‘దళపతి’ మైండ్ గేమ్‌.. దిక్కుతోచని బీజేపీ? | BJP offers Deputy CM post to Vijay Sources | Sakshi
Sakshi News home page

‘దళపతి’ మైండ్ గేమ్‌.. దిక్కుతోచని బీజేపీ?

Mar 15 2026 12:03 PM | Updated on Mar 15 2026 12:16 PM

BJP offers Deputy CM post to Vijay Sources

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’  పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.

బంపర్ ఆఫర్.. కానీ మెలిక!
ఈ పొత్తులో భాగంగా విజయ్‌కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్‌కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.

రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..
విజయ్‌ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్‌తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.

విజయ్ క్యాంపులో అంతర్మథనం
మరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement