనిపిస్తుంటారామె. మరికొందరు నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, మలవిసర్జన సమయాల్లోనూ తీసివేసి..మిగతా సమయంలో ధరిస్తుంటారు. 

నిరంతరం జపమాలను ధరించడం అనేది స్మరణ చుట్టూ అల్లుకున్న జీవనశైలికి అంకితం. అలాగే ఆధ్యాత్మిక చైతన్యం తమకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారని అర్థం. చివరగా ఇది ఫ్యాషన్‌ కోసం కాదని, భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్న సాంప్రదాయక అంశంగా పేర్కొన్నారు ఆధ్యాత్మిక నిపుణులు.

(చదవండి: ఉద్యోగం కోల్పోవడం, మూడుసార్లు వ్యాపారంలో నష్టం..చివరికి ఏకంగా రూ. 100 కోట్లు..)

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement