నటి సోనాలీ బింద్రే ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..! ఆటోఫాగీ అంటే.. | What Is Autophagy: Sonali Bendre Credits Her Cancer Recovery To | Sakshi
Sakshi News home page

Sonali Bendre: నటి సోనాలీ బింద్రే ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..! ఆటోఫాగీ అంటే..

Jul 29 2026 2:08 PM | Updated on Jul 29 2026 5:03 PM

What Is Autophagy: Sonali Bendre Credits Her Cancer Recovery To

సినీ తారలు ఏం చేసినా ట్రెండే! వారు పాటించే ఆరోగ్య సూత్రాలు, తినడమూ, నిద్రించడమూ, వ్యాయామం ప్రతీదీ ఆసక్తిగొలిపే అంశమే. తాజాగా బాలీవుడ్‌ నటి సొనాలీ బింద్రే తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెల్‌నెస్‌ ప్రపంచంలో పెద్ద చర్చను లేవనెత్తాయి. తాను రోజులో ఏకంగా 18 నుంచి 20 గంటల పాటు ఇంటెర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తాననీ, శరీరంలో ఆటోఫాగీ అనే కణాల రీసైక్లింగ్‌ ప్రక్రియను ప్రేరేపించడానికే ఈ కఠిన నియమం అని సోనాలీ చెప్పుకొచ్చారు.

సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియా అంతా ఇపుడు ఆటోఫాగీ చర్చ నడుస్తోంది. 20 గంటలపాటు కడుపు మాడ్చుకుంటే కణాలు రీసైకిల్‌ అయి నిజంగానే యవ్వనంగా మారిపోతారా అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

ఆటో ఫాగీ( Autophagy) అంటే?
మన ఇంట్లో పాత వస్తువులు, చెత్త పేరుకుపోతే ఏం చేస్తాం? బయట పడేస్తాం లేదా రీసైక్లింగ్‌కు పంపుతాం కదా! సరిగ్గా మన శరీరం కూడా కణాల స్థాయిలో ఇదే పని చేస్తుంది. దాన్నే సైంటిఫిక్‌ పరిభాషలో ‘ఆటోఫాగీ’ అంటారు. కణాల్లో దెబ్బతిన్న ప్రోటీన్లు, పాతబడిపోయిన భాగాలు, పనికిరాని వ్యర్థాలను గుర్తించి, వాటిని విచ్ఛిన్నం చేసి, మళ్ళీ కొత్త శక్తిగా మార్చుకునే సహజ సిద్ధమైన, అద్భుతమైన ప్రక్రియ ఇది. ఈప్రక్రియ వల్ల వృద్ధాప్య ఛాయలు ఆలస్యమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, నరాల బలహీనత వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.

ఈ ఫాస్టింగ్‌ భ్రమేనా!
ఖచ్చితంగా కాదు! కాకపోతే దీన్ని అర్థం చేసుకునే విధానంలోనే తేడా ఉంది. అధిక బరువుతో బాధపడేవారు, ఫ్యాటీ లివర్, ఇన్సులిన్‌ సమస్యలు, బిపి ఉన్నవారికి ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ కొంతమేరకు పని చేస్తుందని కొన్ని పరిశోధనలలో తేలింది.   అయితే, దీనికోసం 20 గంటలపాటు కడుపు మాడ్చుకోకుండా

రోజులో 8 నుంచి 10 గంటల వ్యవధి సరిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆటోఫాగీ అనేది జీవశాస్త్రంలో ఒక అద్భుతమే అయినప్పటికీ.. అది ఆరోగ్యానికి, యవ్వనానికి ఒక్కరోజులో దొరికే షార్ట్‌కట్‌ మాత్రం కాదు. ఎక్కువ గంటలు పస్తులుండటం కంటే... క్రమం తప్పని వ్యాయామం, 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సమతుల ఆహారం వంటి రోజువారీ అలవాట్లే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. సినీ తారలు, సెలబ్రిటీల ట్రెండ్స్‌ చూడటానికి, వినడానికి బాగానే ఉన్నా శరీరం మనది.. ఆరోగ్యం మనది. అందువల్ల నిపుణుల సలహాలు లేకుండా ఎటువంటి ప్రయోగాలు చేయకపోవడమే ఉత్తమం!

ఇంటెర్మిటెంట్‌ ఫాస్టింగ్‌.. ట్రెండా.. సైన్సా..
ఇరవై గంటల పాటు ఉపవాసం ఉండగానే శరీరంలో ఆటోఫాగీ స్విచ్‌ ఆన్‌ అయి΄ోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, డాక్టర్లు మాత్రం ఇది అందరికీ శ్రేయస్కరం కాదని, తొందరపడవద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వెల్నెస్‌ ట్రెండ్స్‌కు, సైంటిఫిక్‌ నిరూపణలకు మధ్య చాలా వ్యత్యాసాలుంటాయని సూచిస్తున్నారు. 

సరిగ్గా ఇన్ని గంటలు ఉపవాసం ఉంటేనే ఆటోఫాగీ మొదలవుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి వయస్సు, జీవక్రియ, జన్యువులు, శారీరక శ్రమ, ఉపవాసానికి ముందు తిన్న ఆహారాన్ని బట్టి ఈ ప్రక్రియ మారుతుందనీ.. అందరికీ ఒకే రకమైన టైమర్‌ పనిచేయదని అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement