breaking news
autophagy
-
దేవుడి పేరుతో ఉపవాసం ఉండండి : పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కొన్నాళ్లుగా యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి నిర్వహిస్తున్న ఈ పాడ్‌కాస్ట్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. సరికొత్త విషయాలను చెబుతూ తన అభిమానులకు జ్ఞానంతో పాటు కొన్ని విషయాల్లో ధైర్యాన్ని కూడా అందిస్తున్నాడు. తాజాగా ఈ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ‘ఆటోఫజీ’ అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనుక ఉన్న కథను చెప్పాడు.‘‘ఆటోఫజీ’అనేది ఓ గ్రీకు పదం. ఆటో అంటే సెల్ఫ్ అని, ఫజీ అంటే తినడం అని అర్థం. దీన్నే ఇంగ్లీష్‌లో సెల్ఫ్ ఈటింగ్ అంటారు. ఇది శరీరంలో జరిగే జహన ప్రక్రియ. మన శరీరంలో ఉన్న పనికి రాని, దెబ్బతిన్న కణాలను మన శరీరమే తినేస్తుంది. ఆటోఫజీ(Autophagy) అనేది శరీరంలో జరిగే రీసైక్లింగ్ ప్రక్రియ. మన ఆరోగ్యానికి హానికలిగించే ఏ పదార్థం ఉన్నా, దాన్ని కూడా బయటకు పంపుతుంది. అలాగే, దెబ్బతిన్న ప్రొటీన్లను తీసేస్తుంది. ఈ ఆటోఫజీ వల్ల మన మెటబాలిజం పెరిగి, మరింత శక్తి చేకూరుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌లాంటి రోగాలు రాకుండా చేస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడే ఈ ఆటోఫజీ సక్రమంగా జరుగుతుంది. హీట్ అండ్ కోల్డ్ థెరపీలోనూ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన జీవన కాలం పెరుగుతుంది. మన ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. అందుకే పెద్దలు ఉపవాసం అలవాటు చేశారు. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, అప్పుడప్పుడు ఉపవాసాలు చేయండి. మీ వ్యాధి నిరోధకశక్తి, మెదడు పనితీరు పెరుగుతుంది. రోజూ వ్యాయామం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది. మన టిష్యులు రిపేర్ అయి, శరీరంలో హీలింగ్ ప్రక్రియ వేగం అవుతుంది. జపాన్‌కు చెందిన యష్నోరి అనే బయాలజిస్ట్ ఈ ఆటోఫజీ గురించి మొదట కనుక్కొన్నాడు. అతడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఉపవాసాలు, వ్యాయామాలు, చన్నీటి స్నానాల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అయి, ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే, మీ డాక్టర్‌ను సంప్రదించండి’ అని పూరి అన్నారు. ఇక సినిమాల విషయాలకొస్తే..పూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టాయి. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం పలు కథలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
జపాన్ శాస్త్రవేత్తకు వైద్య నోబెల్
* కణాల ఆత్మహత్యపై పరిశోధనకుగాను ఒషుమీకి బహుమతి * ‘ఆటోఫేజీ’ ప్రక్రియ గుట్టువిప్పిన శాస్త్రవేత్త స్టాక్‌హోమ్: కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్ధరించుకునే ప్రక్రియ(ఆటోఫేజీ) గుట్టు తేల్చిన జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీకి ఈ ఏడాది వైద్య శాస్త్ర నోబెల్ దక్కింది. కణాల ఆత్మహత్య లేదా కణాల స్వీయ విధ్వంసంగా పేర్కొనే ఈ ప్రక్రియలో లోపం వల్లే మనలో వృద్ధాప్యం వస్తుందని, కణాలు దెబ్బతిని పార్కిన్సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఒషుమి వయసు 71 ఏళ్లు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో నోబెల్ అవార్డుతో పాటు 8 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (రూ.6.23 కోట్లు) బహుమతిగా అందుకోనున్నారు. గతేడాది వైద్య నోబెల్‌ను సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులను ఎదుర్కొనే చికిత్సలను అభివృద్ధి చేసిన విలియం కాంప్‌బెల్(అమెరికా), సతోషి ఒముర(జపాన్), టు యూయూ(చైనా)లు సంయుక్తంగా అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నోబెల్ గెలుచుకున్న ఒషుమీతో జపాన్ మొత్తంగా 23వ నోబెల్ గెలుచుకుంది. వైద్య రంగంలో ఆ దేశానికి ఇది 6వ నోబెల్ బహుమతి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఒషుమీ మాట్లాడుతూ.. ‘‘ఇతరులు చేయాలనుకోని పనులు చేయాలనేది నా ఆలోచన. ఆటోఫేజీ చాలా ఆసక్తికరమైన అంశం. అంతా మొదలయ్యేది దానివద్దే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందరి దృష్టీ దానిపై ఉంది. నోబెల్ రావడం ఓ పరిశోధకుడికి అత్యుత్తమ గౌరవం’ అని పేర్కొన్నారు. ఏమిటీ ఆటోఫేజీ.? చేతికున్న వాచీ పాడైతే మరమ్మతు చేయిస్తాం. లేకపోతే కొత్తది కొనుక్కుంటాం. మరి మన శరీర కణాలు తమ లోపలి భాగాలు పాడైతే ఏం చేస్తాయో తెలుసా? వాటిని ఎంచక్కా ప్యాక్ చేసి.. కణంలోనే ఉండే రీసైక్లింగ్ విభాగానికి పంపేస్తాయి. లైసోసోమ్ అని పిలిచే ఈ భాగంలోకి వెళ్లే కణ భాగాలు తర్వాత క్రమేపీ నాశనమవుతాయి. దీనినే ‘ఆటోఫేజీ’ అంటారు. దీని అనంతరం ఆ కణాంగాల పునరుద్ధరణ జరుగుతుంది. ఆటోఫేజీ గురించి 1950ల్లోనే శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ దీని వెనుక ఉన్న జన్యువులేమిటి, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది మాత్రం 1990లలో జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీ ప్రయోగాల వల్ల అర్థమైంది. ఫలితంగానే ఉపవాసం శరీరానికి చేసే మేలేమిటో తెలిసింది. ఇన్ఫెక్షన్ సోకితే శరీరం ఎలా స్పందిస్తుందో అర్థమైంది. ఈ ఆటోఫేజీ కారక జన్యువుల్లో వచ్చే మార్పులు కేన్సర్ వంటి వ్యాధులకు ఎలా దారితీస్తాయో కూడా వెల్లడైంది. కణాల ఆత్మహత్య.. ఆటోఫేజీ అంటే గ్రీకు భాషలో తనను తాను తినేయడమని అర్థం (ఆటో అంటే స్వయంగా, ఫేజియన్ అంటే తినేయడం). కణాల్లో వేర్వేరు క్రియల కోసం ప్రత్యేకమైన గదుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఆర్గనెల్లే అని పిలుస్తారు. అయితే కణభాగాలు కొన్ని లైసోసోమ్లో ఉండడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు దీనికి కారణమేమిటని పరిశోధన చేశారు. కణంలోని పాడైన భాగాలు ప్రొటీన్లు, కొన్ని రకాల ఆర్గనెల్లేలు, త్వచాల తొడుగులతో వచ్చి లైసోసోమ్లో చేరుతున్నట్లు గుర్తించారు. లైసోసోమ్ తనలోని ప్రొటీన్లు, ఎంజైమ్‌లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల సహాయంతో ఆ భాగాలు నశించిపోయేలా చేస్తున్నట్లు తేల్చారు. 1974లో నోబెల్ పొందిన క్రిస్టియన్ డూవ్ ఈ ప్రక్రియకు ఆటోఫేజీ అని పేరుపెట్టారు. దీంతో కణభాగాలను మోసుకొచ్చే సంచులను ఆటోఫేజసోమ్స్ అని పిలుస్తున్నారు. తొలుత ఈస్ట్‌పై ప్రయోగాలు..: ఆటోఫేజీ ప్రక్రియ గుట్టు ఛేదించేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. చివరికి ఒషుమీ 1998లో ఈస్ట్ కణాల్లో లైసోసోమ్ మాదిరిగానే పనిచేసే ఓ ఆర్గనెల్లేపై ప్రయోగాలు చేశారు. కొన్ని ప్రయోగాల ద్వారా ఈస్ట్ కణాల్లో ఆటోఫేజీ ప్రక్రియ జరుగుతోందని నిర్ధారించుకున్న ఒషుమీ... తర్వాత జన్యుమార్పులను గుర్తించే ప్రయోగాలతో ఆటోఫేజీకి కారణమైన కీలక జన్యువులను గుర్తించారు. మరింత పరిశోధన ద్వారా ఈ జన్యువులు ఉత్పత్తి చేసే ప్రొటీన్లు ఆటోఫేజసోమ్స్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో గుర్తించారు. ఇలాంటి ప్రక్రియే మానవుల్లోనూ ఉన్నట్లు తర్వాత వెల్లడైంది. విస్తృతంగా పరిశోధనలు..: ఆటోఫేజీ ప్రక్రియ గర్భంలో పిండం అభివృద్ధి చెందేందుకు, మూలకణాలు వేర్వేరు కణాలుగా అభివృద్ధి చెందేందుకూ ఉపయోగపడుతుందని గుర్తించారు. పాడైపోయిన ప్రొటీన్లు, ఆర్గనెల్లేలను వదిలించుకునేందుకు, ఇన్ఫెక్షన్లకు ఎలా స్పందించాలన్నది కూడా ఆటోఫేజీ ద్వారా తెలుస్తోందని నిర్ధారించారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం వల్లే వయోధికుల్లో టైప్-2 మధుమేహం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయని తేల్చారు. కేన్సర్, జన్యు వ్యాధులకూ ఆటోఫేజీతో సంబంధమున్నట్లు భావించి.. ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఆటోఫేజీని ప్రభావితం చేయడం ద్వారా వ్యాధులకు సమర్థమైన చికిత్సలను అందించేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
మత్తెక్కువయితే మెదడు గోవింద!
న్యూయార్క్: కొకైన్ వంటి మత్తుపదార్థాలను శృతిమించి ఉపయోగించడంవల్ల మెదడుకు తీరని హాని కలుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అత్యధిక కొకైన్ వాడకంవల్ల బ్రెయిన్ తనను తానే తినేస్తుందని, మెదడులోని కణాలు వాటిని అవే తినేస్తాయని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు అధ్యయనకారులు తెలియజేస్తూ 'పెద్దమొత్తంలో కొకైన్ తీసుకోవడం మూలంగా మెదడులో నియంత్రణ అదుపుతప్పి, అందులోని కణజాలం పూర్తిగా హరించుకోవడం ప్రారంభమవుతుంది. అందులోని కణాలు వాటిని అవే తినేస్తాయి. దీనినే ఆటోపగి అంటారు' అని వారు చెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వారు ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. గర్భిణీగా ఉన్నవారు కొకైన్ తీసుకున్నా కూడా వారి గర్భంలోని శిశువు మెదడులో కూడా మృతకణాలు కనిపించినట్లు తెలిపారు.