‘పాకిస్తానీ కశ్మీర్’ కాదు.. పీవోకే మాత్రమే: అమెరికా పత్రికకు భారత్ కౌంటర్ | India slams NYT over misleading headline on POK Pakistani Kashmir | Sakshi
Sakshi News home page

‘పాకిస్తానీ కశ్మీర్’ కాదు.. పీవోకే మాత్రమే: అమెరికా పత్రికకు భారత్ కౌంటర్

Jul 30 2026 9:06 AM | Updated on Jul 30 2026 9:29 AM

India slams NYT over misleading headline on POK Pakistani Kashmir

కశ్మీర్ అంశంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను ‘పాకిస్తానీ కశ్మీర్’గా పేర్కొంటూ అమెరికా ప్రముఖ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదప్రయోగం వాస్తవాలను వక్రీకరించేలా, తప్పుదారి పట్టించేలా ఉందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సదరు కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికాలోని భారత రాయబార కార్యాలయం న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. పాకిస్తానీ కశ్మీర్ అంటూ ఎలాంటి ప్రాంతం లేదు. ఉన్నది పాకిస్తాన్‌ అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్ (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) మాత్రమే అని స్పష్టం చేసింది. అలాగే, జమ్ము కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగాలేనని భారత్ పునరుద్ఘాటించింది. పాకిస్తాన్‌ ఈ ప్రాంతాల్లోని కొంత భాగాన్ని అక్రమంగా ఆక్రమించిందని ఆరోపించింది. భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై పాకిస్తాన్‌ బలప్రయోగం చేస్తోందని ఆరోపించింది. అక్కడి ప్రజల హక్కులు, భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని పేర్కొంది.

పీవోకేలో హింసపై కథనం
ఇటీవల పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్‌పూర్‌లో జరిగిన నిరసనలు, ఘర్షణలపై న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. స్థానిక సమస్యలు, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన నిరసనల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ ఘర్షణల్లో కాల్పుల కారణంగా పలువురు మృతి చెందినట్లు, పరిస్థితిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పాకిస్తాన్‌ను మానవ హక్కుల సంఘం కోరినట్లు కథనంలో పేర్కొంది. అయితే నిరసనకారుల ఆరోపణలను స్వతంత్రంగా నిర్ధారించలేదని కూడా ఆ కథనం పేర్కొంది.

పదప్రయోగమే వివాదానికి కారణం
న్యూయార్క్ టైమ్స్ కథనంలోని ఘటనల కంటే, దాని శీర్షికలో ఉపయోగించిన ‘పాకిస్తానీ కశ్మీర్’ అనే పదమే భారత్ అభ్యంతరానికి ప్రధాన కారణమైంది. కశ్మీర్‌కు సంబంధించి ఉపయోగించే పదాలు కేవలం భాషా పరమైనవి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ రాజకీయాల్లో ఎంతో సున్నితమైన అంశాలుగా మారుతుంటాయి. భారత్ దృష్టిలో పీవోకే అనేది పాకిస్తాన్‌ నియంత్రణలో ఉన్న భారత భూభాగం కాగా, పాక్‌ మాత్రం దానిపై భిన్నమైన వాదనను కొనసాగిస్తోంది.

ఇదిలా ఉండగా.. కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్‌ మధ్య దశాబ్దాలుగా భిన్న అభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరు దేశాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ ఉపయోగించిన పదప్రయోగంపై భారత్ స్పందించడం ద్వారా కశ్మీర్ అంశం మరోసారి అంతర్జాతీయ చర్చలోకి వచ్చింది. భౌగోళిక అంశాలతో పాటు పదాల ఎంపిక కూడా దౌత్యపరంగా ఎంత కీలకమో ఈ పరిణామం మరోసారి చాటిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement